ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన `మేక్ ఇన్ ఇండియా` నినాదంతో దేశ ప్రజల కోసమే రిలయన్స్ జియో ఫోన్లను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇవి పూర్తిగా స్వదేశంలోనే తయారుచేస్తామని కూడా తెలిపారు. కానీ ఇటీవల విడుదలైన ఒక నివేదిక మాత్రం ఇది నిజం కాదని చెబుతోంది. చాలా వరకూ దిగుమతి చేసుకుంటున్నవేనని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలు ఇవి భారత్‌లోనే తయారయ్యాయా? లేదా? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
తొలి ఫోన్లన్నీ దిగుమతి చేసినవే
ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం.. దేశీయ మార్కెట్‌లోకి విడుదలైన జియో ఫోన్లన్నీ ఆ కంపెనీ దిగుమతి చేసుకున్నవేనట. దీంతోపాటు కస్టమ్ పన్ను కేంద్రానికి చెల్లించకుండానే ఇవి చేరిపోతున్నాయనే విమర్శలు వినిపించాయి. దీనిపై రిలయన్స్ జియో ఘాటుగానే స్పందించింది. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని బదులిచ్చింది. ప్రస్తుతం వినియోగిస్తున్న జియో మొబైల్స్‌తో పాటు భవిష్యత్‌లో రాబోయే ఫోన్లన్నీ పూర్తిగా ఇండియాలోనే తయారుచేసినవని తెలిపింది. సుంకం చెల్లింపుల నుంచి మినహాయింపు లేదని చెప్పింది. దేశీయ మార్కెట్‌లోకి మొబైల్ ఫోన్లు ఏవిధంగా విడుదలవుతున్నాయో గమనించే కొంత మంది నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. తొలినాళ్లలో మొదలైన ఫోన్లు దిగుమతి చేసుకున్నవేనట. కానీ ఇప్పుడు మాత్రం దేశంలోనే ఉత్పత్తి చేస్తున్నారు.
కార్టర్ల వారీగా పరిశీలిస్తే..
ప్రముఖ సంస్థ సైబర్ మీడియా రీసెర్చి(సీఎంఆర్) నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. 2017 మూడో భాగంలో 100 శాతం, నాలుగో భాగంలో 88 శాతం, 2018 తొలి క్వార్టర్‌లో 76 శాతం, రెండో క్వార్టర్‌లో 46 శాతం ఫోన్లు దిగుమతయ్యాయి. తొలినాళ్లలో విక్రయించిన ఫోన్లు Megafone Guiyang Limited, Ck Telecom (Heyuan) Limited, Shenzhen Crave Communication Co. Ltd వంటి వివిధ కంపెనీల నుంచి దిగుమతి చేసుకున్నారు. గతంలో దేశానికే చెందిన పలు కంపెనీలు కూడా తొలుత దిగుమతులపైనే ఆధారపడి.. తర్వాత సొంతంగా వాటన్నింటినీ రూపొందించాయి. జియో కూడా 2018 రెండో క్వార్టర్ నుంచి సొంతంగానే ఫోన్లు రూపొందిస్తోంది.
జియో ఫోన్-2 `మేడ్ ఇన్ ఇండియా`
త్వరలో విడుదల కాబోతున్న జియో ఫోన్2 కూడా స్వదేశంలోనూ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. క్వర్టీ కీ ప్యాడ్‌తో వచ్చే ఈ ఫోన్ రూ.2,999కే అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ అమ్మకాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇతర బ్రాండ్లు లిస్ట్‌లో గల్లంతే
జియో ఫీచర్ ఫోన్ రాకతో.. ఇతర బ్రాండ్ల బిజినెస్ పడిపోయిందనే గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లలో తొలి స్థానంలో ఉన్న మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటివి రేసులోనే లేకుండా పోయాయి. మొబైల్ ప్రారంభం నుంచి గమనిస్తే.. ప్రస్తుతం 2018 తొలిక్వార్ట్‌లో 35 శాతం అమ్మకాలు జరిగాయి. శాంసంగ్ 25 శాతం నుంచి 9 శాతానికి పడిపోయింది. ఐటెల్, లావా వంటి చిన్న చిన్న కంపెనీల అమ్మకాల్లో అనూహ్య మార్పులు జరిగాయి. మరి జియో నుంచి పోటీని తట్టుకుని మనుగడ నిలుపుకొనేందుకు ఈ సంస్థలు ఎలాంటి మార్పులతో ముందుకొస్తాయో వేచిచూడాల్సిందే!