ఆటోమేషన్ అనే పదం ఇప్పుడు ప్రపంచాన్ని అత్యంత కలవరపెడుతోంది. టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ అది మన జీవితాన్ని ఎఫెక్ట్ చేయడం పెరిగిపోతోంది. సాయంత్రమైతే నలుగురూ ఒకచోట చేరి కష్టసుఖాలు చెప్పుకునే రోజులన్నీ టీవీలు, డీటీహెచ్‌లతో పోయాయి. ఇక స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌లు వచ్చాక పక్కనున్న మనిషిని కూడా పలకరించకుండా వాటిలో మునిగిపోతున్నాం. ఇవన్నీ మన వ్యక్తిగత జీవితంలో టెక్నాలజీ వల్ల వచ్చిన కష్టాలు. కానీ ఏకంగా మన బతకుదెరువుకే ముప్పు తెస్తోంది ఆటోమేషన్.
ఆటోమేషన్ అంటే?
సింపుల్. మనం చేసే పనుల్ని రోబోట్స్‌తో చేయించడం. ముఖ్యంగా పెద్దగా స్కిల్ అవసరం లేని పనులు ఆఫీస్‌బాయ్, క్లర్క్, టెలిఫోన్ ఆపరేటర్, ఫ్యాక్టరీలో కార్మికులు ఇలాంటి పనులన్నీ చేయడానికి రోబోట్స్‌ను ప్రోగ్రామ్ చేసి పెట్టేస్తారు. ఇవి మాన్యువల్ లేబర్ కంటే తక్కువ ఖర్చవుతుంది. ఒక్కసారి కొంటే చాలు ఛార్జింగ్ పెడితే పని చేసేస్తాయి. నెలనెలా జీతాలివ్వాల్సిన పని లేదు. సెలవులు, బోనస్‌లు అడగవు. అందుకే ఇలాంటి వాటితో కిందిస్థాయి ఉద్యోగాలు చాలా పోతాయంటున్నారు నిపుణులు. పేద దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్‌లో రెడీమేడ్ బట్టలు తయారుచేసే పరిశ్రమలు భారీ సంఖ్యలో ఉంటాయి. వీటిలో లేబర్ కూడా చాలా తక్కువ జీతానికి పనిచేస్తారు. 2005లో ఓ సర్వే ప్రకారం బంగ్లాదేశ్‌లో ఓ షర్ట్ కుడితే రూపాయిన్నర ఇచ్చేవారు.ఇప్పుడు కూడా అది 10 నుంచి 15 రూపాయలు దాటదు. అంత తక్కువ వేతనాలిచ్చే చోట కూడా రోబోట్స్‌ను వినియోగించడం మొదలైంది. అంటే ఇక రోబోట్స్ వల్ల ఖర్చు ఎంత తక్కువగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫ్రే అండ్ రాబరీ అనే సంస్థ అంచనా ప్రకారం ఆటోమేషన్ వల్ల జాబ్‌లు పోయే రిస్క్ చైనాలో 77% ఉంటే ఇండియాలో 69% జాబ్స్ పోయే ప్రమాదం ఉందట.
ఈ పరిశ్రమల్లో ఎక్కువ
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారుచేసే పరిశ్రమల్లో ప్రస్తుతం ఈ రోబోట్స్ వినియోగం ఎక్కువగా ఉంది. ఇండియా,చైనాల్లో ఉన్న మొత్తం రోబోట్స్‌లో 39% ఈ రెండు ఇండస్ట్రీల్లో ఉన్నాయట. ఆటోమొబైల్ తయారీ పరిశ్రమల్లోనూ రోబోట్స్ వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎక్కువగా మెషినరీతో పనిచేసేవే. కానీ ముందు ముందు రోబోట్స్ ఎక్కువ మంది కార్మికులు పనిచేసే వస్త్రపరిశ్రమ వంటి వాటిలోకి కూడా వస్తే ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. బట్టల తయారీ పరిశ్రమలు ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్‌లో ఈ పరిస్థతి ఆల్రెడీ స్టార్టయింది. ఇక ఆఫీసులు, బ్యాంకులువంటి వాటిల్లో కూడా ఇలాంటివి వస్తే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.
కొత్త జాబ్‌లూ వస్తాయి
అయితే రోబోటిక్స్ వల్ల ఉన్నత స్థాయి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది. దిగువ, కాస్త మధ్య స్థాయి ఉద్యోగాలే ఎక్కువగా పోతాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే రోబోటిక్స్ వల్ల తయారీ రంగం ఊపందుకుంటుంది. మాన్యుఫాక్చరింగ్ స్పీడ్ అయి ఇండస్ట్రీ పరిధి పెరుగుతుంది. అప్పుడు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. సెల్‌ఫోన్‌రిపేర్ టెక్నీషిఒయన్, మెషినింగ్ టెక్నీషయిన్, సీఎన్‌సీ ప్రోగ్రామర్, సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్ టెక్నీషియన్, కంప్యూటరైజ్డ్ న్యూమరికల్ కంట్రోల్ (CNC) ఆపరేటర్, CNC సెట్టర్ కమ్ ఆపరేటర్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్‌లాంటివన్నీ గత పదేళ్లలో కొత్తగా పుట్టుకొచ్చిన జాబ్‌లే. ఇలాంటివి ఏమున్నాయి, వేటికి డిమాండ్ ఉందో తెలుసుకుని వాటిని నేర్చుకోవడం ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగులందరికీ కీలకం కాబోతోంది. ఇలాంటి వాటిలో ఎవరు ముందుంటే వారికి భవిష్యత్తు ఉంటుందన్నది మాత్రం ఖాయం.