• తాజా వార్తలు

వాట్సప్‌కి ఆదాయం ఎలా వస్తుంది, మార్గాలేంటి..?

వాట్సప్ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న మెసేజింగ్ దిగ్గజం. పూర్తి ఉచితంగా అందరికీ అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా నిరంతరాయ సేవలు అందుతున్నాయి. అయితే పూర్తి ఉచితంగా సేవలు అందిస్తున్న వాట్సప్‌కి రెవిన్యూ వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా.. లేవా అన్నదానిపై ఓ చిన్న లుక్కేద్దాం. 

వాట్సప్ వచ్చిన తొలి ఏడాది అది పూర్తి సేవలను ఉచితంగా అందించింది. అయితే దాని తరువాత ఏడాదికి 1 డాలర్ ఫీజు వసూలు చేసింది. ఫేస్‌బుక్ వాట్సప్‌ను కొనుగోలు చేసిన తరువాత ఈ 1 డాలర్ ఫీజును తీసివేసి పూర్తి ఉచితంగా సేవలను అందిస్తూ వస్తోంది.అయితే ఇప్పుడు వాట్సప్‌ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్ కూడా రెవిన్యూ మార్గాలను అన్వేషించే పనిలో పడింది. త్వరలోనే ఈ యాప్ సహాయంతో పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించే దిశగా ఫేస్‌బుక్ ప్రయత్నాలు చేస్తున్నదని సమాచారం.

వాట్సప్‌ యాడ్స్
వాట్సప్‌లో త్వరలో యాడ్స్ రానున్నట్లు సమాచారం. యూజర్లు చాటింగ్ చేసేటప్పుడు, వాయిస్, వీడియో కాల్స్ చేసేటప్పుడు యాడ్స్ వచ్చేలా కొత్తగా ఆ యాప్‌ను డిజైన్ చేయనున్నారట. దీని ద్వారా వాట్సప్‌లో డబ్బులు సంపాదించాలని ఫేస్‌బుక్ ఆలోచిస్తున్నది.

వాట్సప్‌ బిజినెస్
వాట్సప్‌లోకి త్వరలో బిజినెస్ ఫ్రెండ్లీ వెర్షన్‌ అందుబాటులోకి రానుంది. కార్పొరేట్ కంపెనీలకు ఈ వర్షన్ అందుబాటులో ఉంటుంది. వారు తమ కస్టమర్లకు వాట్సప్ ద్వారా కనెక్ట్ కావడానికి బిజినెస్ ఫ్రెండ్లీ వాట్సప్ వెర్షన్ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వెర్షన్ వాట్సప్‌ను వాడుకున్నందుకు గాను కంపెనీలు వాట్సప్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా తేజ్ పేరిట ఓ కొత్త వాలెట్‌ను అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో వాట్సప్ కూడా వాట్సప్ పే అనే డిజిటల్ వాలెట్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిసింది.దీని ద్వారా యూజర్లకు నగదు ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ షాపింగ్, బిల్ పేమెంట్స్ వంటి సేవలను అందిస్తూ మరోవైపు డబ్బు సంపాదించాలని వాట్సప్ ఆలోచిస్తున్నది.

వాట్సప్ పే
కాగా ప్రస్తుతం ఈ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా యూజర్లు వాడుతున్నారు. నెలకు 130 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఇందులో ఉంటున్నారు. రోజుకు 20 కోట్ల వాయిస్ మెసేజ్‌లను వాట్సప్‌లో పంపుకుంటున్నారు.

వారానికి యావరేజ్‌గా ఒక యూజర్ 195 నిమిషాల పాటు వాట్సప్‌లో వాయిస్ కాల్స్ చేసుకుంటున్నారు. అలాగే ఒక యూజర్ నెలకు యావరేజ్‌గా వాట్సప్‌లో 1200 మెసేజ్‌లను పంపుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్‌లో రోజూ 5500 కోట్ల మెసేజ్‌లను పంపుకుంటున్నారు.

సో పై కారణాల వల్ల వాట్సప్ త్వరలోనే ఆదాయాన్ని ఆర్జించే దిశగా అడుగులు వేయబోతుందని చెప్పవచ్చు. మరి రానున్న కాలంలో వాట్సప్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.

జన రంజకమైన వార్తలు