• తాజా వార్తలు

2జీ నెట్‌వ‌ర్క్ ఏ క్ష‌ణాన్న‌యినా పోవ‌చ్చు.. తేల్చేసిన కేంద్రం

ఇండియాలో 2జీ మొబైల్ నెట్‌వ‌ర్క్‌కు కాలం చెల్లిపోయిన‌ట్లేనా? అవున‌నే అంటోంది కేంద్ర ప్ర‌భుత్వం. ఏ క్ష‌ణాన్న‌యినా 2జీ నెట్వ‌ర్క్ పోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటులో ప్ర‌క‌టించింది. డిమాండ్ ఉన్న‌ప్ప‌టికీ ఆ నెట్‌వ‌ర్క్ కొన‌సాగించాలా లేదా అనే అంశాన్ని టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల ఇష్టానికే వ‌దిలేస్తున్న‌ట్లు క‌మ్యూనికేష‌న్ల  శాఖ మంత్రి సంజ‌య్ ధోత్రే బుధ‌వారం లోక్‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. అంటే ఇక 2జీ ఇండియన్ మొబైల్ ఇండ‌స్ట్రీ నుంచి క‌నుమ‌రుగ‌వ‌డం ఇక లాంఛ‌న‌మే అంటున్నాయి టెలికం వ‌ర్గాలు 

2జీ ముక్త్ కావాలంటున్న ముకేష్ అంబానీ
రియ‌ల‌న్స్ ఇండస్ట్రీస్ ఛైర్మ‌న్ ముకేశ్ అంబానీ కొన్ని రోజుల కింద‌ట మాట్లాడుతూ దేశాన్ని 2జీ ముక్త్ (2జీ లేకుండా) చేయాల‌ని డిమాండ్ చేశారు. 2జీ నెట్‌వ‌ర్క్ ఇండియాకు వ‌చ్చి పాతికేళ్లు దాటింది. ఇప్ప‌టికీ ఇండియాలో 30 కోట్ల మంది వినియోగ‌దారులు 2జీ నెట్‌వ‌ర్క్ వాడుతుండ‌టంపై అంబానీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపై 3జీ త‌ర్వాత 4జీ నెట్‌వ‌ర్క్‌లు వ‌చ్చి కూడా మూడు నాలుగేళ్లు దాటిపోయింది. 5జీ కోసం ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. ఈ ప‌రిస్థితుల్లో ఇంకా 2జీ నెట్‌వ‌ర్క్ వాడ‌టం వ‌ల్ల ఆ 30 కోట్ల మంది వినియోగ‌దారులు 3జీ లేదా 4జీ నెట్‌వ‌ర్క్ వ‌ల్ల వ‌చ్చే ప్రయోజ‌నాల‌ను కోల్పోతున్నార‌ని అంబానీ అంటున్నారు. 

డిమాండ్ ఉన్నా.. 
30 కోట్ల మంది వినియోగ‌దారులు ఉండ‌టంతో 2జీకి దేశంలోఇంకా డిమాండ్ ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం న‌మ్ముతోంది. అయితే టెక్నాల‌జీ ఇంత పెరిగి త‌ర్వాత రెండు జ‌న‌రేష‌న్ల నెట్‌వ‌ర్క్‌లు వ‌చ్చినా ఇంకా 2జీ నెట్‌వ‌ర్క్ కొన‌సాగ‌డంపై టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ అసంతృప్తిగా ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఇక 2జీని ఎంత‌కాలం ఉంచాల‌నేది నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ల ఇష్టానికే వదిలేస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు.
 

జన రంజకమైన వార్తలు