ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్ పేరు, రూపురేఖలు మారాయి. వాట్సప్ ఇకపై ‘వాట్సప్ బై ఫేస్‌బుక్’గా దర్శనమివ్వనుంది. ప్రస్తుతం వాట్సప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రం కొత్త పేరుతో కనిపిస్తోంది. త్వరలోనే ఇతర వినియోగదారులకూ దర్శనమివ్వనుంది. ఇది కేవలం పేరులో మార్పు తప్ప యాప్‌లో మరే ఇతర మార్పూలూ చోటుచేసుకోకపోవడం గమనార్హం.
2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను, 2014లో వాట్సప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసినప్పటికీ అవి ఆయా పేర్లతోనే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే పేరు మార్చాలని ఫేస్‌బుక్ నిర్ణయించింది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్ బై ఫేస్‌బుక్, వాట్సాప్ బై ఫేస్‌బుక్ అని మారుస్తున్నట్లు పేర్కొంది. బీటా యూజర్లు వాట్సప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళితే ‘వాట్సప్ బై ఫేస్‌బుక్’ అని కనిపిస్తుంది.
దీని ద్వారా ఇప్పటికిప్పుడు వచ్చే మార్పు ఏదీ లేనప్పటికీ భవిష్యత్‌లో కీలక మార్పులకు ఫేస్‌బుక్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ యాప్‌లను ఇంటిగ్రేట్ చేయాలని జుకర్‌బర్గ్ నిర్ణయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీని ప్రకారం వాట్సప్ ఖాతాదారుడు ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ లో అకౌంట్లు లేకపోయినా ఛాట్ చేసే అవకాశం ఉంది. ఈ కీలకమార్పుకు శ్రీకారం చుట్టడంలో భాగంగానే ఫేస్‌బుక్ తాజా మార్పు చేపట్టినట్లు తెలుస్తోంది. 2020 నాటికి ఇంటిగ్రేషన్ జరిగే అవకాశం ఉంది.