• తాజా వార్తలు

ప్రపంచంలోనే తొలి గ్లాస్ ఫ్రీ గాడ్జెట్స్ యూనిట్ తెలంగాణలో...

గ్లాస్‌ఫ్రీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు దుబాయికి చెందిన ఎరైస్ కంపెనీ ముందుకొచ్చింది. ప్రపంచంలో తొలిసారిగా గ్లాస్‌ఫ్రీ మొబైల్, ట్యాబ్స్, టెలివిజన్లను తయారు చేస్తున్న ఈ సంస్థ, తెలంగాణలో 125 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో యూనిట్ స్థాపించేందుకు అంగీకరించింది. ఎపిక్ బ్రాండ్ పేరుతో ఈ ఉత్పత్తులను విక్రయిస్తారు. యూనిట్ స్థాపనకు భూమి కేటాయించాలని సిఎం కెసిఆర్‌ని కంపెనీ ప్రతినిధులు కోరారు. శనివారం కంపెనీ ప్రతినిధులు సిఎం కె చంద్రశేఖర్‌రావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. టిఎస్‌ఐపాస్ కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సిఎం వారికి సూచించారు. 15 రోజుల్లో అనుమతి లభిస్తుందని చెప్పారు. పారిశ్రామిక విధానం కాపీని వారికి అందజేశారు. ప్రపంచంలో ఇదో గొప్ప విధానమని చెప్పారు. 2015 జూన్ తరువాత 82 పరిశ్రమలకు ఈ విధానం కింద అనుమతి ఇచ్చామని, వీటిలో 13 కంపెనీల్లో ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు.

తాము ఇప్పటికే ఇలాంటి టెలివిజన్లను కొరియాలో, ట్యాబ్‌లెట్స్, మొబైల్స్‌ను చైనాలో తయారు చేస్తున్నట్టు ఎరైస్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తెలంగాణలో తమ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కాగా ఎరైస్ ఒక్కటే కాకుండా పలు ఇతర సంస్థలు కాకుండా ఇప్పటికే ఇలాంటి మొబైల్ ఫోన్ల ను తయారుచేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ర్టానిక్స్, కంప్యూటర్ల రంగంలో ఉన్న సంస్థలు ఇలాంటి గ్లాస్ ఫ్రీ ఫోన్ల తయారీలో ముందుంటున్నాయి. ఎలక్ర్టానిక్స్ ఉత్పత్తులకు పేరుగాంచిన షార్ప్ సంస్థ ఇప్పటికే అయిదుకు పైగా ఇలాంటి గ్లాస్ ఫ్రీ మొబైల్స్ విడుదల చేసింది. కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్ పీ నుంచి కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇక శ్యాంసంగ్, సాన్సుయ్, ఎల్ జీ, మోటారాలా సంస్థలూ ఇలాంటి మోడల్స్ ను విడుదల చేశాయి... అయితే... పూర్తిగా గ్లాస్ ఫ్రీ గాడ్జెట్లు మాత్రమే తయారుచేసే సంస్థ మాత్రం ఎరైస్. ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయేది కూడా పూర్తిగా ఇలాంటి ఉత్పత్తులకు సంబంధించిన యూనిట్టే కావడం విశేషం.

 

జన రంజకమైన వార్తలు