• తాజా వార్తలు

వాట్సప్‌లో ఇకపై నకిలీ మెసేజ్‌లను ఈజీగా గుర్తించవచ్చు

ఇండియాలో 2019 సార్వత్రిక సమరం వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజాలు అలర్ట్ అయ్యాయి. ఎన్నికల్లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని భావించిన ఈ దిగ్గజాలు వీటిని నిరోధించేందుకు దిగ్గజాలు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తున్నాయి.ఇందులో భాగంగా వాట్సప్ మరో అడుగు ముందుకేసింది. సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. 
ఈ మధ్య వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ కావడంతో దాని ప్రతిష్ట మసకబారింది. దాంతో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వివాదంలో చిక్కుకుంది. ఈ ఫేక్‌న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ చర్యలు మొదలుపెట్టింది. ఫార్వర్డ్ మెసేజ్‌కు 'Forwarded' లేబుల్, ఐదుగురి కంటే ఎక్కువగా ఫార్వర్డ్ మెసేజ్‌లు పంపే అవకాశం లేకపోవడం లాంటి కొత్త ఫీచర్లన్నీ ఫేక్ న్యూస్ అడ్డుకోవడం కోసం తీసుకువచ్చింది.  
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. అదే రివర్స్ ఇమేజ్ సెర్చ్. త్వరలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనుండటం, ఎన్నికల్లో ఫేక్‌న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ అయ్యే అవకాశం ఉండటంతో వాట్సప్ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.WABetainfo సమాచారం ప్రకారం వాట్సప్ బీటా 2.19.73 అప్‌డేట్‌లో 'Search image' ఫీచర్ కనిపిస్తుంది. మీకు వాట్సప్‌లో ఏదైనా ఫోటో వస్తే అది నిజమో కాదో తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.
మీకు వచ్చిన ఫోటోను క్లిక్ చేసి 'Search image' పైన క్లిక్ చేస్తే నేరుగా గూగుల్‌లో అలాంటి ఇమేజెస్ ఏవైనా ఉంటే చూపిస్తుంది. దాన్ని బట్టి ఆ ఫోటో ఎక్కడిది? ఎప్పుడు తీశారు? మీకు వచ్చిన ఫోటోలో ఉన్న సమాచారం నిజమేనా? ఇవన్నీ తెలుసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మీరు ఫేక్ న్యూస్‌ను సులభంగా గుర్తించొచ్చు. అది తప్పుడు సమాచారం అని, తప్పుడు వార్తలని తెలిస్తే మీరు ఫార్వర్డ్ చేయకుండా అడ్డుకోవచ్చని వాట్సప్ తెలిపింది. 

జన రంజకమైన వార్తలు