ఇన్‌స్ట్ంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్ వాట్సప్ ఇండియాలో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వాట్సప్ గ్రూపుల్లో తప్పుడు మెసేజ్‌లను పెద్ద ఎత్తున పంపేవారి ఆటకట్టించేందుకు మెషిన్ లెర్నింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సప్ ప్రతినిధులు తెలిపారు. కాగా గతంలో ఒక్కో వ్యక్తి కేవలం 5 మందికి మాత్రమే మెసేజ్‌ను ఫార్వార్డ్ చేసుకునేలా వాట్సప్ నిబంధనలను విధించింది. ఇప్పుడు తాము నకిలీ వార్తలను ప్రచారం చేసే వారిని అడ్డుకునేందుకు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నామనే విషయాన్ని వాట్సప్ తాజాగా వెల్లడించింది.
వాట్సప్‌లో నకిలీ వార్తలు, పుకార్లను పెద్ద ఎత్తున ప్రచారం చేసే వారిని నియంత్రించడానికి తాము మెషిన్ లెర్నింగ్ సహాయం తీసుకుంటున్నామని, ఈ సిస్టమ్ వల్ల నెలకు 20 లక్షల మంది స్పామర్ల వాట్సప్ అకౌంట్లను బ్యాన్ చేస్తున్నామని కూడా ఆ కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు స్పామర్లు ఉపయోగించే ఐపీ అడ్రస్‌ల ప్రకారం వారిని ట్రేస్ చేసి వారు ఇకపై వాట్సప్‌ను వాడకుండా చూస్తున్నామని, ఇలాంటి వారిలో 20 శాతం మంది అకౌంట్లను వారు వాట్సప్‌లో ఆరంభంలో రిజిస్టర్ అయినప్పుడే తొలగించగలుగుతున్నామని కూడా తెలిపింది.
వాట్సప్ మెసేజింగ్‌ను ఎవరూ దుర్వినియోగం చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రత్యేక ఇంజినీర్ల బృందాన్ని నియమించామని కూడా వాట్సప్ తెలిపింది.
ఇదిలా ఉంటే టీడీపీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన సీఎం రమేష్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. సీఎం రమేష్‌కు చెందిన వాట్స్‌ప్ అకౌంట్‌పై ఆ సంస్థ వేటు వేసింది. దీనిపై ఆయన వివరణ కోరుతూ వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. అందుకు బదులుగా ఆ సంస్థ నిబంధనలు ఉల్లంఘించారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందాయని వాట్సప్ సంస్థ పేర్కొంది. కాగా పొరపాటున తప్పు జరిగి వుంటే ..ఇకపై అలాంటిది జరగకుండా చూసుకుంటానని తన ఖాతాను పునరుద్ధరించాలని ఆయన వాట్సప్‌ను కోరారు.
మరోవైపు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ కుమార్ రెడ్డి వాట్సప్ ఐదు రోజులుగా పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లిద్దరే కాదు రాజకీయ నేతల్లో మూడో వ్యక్తి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వాట్సప్‌ను కూడా బ్యాన్ చేసింది. దీనికి బలమైన కారణాలు అంత కంటే బలమైన ఆధారాలు ఉంటే మినహా వాట్సప్ సంస్థ ఇటువంటి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.