వింత, విడ్డూరం అంటే ఇదేనేమో! రెండు దిగ్గజ టెలీకాం సంస్థల మధ్య ఇప్పుడు సరికొత్త వివాదం చెలరేగింది. ఒక సంస్థకు చెందిన టవర్ నుంచి మరో సంస్థ.. విద్యుత్ దొంగిలించేస్తోంది! నమ్మశక్యంగా లేదా.. నమ్మక తప్పదు మరి! తమ సంస్థకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కరెంట్‌ను ఎయిర్‌టెల్ అక్రమంగా చౌర్యం చేస్తోందంటూ బీఎస్ఎన్ఎల్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది!
టెలీకాం దిగ్గజం ఎయిర్‌టెల్‌పై శ్రీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కార్గిల్ జిల్లాలో ఏర్పాటుచేసిన తమ సంస్థకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఎయిర్‌టెల్ విద్యుత్ దొంగిలించిందని బీఎస్ఎన్ఎల్ సంస్థ కంప్లైంట్ చేసింది. తమ మొబైల్ టవర్‌ను ట్యాప్ చేసి విద్యుత్‌ను దొంగిలించి దానిని కార్గిల్‌లోని చానీఝడ్ ప్రాంతంలోని టవర్‌కు ఎయిర్‌టెల్ ఉపయోగించుకుందని ఆగస్టు 3న బీఎస్ఎన్ఎల్ అథారిటీస్ నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై విచారించేందుకు కార్గిల్ డిప్యూటీ ఎస్పీ ఇష్తయక్.ఎ.కచో అధ్యక్షతన కార్గిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీడీడీ మెహ్మద్ అల్తాఫ్ సభ్యుడిగా కమిటీని కార్గిల్ ఎస్ఎస్‌పీ టి. గ్యాప్లో నియమించారు. ఈ బృందం వివాదాస్పద స్థలానికి వెళ్లి పరిశీలించగా.. బీఎస్ఎన్ఎల్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అనధికారికంగా, అక్రమంగా ఒక కేబుల్ ద్వారా ఎయిర్‌టెల్ టవర్‌కు అనుసంధానం చేసి ఉండటాన్ని గుర్తించారు. ఎయిర్‌టెల్ అక్రమంగా విద్యుత్‌ను వినియోగించుకుంటోందని తేలింది. ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ యాక్ట్‌లోని సెక్షన్ 95 ప్రకారం.. కార్గిల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేశామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. దీనిపై ఎయిర్‌టెల్ స్పందిస్తూ.. ఆ టవర్ తమ టెలీకాం కంపెనీకి సంబంధించినది కాదని, అది భారతీ గ్రూప్‌నకు చెందిన ఇన్‌ఫ్రాటెల్ ఆపరేట్ చేస్తోందని తెలిపింది. నిజానిజాలు విచారించకుండానే ఈ విషయంలోకి తమ కంపెనీ పేరు లాగడం చాలా ఆశ్చర్యం కలిగించిందని ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్‌తోనే తేల్చుకుంటామన్నారు.