• తాజా వార్తలు

హైదరాబాద్ లోనే సంవత్సరానికి 20 లక్షల ఫోన్ల తయారీ..

హైదరాబాద్ నగరానికి స్మార్ట్ ఛాన్సు దక్కింది.  అవును... స్మార్టు ఫోన్ల తయారీ రంగానికి హైదరాబాద్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే పలు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా స్మార్ట్ ఫోన్ల తయారీ ప్రారంభించగా తాజాగా కెనడాకు చెందిన డాటావిండ్ ఇన్నోవేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ లో ఫోన్ల పరిశ్రమ ఏర్పాటుచేస్తోంది. ఇది ఏడాదికి 20 లక్షల స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల తయారీ లక్ష్యంగా ఏర్పాటువుతోంది.

డేటావిండ్ తక్షణమే పనులు ప్రారంభించి మూడు నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించనుంది.  తెలంగాణ గవర్నమెంటు, డాటావిండ్ మధ్య ఇప్పటికే ఒప్పందం కూడా కుదిరింది. సెల్ ఫోన్లకు  సంబంధించి తెలంగాణలో ఇప్పటికే మైక్రోమాక్స్‌, సెల్‌కాన్‌ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. డేటావిండ్‌ మూడో పరిశ్రమ. శంషాబాద్‌ విమానాశ్రయ సమీపంలోని పారిశ్రామిక పార్కులో గల రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానుంది. మొదటి దశ కింద రూ.వంద కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఆకాశ్‌ టాబ్లెట్లను ఉత్పత్తి చేసిన డేటావిండ్‌కు ప్రస్తుతం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తయారీ పరిశ్రమ ఉంది. భారత్‌లో తమ రెండో పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

కాగా డాటావిండ్ ఇప్పటికే మొబైల్, టాబ్లెట్ మార్కెట్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. రూ.2000 ప్రారంభ ధరతో ఫోన్లు, రూ.5999 ప్రారంభ ధరతో టాబ్లెట్లను, రూ.7999 ప్రారంభ ధరతో నోట్‌బుక్‌లను విక్రయిస్తున్నారు. సౌత్ ఇండియాలో నెలకు లక్ష డాటావిండ్ సెల్ ఫోన్లు సేల్ అవుతున్నాయి. దక్షిణ భారత దేశంలో ప్రతీ నెలా రూ.లక్ష చరవాణులను విక్రయిస్తున్న డాటావిండ్ హైదరాబాద్ కేంద్రంగా తయారీ ప్రారంభిస్తే మార్కెట్లో మరింత దూకుడు చూపించడం ఖాయం.

 

జన రంజకమైన వార్తలు