• తాజా వార్తలు

ఇకపై రింగింగ్ 25 సెకన్లు మాత్రమే వినిపిస్తుంది, మీకు తెలుసా?

ఇప్పటివరకు మనం ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే దాదాపు ముప్పై నుండి నలభై ఐదు సెకండ్ల పాటు రింగింగ్ వినిపిస్తుంది. కానీ ఇకపై ఇది కేవలం 25 సెకన్స్ మాత్రమే వినిపించనుంది. ఎందుకంటే టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ఇప్పటి వరకు 30 నుంచి 45 సెకన్ల పాటు ఫోన్ కాల్స్ రింగ్ అయ్యేవి. కానీ ఇకపై తగ్గించిన సమయం మేర రింగ్ అవుతాయి. అయితే ఆ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటానికి గల కారణం జియోనే అని తెలుస్తోంది.

ఇటీవలే జియో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి (ఐయూసీ) నిబంధనలకు విరుద్ధంగా రింగింగ్ సమయాన్ని 20 సెకన్లకు తగ్గించి.. మళ్లీ 5 సెకన్లు పెంచి.. ఆ సమయాన్ని 25 సెకన్లు చేసింది. దీనిపై ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా నెట్ వర్క్‌లు తీవ్రంగా  అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. అయినప్పటికీ జియో 25 సెకన్ల కంటే ఎక్కువ పెంచేది లేదని తెగేసి చెప్పడటంతో మిగతా నెట్ వర్క్ లన్నీ జియో బాటలోకి వచ్చేశాయి. ఇప్పటివరకూ తమ నెట్ వర్క్ పై ఔట్ గోయింగ్ కాల్స్ రింగ్ టైమ్ వ్యవధి 30-45 సెకన్ల మధ్య ఉండగా టెల్కోలన్నీ రింగ్ టైం వ్యవధిని 25 సెకన్లకు తగ్గించాయి. కాగా వొడాఫోన్ ఐడియా మాత్రం దేశంలోని పలు ప్రాంతాల్లో కాల్స్ రింగింగ్ సమయాన్ని పాత పద్ధతిలోనే కొనసాగిస్తున్నాయి.

జియో ఐయూసీ చార్జిలను ఎక్కువగా చెల్లిస్తున్నందువల్లే ఆ ఖర్చును తగ్గించుకోవడానికి రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు కుదించిందని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా కాల్ చేసిన నెట్‌వర్క్ వారు కాల్ ముగిసిన నెట్‌వర్క్‌కు ఐయూసీ చార్జిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఈ విధానంలో అధికంగా ఆదాయం సమకూరుతోంది. దీంతో జియో రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు కుదించిందని, ఈ క్రమంలో రింగింగ్ సమయం తగ్గడం వల్ల కాల్ చేస్తే అవి మిస్డ్ కాల్స్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని, కనుక అవతలి వ్యక్తులు కాల్స్ చేస్తే అప్పుడు ఆ నెట్‌వర్క్ వారు ఇవతలి నెట్‌వర్క్‌కు ఐయూసీ చార్జిలు చెల్లించాలి కాబట్టి.. తమకు ఆ ఖర్చు తగ్గుతుందని జియో భావిస్తుందని, అందుకనే ఆ కంపెనీ రింగింగ్ సమయాన్ని తగ్గించిందని ఇతర టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. 

రింగ్ టైం విషయంలో జియోకు వ్యతిరేకంగా ట్రాయ్ కు లేఖ కూడా రాశాయి. ఇంటర్ కనెక్షన్ యూజ్ ఛార్జ్ (IUC) రూల్ మార్చటానికి జియో రింగ్ సమయాన్ని తగ్గించిందని ట్రాయ్ కు రాసిన లేఖలో ఎయిర్ టెల్ ఆరోపించింది. ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించిన‌ ట్రాయ్ నెట్‌వర్క్ ఆపరేటర్లు సమావేశమై ఒక ఒప్పందం చేసుకోవాలని సూచించింది.  దీంతో త్వరలో ఈ విషయంపై టెలికాం కంపెనీలు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వాదనలను జియో కొట్టి పారేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కాల్స్ రింగింగ్ సమయం 15 నుంచి 20 సెకన్లు ఉంటే సరిపోతుందని జియో తెలిపింది. 
 

జన రంజకమైన వార్తలు