• తాజా వార్తలు

వాట్సాప్ తో వెయ్యి ఎకరాల వరి పంటకు ప్రాణం

సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకుంటే ఆ ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయన్నది తెలంగాణ రాష్ర్టంలో ఓ రైతు నిరూపించాడు. నీటిపారుదలకు సంబంధించి ఏర్పడిన సమస్యను ఏకంగా మంత్రి దృష్టికి వాట్సాప్ సహాయంతో తీసుకెళ్లి వెయ్యి ఎకరాల పంటను కాపాడాడు.
వాట్సాప్ లోనే సమస్య చెప్పి..
తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపేట గ్రామంలోని పంగిడి చెరువుగా పిలిచే చెరువు నీరు పంట పొలాలకు రాక రైతులు తెగ ఇబ్బంది పడుతున్నారు. పొట్టకొచ్చిన వరి పంట చేతికి రాదేమోమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గ్రామానికి చెందిన ఒక రైతు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు వాట్సప్ ద్వారా తమ చెరువు కష్టాలను మెసేజ్ చేశారు. మా ఊరి చెరువుకు ప్రాబ్లమ్ ఉంది. అశ్వరావుపల్లి రిజర్వాయర్ చెరువు తూము ప్రాబ్లమ్ ఉంది. నాలుగు నెలల నుంచి ఏదో అడ్డం పడడంతో వాటర్ సరిగా రావడం లేదు. చెరువు నుంచి నీరు రాకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. అందరు వచ్చిపోతున్నారున. కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. ఎలాగైనా మీరు మా ఊరి చెరువు సమస్య పరిష్కరించి ఎండి పోతున్న పంటలు కాపాడాలని కోరుతున్నాం అంటూ మంత్రి హరీశ్ రావుకు మెసేజ్ చేశాడు.
అంతే వేగంగా స్పందన
ఆ మెసేజ్ చదివిన మంత్రి హరిశ్ రావు తక్షణమే స్పందించి దేవాదుల ఎత్తిపోతల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం క్షేత్రపర్యటన చేసి సమస్యను పరిష్కరించి రైతులకు నీరందించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలను అందుకున్న దేవాదుల ప్రాజెక్టు అధికారులు సీఈ - ఎస్ ఈ - ఈఈలు రంగంలోకి దిగారు. సమస్యను సావదానంగా పరిశోధించారు. అశ్వరావుపల్లిలో పంగిడి చెరువుగా స్థానికులు పిలుచుకునే చెరువు కింద ఆయకట్టు రికార్డుల్లో 540 ఎకరాలు కాగా వాస్తవానికి 1040 ఎకరాల ఆయకట్టు ఉంది. వరి పొట్టకొచ్చిన సమయంలో నీటి తడి కోసం రైతులు తండ్లాడుతున్నారు. చెరువులో దాదాపు 18 అడుగులకు ఎక్కువగా నీళ్లున్నప్పటికీ ప్రధాన సమస్య పంగిడి చెరువు తూము నుంచి నీరు బయటికి రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా 50 హెచ్ పీ మోటర్లు - జనరేటర్లు ఆగమేఘాలమీద అక్కడికి తెప్పించి దాదాపు 1040 ఎకరాలకు నీళ్లిచ్చారు. మొత్తానికి ఒక్క వాట్సాప్ మెసేజ్ తో ఏకంగా వెయ్యి ఎకరాల వరి పంటను కాపాడడం గొప్ప విషయమే మరి.

జన రంజకమైన వార్తలు