బహుళ ప్రజాదరణగల తక్షణ మెసేజింగ్ వేదిక ‘‘వాట్సాప్’’ను వాణిజ్య వేదికగా తయారు చేయడానికి దాని యాజమాన్య సంస్థ అయిన సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ సిద్ధమైంది. ఆ మేరకు వాట్సాప్ ‘‘స్టేటస్ ట్యాబ్’’లో ప్రకటనలు చొప్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్‌ను నాలుగేళ్ల కిందట 1900 కోట్ల డాలర్లకు అమ్మేసిన దాని వ్యవస్థాపకులు బ్రయాన్ యాక్టన్, జాన్ కౌమ్‌లు ఫేస్‌బుక్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. అయితే, దాన్ని కొన్న మరుక్షణం నుంచే వాట్సాప్ వాణిజ్యీకరణకు ఫేస్‌బుక్ ఆలోచిస్తోందని బ్రయాన్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. తన ఆధ్వర్యంలోని ‘‘మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్’’ తదితర వేదికలలో యాడ్స్‌ద్వారా ఫేస్‌బుక్ ఇప్పటికే ఆదాయం ఆర్జిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మాధ్యమాలను ఉపయోగిస్తున్నవారికి వాట్సాప్ కూడా యాడ్స్‌మయం అవుతుందన్న వార్త ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ, ఒక్క వాట్సాప్‌ను మాత్రమే వాడేవారికి ఫేస్‌బుక్ నిర్ణయం రుచించదనడంలో సందేహం లేదు. దీనివల్ల ప్రజాదరణ తగ్గుముఖం పట్టి వాట్సాప్ పతనానికి నాంది కాగలదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వాట్సాప్‌లో యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి?
ఫేస్‌బుక్ తన ఆలోచనను ఏ రూపంలో అమలు చేస్తుందన్నదానిపై ఇప్పటివరకూ నిర్దిష్ట సమాచారం ఏదీలేదు. కానీ, ఇన్‌స్టాగ్రామ్ ‘‘స్టోరీస్’’లో ఇప్పుడు యాడ్స్ కనిపిస్తున్న రీతిలోనే వాట్సాప్‌లోని ‘‘స్టేటస్ ట్యాబ్’’లో యాడ్స్‌ను చొప్పిస్తుందని ఇటీవలి మీడియా కథనం ఒకటి పేర్కొంది. అంటే... మీరు మీ స్నేహితుల స్టేటస్‌ను చూస్తున్నప్పుడు అందులోనుంచి అప్పుడప్పుడూ యాడ్ పుట్టుకొస్తుందన్న మాట! ఫేస్‌బుక్ ‘‘మెసెంజర్’’ యాప్‌లో ఇప్పుడు హోమ్ స్క్రీన్‌పై చాట్స్ మధ్యన, ‘‘మెమరీస్’’ ట్యాబ్‌లో... దాదాపు ప్రతిచోటా యాడ్స్ ప్రత్యక్షమవుతుండటం మనకు తెలిసిందే. అయితే, వాట్సాప్ విషయంలో ఈ విధంగా ప్రతిచోటా యాడ్స్‌ను గుప్పించే ఆలోచన లేకపోయినా, స్టేటస్ ట్యాబ్‌లో కనిపించడం మాత్రం ఖాయమని సమాచారం.
వాట్సాప్ విజయానికి యాడ్స్ లేకపోవడమే కారణం!
సులువుగా వాడుకోగల సౌలభ్యం మాత్రమేగాక ఈ వేదికపై యాడ్స్ లేకపోవడమే వాట్సాప్ విజయవంతం కావడానికి దోహదపడిన కారణాలలో ఒకటని చెప్పవచ్చు. కాబట్టే ప్రపంచంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య నేడు 130 కోట్లకు చేరింది. వాట్సాప్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశంలో దాన్ని 20కోట్ల మంది వాడుతుండగా ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనితో పోలిస్తే ఇతర మెసేజింగ్ వేదికలలో యాడ్స్ బెడద కారణంగా వాటికి జనాదరణ తక్కువే. ఈ పరిస్థితుల్లో వాట్సాప్‌లోనూ యాడ్స్ ప్రత్యక్షం కావడాన్ని జీర్ణించుకోవడం చాలామందికి కష్టమే కావచ్చు. యాడ్స్‌కు బాటలు వేయడమంటే రెండేళ్ల కిందట వాట్సాప్‌లో భద్రత కోసమంటూ ప్రవేశపెట్టిన ‘‘ఎన్‌క్రిప్షన్’’ (భద్రత) ఫీచర్‌ను ఫేస్‌బుక్ ఇప్పుడు త్యాగం చేయడమే అవుతుంది. మొత్తంమీద ఫేస్‌బుక్ నిర్వహణలోని ‘‘వాగ్దానభంగ’’ కంపెనీల జాబితాలో వాట్పాప్ కూడా చేరబోతోందన్నది అనేకమంది వాడకందారులకు ఆందోళన కలిగించే దుర్వార్తే!