ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన ప్రత్యర్థులకు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేలా వొడాఫోన్ ఐడియా కూడా సొంత మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. తన కస్టమర్లకు మ్యూజిక్ సర్వీసుల ద్వారా మరింత దగ్గరయ్యే ప్రణాళికలో భాగంగా కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ యూప్‌ను ప్రవేశపెట్టనుంది. మార్కెట్ పోటీకి అనుగుణంగా అత్యుత్తమ ఫీచర్లతో ఈ యాప్ ఉండాలని వొడాఫోన్ ఐడియా సంస్థ భావిస్తోందట.
ఇప్పటికే రిలయన్స్ జియో మ్యూజిక్ ప్రియుల కోసం మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ సావన్‌ను సొంతం చేసుకొని జియో సావన్‌గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక జియో కన్నా ముందే 100మిలియన్ల యూజర్లతో భారతీ ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్ యాప్‌ను కలిగి ఉంది. ఈ రెండు సంస్థలకు పోటీగా తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు రెడీగా ఉంది.
దీనిలో భాగంగానే ప్రస్తుతం వినియోగంలో ఉన్న మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌తో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. గానా, హంగామా, ఆపిల్ మ్యూజిక్, గూగుల్ మ్యూజిక్ యాప్‌లు అత్యంత ఆదరణ కలిగిన జాబితాలో ఉన్నాయి. ఐతే గానాతో ఒప్పందం చేసుకునేందుకు ఐడియా ఆసక్తి కనబరుస్తున్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడి ఓ అనలిస్టు తెలిపారు.
ఈ కొత్త యాప్ రాగానే కస్టమర్లను ఆకర్షించడంలో ఫెయిల్ అయిన, ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐడియా మ్యూజిక్ యాప్‌ను నిలిపివేయనున్నారు.ప్రస్తుతం ఐడియా మ్యూజిక్ యాప్‌లో 3 మిలియన్ల పాటలున్నాయి. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని నిలబడలాంటే అత్యుత్తమ ఫీచర్లతో యాప్ ఉండాలని వొడాఫోన్ ఐడియా సంస్థ నిర్ణయించింది.