ప్రస్తుతం ఉన్న 3,50,000+2,50,000 కలిపి సాంకేతిక ఉపాధికి అతిపెద్ద రంగంగా అవతరణ ఆన్ లైన్ రిటైల్ రంగంలో ఈ ఏడాది కొత్తగా రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రంగంలో ఉద్యోగ కల్పన వృద్ధి 65 శాతం వరకు ఉండొచ్చనీ భావిస్తున్నారు. గత ఏడాది ఈ-కామర్స్ వ్యాపారం భారీగా వృద్ధి చెందడంతో ఆ రంగంలో ఉద్యోగావకాశాలు ఇప్పటికే భారీగా పెరిగాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో మరింతగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగాల జాతర ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్తల సంఘం అసోచామ్ తాజా నివేదికలో వెల్లడించింది. 2016లో ఆన్ లైన్ రీటైల్ రంగంలో 2,50,000 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. గత ఏడాది కాలంలో అత్యధిక ఈ-కామర్స్ వ్యాపార సంస్థలు తమ టర్నోవర్ను పెంచుకోవడం కనిపించిందనీ.. భవిష్యత్తులో ఈ పరిశ్రమ బాగా విస్తరించేందుకు ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నట్లుగా అసోచామ్ నివేదికలో పేర్కొన్నారు. 2009లో 380 కోట్ల డాలర్ల వ్యాపారం చేసిన ఈ-కామర్స్ రంగం 2014లో 1700 కోట్ల డాలర్లకు విస్తరించిందనీ.. వచ్చే ఏడాదికి ఇది 2300 కోట్ల డాలర్లకు 2016 నాటికి 3800 కోట్ల డాలర్ల మార్కును చేరుతుందని అసోచామ్ నివేదికలో విశ్లేషించింది. కొత్తగా సప్లయి విభాగంలోనూ, లాజిస్టిక్, అనుబంధ యూనిట్లలో ఉపాధి తదిరత అంశాలతో పాటుగా తాత్కాలిక ఉద్యోగాలను కలుపుకొని 2,50,000 కొలువులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అసోచామ్ లెక్కలు వేసింది. ఈ-కామర్స్ రంగంలో ఇప్పటికే 3,50,000 మంది పని చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, రిటైలర్స్ నుంచి పెట్టుబడులు పెరగడం తదితర అంశాలు దేశంలో ఈ-కామర్స్ విస్తరించేందుకు దోహదం చేస్తున్నట్లుగా నివేదిక తెలిపింది. దేశీయ ఈ-కామర్స్ లో మొబైల్ కామర్స్ వాటా 20 నుంచి 25 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో మొత్తం ఈ-కామర్స్ వాటలో మొబైల్ కామర్సే అధిక శాతం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగావకాశాలను కల్పించనున్న ఈకామర్స్ రంగం వచ్చే రెండుమూడేళ్లలో సుమారు 6 లక్షల ఉద్యోగాలు కల్పనకు వేదికవుతుందని అసోచామ్ అంచనావేసింది. ఇంతకాలం ఆఫ్ లైన్ వ్యాపారాలుగా ఉన్న టాక్సీ సర్వీసులు, రెస్టారెంట్ సేవలు కూడా ఇప్పుడు ఆన్ లైన్ సేవలు అందిస్తుండడంతో ఈ రంగం మరింతగా విస్తరిస్తోంది. ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో మేనేజిమెంటు కోర్సులు చదివినవారు కూడా ఇప్పుడు ఈకామర్స్ రంగంలో పనిచేయడానికే ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ రంగం ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు టాప్ బిజినెస్ స్కూళ్ల నుంచి వచ్చేవారంతా కన్సల్టెన్సీలు, ఫైనాన్స్ సంస్థల్లో ఉద్యోగాలకు మొగ్గుచూపేవారు. ఇప్పుడు ఈకామర్స్ అంటూ పరుగులు తీస్తున్నారు. |