• తాజా వార్తలు

ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఆయ‌న ఈ మాట అన‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు ఒక‌సారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విష‌యంలో మార్కెట్‌ పరిస్థితులన్నీ పరిశీలించాకే  కంపెనీలు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ప‌దే ప‌దే ఆయ‌న ఈ మాట అన‌డం చూస్తుంటే ధ‌ర‌లు పెంచడానికి ఫ్లాట్‌ఫామ్ వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నాలు వేస్తున్నాయి.
అన్ని కంపెనీలు క‌లిసివ‌స్తేనే పెంపు
అయితే ఛార్జీలు పెంచే విష‌యంలో  ఎయిర్‌టెల్‌ ఒక్కటే ముందడుగు వేయలేదని, ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.  నెలకు 16 జీబీ వినియోగానికి కేవలం రూ.160 చార్జీ చెల్లింపు విషాదకరమని,  ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.200 స్థాయికి పెరగాల‌ని  ఆయన అభిప్రాయపడ్డారు.  
నిజంగా న‌ష్టాల్లో ఉందా?
ఎయిర్‌టెల్ ఈ ఏడాది 9 నెలల్లోనూ ఎంతో కొంత న‌ష్టాన్ని భ‌రిస్తూ వ‌స్తోంది. అయితే ఇది ఆప‌రేష‌న‌ల్ లాస్ కాద‌ని, యాన్యువ‌ల్ గ్రాస్‌రెవెన్యూ కింద ప్ర‌భుత్వానికి క‌ట్టాల్సిన వేల కోట్ల‌లో కొంత మొత్తాన్ని ఎయిర్టెల్ చెల్లించింద‌ని, దాని మీద వ‌డ్డీ భారాన్ని లాస్‌గా చూపిస్తోంద‌ని మార్కెట్ చెబుతోంది. ఏజీఆర్ కింద బ‌కాయిలంటే గ‌తంలో వ‌చ్చిన లాభాల్లో నుంచి క‌ట్టాల్సిందే కాబ‌ట్టి దాన్ని న‌ష్టంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని అంటోంది. 

మిగిలిన కంపెనీలు క‌లిసివ‌స్తాయా?
వాస్త‌వానికి గ‌తేడాది డిసెంబ‌ర్‌లో అన్ని కంపెనీలూ 30 నుంచి 35 శాతం వ‌ర‌కు టారిఫ్‌ను సైలెంట్‌గా పెంచేశాయి.  అయినా ఇంకా న‌ష్టాల్లోనే ఉన్నాయి. మ‌రోవైపు ఏజీఆర్ బ‌కాయిలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా క‌లిసి 88వేల కోట్ల రూపాయ‌లు ఇంకా ప్ర‌భుత్వానికి క‌ట్టాల్సి ఉంది. జియోకు ప్ర‌స్తుతానికి ఈ భారం పెద్ద‌గా లేదు. కాబట్టి జియో విష‌యం ప‌క్క‌న‌పెడితే మిగిలిన కంపెనీలు ధ‌ర‌లు పెంచ‌డానికి మిట్ట‌ల్ మాట‌లు దారి వేస్తున్నాయని అనుకోవ‌చ్చు. అదే జ‌రిగితే టెలికం వినియోగ‌దారుల‌మీద మ‌ళ్లీ భారం త‌ప్ప‌దు.

జన రంజకమైన వార్తలు