• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో గ్రాస‌రీ బుక్ చేయ‌డానికి స్లాట్ దొర‌క‌డం లేదా..  అయితే ఈజీ టిప్స్ మీకోసం

లాక్‌డౌన్‌తో చాలామంది గ్రాస‌రీల‌కు ఆన్‌లైన్ యాప్స్ మీదే ఆధార‌ప‌డుతున్నారు. రేపు లాక్‌డౌన్ ఎత్తేసినా ఫిజిక‌ల్ డిస్టెన్స్ కొన్నాళ్ల‌పాటు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ స‌డ‌లించినా కూడా పెద్ద పెద్ద సూప‌ర్ మార్కెట్ల‌కు వెళ్ల‌డానికి ఎక్కువ మంది ఇష్ట‌ప‌డే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే అక్క‌డ ఒక వ‌స్తువును ఎంతోమంది ముట్టుకుంటారు. అదీకాక ఆ మార్కెట్‌లో చాలామంది ఒకేసారి కొనుగోలుకు వ‌స్తారు. కాబ‌ట్టి భౌతిక దూరం పాటిస్తూ స‌ర‌కులు కొనుక్కోవడం అంత ఈజీకాదు. అందుకే లాక్‌డౌన్ ముగిశాక కూడా ఆన్‌లైన్‌గ్రాస‌రీ యాప్స్ మీదే కొంత‌కాలం పాటు ఆధార‌ప‌డ‌తాం అంటున్నారు చాలామంది. 

స్లాట్ దొర‌క‌డం లేదా?
అయితే ఉత్ప‌త్తి త‌క్కువ‌గా ఉండ‌టంతో ఆన్‌లైన్ గ్రాస‌రీ స్టోర్స్‌లో స‌రకులు దొర‌క‌డం క‌ష్టంగా ఉంటోంది. ఒక‌వేళ స‌ర‌కులున్నా ఆ టైమ్‌లో మ‌న‌కు బుకింగ్ స్లాట్ దొర‌క‌దు. దొరికినా మూడు, నాలుగు రోజుల‌కుగానీ రావంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆన్‌లైన్లో గ్రాస‌రీస్ బుక్ చేయ‌డంలోఈ టిప్స్ పాటిస్తే మీకు షాపింగ్ ఈజీ అవుతుంది.

1. ఒక‌టే యాప్‌ను న‌మ్ముకోకండి
ఉదాహ‌ర‌ణ‌కు మీరు బిగ్‌బాస్కెట్‌లో స‌ర‌కులు కొంటారు. దానిలో స్లాట్ ఖాళీగా లేక‌పోతే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ గ్రాస‌రీల్లో ట్రై చేయండి. అంతేకాదు మోర్‌, బిగ్‌బ‌జార్‌, స్పెన్స‌ర్స్‌, డీమార్ట్ లాంటి పెద్ద సూప‌ర్ మార్కెట్లు కూడా ఆన్‌లైన్ సేల్స్ అందుబాటులోకి తెచ్చాయి. కాబ‌ట్టి ఈ యాప్స్ అన్నీ ద‌గ్గ‌ర పెట్టుకోండి. అందువ‌ల్ల మీకు స్లాట్ ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ధ‌ర‌లో 
హెచ్చుత‌గ్గులు కూడా తెలుస్తాయి. 

2. రెగ్యుల‌ర్‌గా చెక్ చేస్తుండండి
ఎలాగూ ఏదో అవ‌స‌రానికి ఫోన్ చూస్తుంటాం కాబ‌ట్టి ఆ టైమ్‌లో ఓసారి ఈ యాప్స్‌ను చూసేయండి. స్లాట్ దొరికితే వెంట‌నే బుక్ చేసుకోవ‌చ్చు. 2,3 గంట‌ల‌కోసారి ఓ లుక్కేస్తే మూడు నాలుగుసార్లు చూసేస‌రికే మీకు స్లాట్ దొరుకుతుంది 

3.నైట్ టైమ్ బుక్ చేయండి
డెలివ‌రీ యాప్స్ త‌ర్వాత రోజు డెలివ‌రీల‌కు రాత్రి 12 గంట‌ల దాకా బుకింగ్స్ తీసుకుంటాయి. ఆ టైమ్‌లో స్లాట్స్ బాగా దొరుకుతాయి. ఎక్కువ మంది ఆ టైమ్‌లో ట్రై చేయ‌రు కాబ‌ట్టి  రాత్రి 12 దాటాక ట్రై చేయండి. స్లాట్ సులువుగా దొరుకుతుంది. అంతేకాదు ఏరోజుకారోజు కొత్త స్టాక్ వ‌స్తుంది కాబ‌ట్టి అర్ధ‌రాత్రి దాటాక చేస్తే మీకు కావాల్సిన వ‌స్తువుల‌న్నీ కూడా దొరికే చాన్స్ ఎక్కువ‌. 

4.త‌క్కువ పాపుల‌ర్ బ్రాండ్స్ చూడండి
ఆశీర్వాద్ ఆటా అందరూ వాడ‌తారు. అందుక‌ని అది దొర‌క్కపోవ‌చ్చు. పిల్స్‌బ‌రీనో, టాటానో ట్రై చేయండి.  ఈజీగా దొరుకుతాయి.అంటే బాగా పాపుల‌ర్ బ్రాండ్‌్చకి డిమాండ్ ఎక్కువ కాబ‌ట్టి తర్వాత స్థానంలో ఉన్న‌వి ట్రై చేయండి. లాక్‌డౌన్ టైమ్‌లో న‌చ్చిన బ్రాండ్ వ‌స్తువుల కోసం ముచ్చ‌ట‌ప‌డి బ‌య‌టికెళ్లి ప్ర‌మాదంలో ప‌డటం కంటే కొత్త బ్రాండ్ ప్ర‌య‌త్నించ‌డంలో త‌ప్పులేదుగా. 

5.వారాంతాల్లో వ‌ద్దు
శ‌ని, ఆదివారాలు వీకెండ్స్‌. ఇంట్లోనే ఉంటామన్న ఉద్దేశంతో ఉద్యోగ‌స్తులైన భార్యాభ‌ర్త‌లు ఉంటే వారు కూడా అదే రోజు ఆర్డ‌ర్ చేయాల‌ని చూస్తారు. అలాంట‌ప్పుడు ట్రాఫిక్ మ‌రీ ఎక్కువ ఉంటుంది. అందుక‌ని మ‌ధ్య రోజుల్లో ప్ర‌యత్నిస్తే ఈజీగా ఉంంటుంది.  

6.అడ్ర‌స్ అవీ ముందే సేవ్ చేయండి
స్లాట్ దొరికినా బుకింగ్ కోసం మ‌నం అడ్ర‌స్ అవ‌న్నీ టైప్ చేసేస‌రికి ఒక్కోసారి ఆ ప్రొడ‌క్ట్‌లు అయిపోతాయి. అందుక‌ని కార్డ్ వివ‌రాలు లాంటి సెన్సిటివ్ డేటా త‌ప్ప ఇంటి అడ్ర‌స్ ఫోన్ నెంబ‌ర్‌, మెయిల్ ఐడీ లాంటివి ముందే గ్రాస‌రీ యాప్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే స్లాట్ దొరక‌గానే బుక్ చేయొచ్చు. అంతేకాదు స‌ర‌కులున్నా లేక‌పోయినా కార్ట్‌లో వేసి ఉంచండి. అవి వ‌స్తే వెంట‌నే బుక్ చేసేయొచ్చు. 

జన రంజకమైన వార్తలు