• తాజా వార్తలు

ఈ యాప్ తో ట్రాఫిక్ కష్టాలకు సెలవ్..


హైదరాబాద్ సిటీ అంటే ట్రాఫిక్ కు పెట్టింది పేరు. పైగా.. మెట్రో పనులు. దాంతో ట్రాఫిక్ మరింత పెరిగిపోయింది. అయితే.. హైదరాబాద్ అధికారులు ట్రాఫిక్ కష్టాల నుంచి కొంతలో కొంత ఉపశమనం కలిగించేందుకు.. మరెన్నో ఇతర సదుపాయల కోసం కొత్త యాప్ ఒకటి తీసుకొచ్చారు. దీన్ని వాడుతున్నవారంతా సూపర్ అంటున్నారు. 'హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌ యాప్‌ తో బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయి. రద్దీ సమాచారమే కాదు, మనం వెళ్లాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు, ఆటో ఛార్జీల వివరాలు, ఈచలానా వివరాలు వంటివెన్నో ఉంటాయి. ఇప్పటికి 60వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారంటే దీనికి ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రూట్ మ్యాప్..
పాఠశాలలు, కార్యాలయాలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, వాణిజ్యసముదాయాలు, మల్టీప్లెక్స్‌లు నిత్యం రద్దీగా ఉంటుంటాయి. ఇక కారో, బైకో నడుపుతూ ఇంటి నుంచి బయటికి వస్తే గమ్యస్థానం చేరడానికి రద్దీలో అగచాట్లు పడాల్సిందే. ఆ దారిలో బస్సులు ఆగిపోయినా, మురుగునీటి ప్రవాహం పొంగుతున్నా, ధర్నాలు, వూరేగింపులు కొనసాగుతున్నా ఇక అంతేసంగతులు. వీటి గురించి ముందే తెలుసుకుని వెళ్లేందుకు యాప్‌లోని ‘లైవ్‌ ట్రాఫిక్‌’ ఉపయోగపడుతుంది. మనం బైకులు, కార్లతో ప్రయాణించే దారిలో ఏవైనా అవాంతరాలుంటే ప్రత్యామ్నాయ మార్గాలను మ్యాప్‌లో చూపిస్తుంది.
వాహనం ఆచూకీ తెలుసుకోవచ్చు
అత్యసర పనులు, హడావుడితో పార్కింగ్‌ లేని ప్రాంతాలో బైకులు, కార్లు పెట్టేస్తుంటాం. ఎదురుగా ఉన్న హోటల్‌లో కాఫీ తాగి వచ్చేద్దాం కదాని ఏదైనా అనుబంధ రహదారిలో నిలిపేస్తుంటాం. తిరిగి వచ్చేసరికి అవి కనిపించవు. ట్రాఫిక్‌ క్రేన్‌ తీసుకుని వెళ్లిపోయింటుంది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఏ ఠాణా పోలీసులకు ఫోన్‌ చేయాలో అర్థంకాదు. ట్రాఫిక్‌ లైవ్‌ యాప్‌లోని 'ఫైండ్‌ యువర్‌ వెహికల్‌’ అన్న మీటను నొక్కితే మీ వాహనాన్ని ఏ ఠాణా సిబ్బంది తీసుకెళ్లారు? ఆ అధికారి పేరు, ఫోన్‌ నంబరు, వాహనం ఉన్న ప్రాంతం ఫోన్‌ తెరపై కనిపిస్తాయి. అందులో ఉన్న నంబర్ల ద్వారా వాహనాన్ని కాస్త సులభంగా తీసుకోవచ్చు.
ఈచలానా పేమెంట్.
ద్విచక్ర వాహనచోదకులు, కార్లు, భారీ వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఈచలానాలు ఇంటికి వస్తుంటాయి. దీంతోపాటు ట్రాఫిక్‌ పోలీసులు ఆపి రసీదు ఇస్తుంటారు. వీటిని కట్టడం మర్చిపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎన్నిచోట్ల నిబంధనలు ఉల్లంఘించారో తెలుసుకోవాలంటే 'ఈచలానా స్టేటస్‌’లోకి వెళ్లి చూస్తే చాలు.
ట్రాఫిక్‌ పరిస్థితి తెలియాలంటే
నగర ప్రజలు, ప్రయాణీకులతో పాటు విదేశీయులు, పర్యాటకులు కూడా ట్రాఫిక్‌ సమాచారాన్ని యాప్‌లోని 'పబ్లిక్‌ ఇన్‌ఫర్‌మేషన్‌’ ద్వారా తెలుసుకునే వీలుంంది. నిబంధనలు, జరిమానాలు, ప్రయోజనాన్నిచ్చే వెబ్‌సైట్లు, కూడళ్లు, ట్రాఫిక్‌ అత్యున్నత అధికారి నుంచి కానిస్టేబుల్‌ వరకు వివరాలు, ఫోన్‌ నంబర్లు ఉంటాయి.
పోలీస్‌ సాయం ఎక్కడైనా
రద్దీ ప్రాంతాల్లో ఎవరైనా ఇబ్బందులు పెట్టినా, అనుకోని సమస్యలు వచ్చినా, ఏదైనా ఫిర్యాదు చేయాలనుకున్నా సమీపంలో ట్రాఫిక్‌ పోలీస్‌ఠాణా ఎక్కడుందో తెలియదు. 'నియరెస్ట్‌ పోలీస్‌ స్టేషన్స్‌’ పేరుతో ఉన్న మీటను నొక్కగానే ఆ ప్రాంతాన్ని చూపుతూ నీలిరంగు వస్తుంది.
ఉల్లంఘిస్తే..
ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు ఎవరైనా పాల్పడితే పోలీసులే కాదు.. వాహనచోదకులు, ప్రజలు, ప్రయాణీకులు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇవ్వొచ్చు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌లైవ్‌’ యాప్‌లోకి వెళ్లి ఖపబ్లిక్‌ ఇంటర్‌ఫేస్‌’ అన్నది క్లిక్ చేసి వెంటనే సంబంధిత అంశాన్ని టైప్‌ చేసి దృశ్యాలను తీసి అక్కడ పేర్కొన్న చిరునామాకు పోస్టు చేయాలి.
ఆటో ఛార్జీల విషయంలో మోసపోకుండా..
బంజారాహిల్స్‌ నుంచి ఖైరతాబాద్‌కు ఆటోలో రావాలంటే ఉదయం, మధ్నాహ్నం వేర్వేరు ధరలను చోదకులు చెబుతుంటారు. కొందరు మీటర్లు వేయరు. అందుకే 'ఆటో ఫేర్‌ ఎస్టిమేషన్‌’లోకి వెళ్లి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో నమోదు చేస్తే సరి. పగలైతే కనీస ఛార్జి రూ.20, రాత్రయితే రూ.30 చెల్లించాలి. మీరు వెళ్లాల్సిన ప్రదేశాలను నమోదుచేసిన వెంటనే డ్రైవర్‌కు ఇవ్వాల్సిన మొత్తం మీ మొబైల్‌ తెరపైకి వస్తుంది. ఉదాహరణకు బంజారాహిల్స్‌ ఖైరతాబాద్‌కు ఆటోలో ప్రయాణిస్తే రూ.68.54 అని చూపిస్తుంది.
బస్సులు, క్యాబ్‌లు, ఆటోలపై ఫిర్యాదులు
సరైన సేవలు అందించని ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోలపై వినియోగదారులు, ప్రయాణీకులు ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు 'కంప్లైంట్‌ అగైనెస్ట్‌ పబ్లిక్‌ సర్వీస్‌’ అప్లికేషన్‌ ఉపయోగపడుతుంది. అందులోని ఐచ్ఛికాంశాలను ఎంచుకుని వాటిని నమోదు చేసిన క్షణాల్లోనే పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటారు. సమీపంలో ఉన్న కానిస్టేబుల్‌ ఫిర్యాదిదారుతో ఫోన్‌లో మాట్లాడి ఆ వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని వైర్‌లెస్‌ సెట్‌ ద్వారా ట్రాఫిక్‌ విభాగానికి అందిస్తారు. అవి ఎక్కడుంటే అక్కడ నిలిపేస్తారు.

జన రంజకమైన వార్తలు