• తాజా వార్తలు

2.3 కోట్ల అప్లికేష‌న్లు.. ఒక ల‌క్ష రైల్వే ఉద్యోగాలు.. టెక్నాల‌జీ అంతా టీసీఎస్‌ది

ప్ర‌పంచ‌లోనే అత్యంత భారీ రిక్రూట్‌మెంట్ ఇది! వంద‌లు కాదు.. వేలు కాదు.. లక్ష‌ ఉద్యోగాలు! సాధార‌ణ ఉద్యోగ నోటిఫికేష‌న్‌కే ల‌క్ష‌ల్లో ద‌ర‌ఖాస్తులు వ‌స్తే.. ఇక‌ ల‌క్ష ఉద్యోగాల‌కు ఇంకెన్ని ద‌ర‌ఖాస్తులు వ‌స్తాయోన‌ని ఆలోచిస్తున్నారా?  మీ ఊహ నిజ‌మే. ల‌క్ష ఉద్యోగాల‌కు మొత్తం 2.3 కోట్ల ద‌ర‌ఖాస్తులు! ఇంత‌మందికి ఆన్‌లైన్లో ప‌రీక్ష నిర్వ‌హించేందుకు  సాంకేతిక‌త‌ను టెక్ దిగ్గ‌జం టీసీఎస్ అంద‌జేస్తోంది! ఈ భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ చేసే సంస్థ భార‌తీయ‌ రైల్వే! 

రైల్వేకి వెన్నుద‌న్నుగా టీసీఎస్ 
రైల్వే శాఖ నిర్వ‌హించే ఈ అతి పెద్ద‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు టీసీఎస్ వెన్నుద‌న్నుగా నిలుస్తోంది. TCS iON అనే ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ ప్లాట్‌ఫామ్‌ని ఉప‌యోగించ‌బోతున్నారు. అత్యంత శ‌క్తిమంత‌మైన Question Creation Wizardను దీని కోసం టీసీఎస్ రూపొందించింది. దీనిని ఉప‌యోగించే ప్ర‌శ్న‌లు రూపొందిస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకునే పోస్టును బ‌ట్టి  ప్ర‌శ్న‌లు జంబ్లింగ్ ప‌ద్ధ‌తిలో మారుతూ ఉంటాయి. ప్ర‌శ్న‌ల క‌ఠిన‌త్వాన్ని బ‌ట్టి ప్ర‌శ్న‌లు వ‌రుస క్ర‌మంలో వ‌స్తాయి. దీనిని స్టాటిస్టిక‌ల్ నార్మ‌లేజేష‌న్ అని పిలుస్తుంటారు. పేప‌ర్ లీకేజీ, ఇత‌ర మోసాల‌కు తావులేకుండా ఆన్‌లైన్ ప‌రీక్ష‌కు 128 బిట్ ఎన్‌క్రిష్ష‌న్‌ను ఉప‌యోగించింది. సంప్ర‌దాయ ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిని కాద‌ని, ఆన్‌లైన్ విధానంలో ప‌రీక్ష నిర్వ‌హించేందుకు రైల్వే  ముందు కొచ్చేందుకు ఇదే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. 

దీని గురించి మ‌రికొన్ని విష‌యాలు
* రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఆగ‌స్టు 9 నుంచి ప్రారంభ‌మై నెల రోజుల పాటు జ‌రుగుతుంది. 
* 15 భాష‌ల్లో 500 సెంట‌ర్ల‌లో ప‌రీక్ష జ‌ర‌గ‌బోతోంది. 
* మాల్ ప్రాక్టీస్ జ‌ర‌గ‌కుండా ప‌రీక్ష కేంద్రాల్లో  కెమెరాలు, మొబైల్ జామ‌ర్లు, మెట‌ల్ డిటెక్ట‌ర్లు వంటివి అమ‌రుస్తారు. 
* ఇప్ప‌టికే 47 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేశారు. వీరిలో ల‌క్ష మందిని రిక్రూట్ చేసుకుంటారు. 
* అసిస్టెంట్ లోకో పైల‌ట్, టెక్కీషియ‌న్స్ పోస్టులు 26,502 ఉండ‌గా.. 47 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వచ్చాయి. 
* లెవెల్‌-1 పోస్టులు 62,907 ఉండ‌గా 1.9కోట్ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.
* 10 కోట్ల వ‌ర‌కూ అప్లికేష‌న్స్ వ‌చ్చే భారీ పోటీ ప‌రీక్ష‌కు సాంకేతిక సాయాన్ని టీసీఎస్ అందించ‌గ‌ల‌దు. ఇప్పుడు రైల్వే ప‌రీక్షను 135,000 కంప్యూట్ నోడ్స్‌తో సాయం అందిస్తోంది.
* భార‌తీయ రైల్వే ఈ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌డం వ‌ల్ల దాదాపు 10 ల‌క్ష‌ల చెట్లను కాపాడ‌వ‌చ్చు. అంటే ప‌ది ల‌క్ష‌ల చెట్ల నుంచి త‌యారయ్యే పేప‌ర్లు.. ఈ ప‌రీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మ‌వుతాయి. 
* టీసీఎస్‌తో పాటు మ‌రో రెండు కంపెనీలు కూడా ఈ ప‌రీక్ష‌కు టెక్నిక‌ల్ స‌పోర్ట్ అందించేందుకు ముందుకొచ్చాయి. కానీ  వాట‌న్నింటినీ కాద‌ని టీసీఎస్‌నే రైల్వే ఎంచుకుంది. కార‌ణం.. ఈ కంపెనీ వార్షిక ట‌ర్నోవ‌ర్‌.. 150 మిలియ‌న్ డాల‌ర్లు(ల‌క్ష కోట్లు).

జన రంజకమైన వార్తలు