టెలికాం రంగంలో కంపెనీల పోటీ కస్టమర్‌కే లాభం తెచ్చిపెడుతోంది. గత ఏడాది వరకు టాప్ రేట్‌లో ఉన్న మొబైల్ డేటా ధరలు జియో రాకతో నేలను తాకాయి. మేమంటే మేమంటూ కంపెనీలన్నీ పోటీపడి ధరలు తగ్గించేశాయి. ఇప్పుడు వార్ మొబైల్ డేటా నుంచి బ్రాడ్ బ్యాండ్ కు మారినట్లు కనిపిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఏకంగా 1జీబీ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ ను తీసుకొస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించేసింది.
ఎయిర్‌టెల్, జియోకు పోటీ
మొబైల్ సెక్టర్లో సక్సెస్ అయిన జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌పై దృష్టి పెట్టింది. 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో మొదటి మూడు నెలలు ఫ్రీ సర్వీసులతో ఈ రంగంలోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఎయిర్‌టెల్ గత సంవత్సరం 100 ఎంబీపీస్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ ను లాంచ్ చేసింది. వీటన్నింటినీ ఓవర్‌టేక్ చేయాలనే లక్ష్యంతోనే బీఎస్ఎన్ఎల్ 10 రెట్లు ఎక్కువగా (1000 ఎంబీపీఎస్ లేదా 1జీబీ) మ్యాక్సిమం స్పీడ్‌తో కొత్త ప్ర్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసింది.
అంత స్పీడ్ సాధ్యమేనా?
1 జీబీపీఎస్ పర్ సెకన్ మ్యాక్సిమం స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ తో సాధ్యమేనా అనే సందేహాలు యూజర్లకు కలుగుతున్నాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ఇందుకోసం అల్ట్రా–ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ఆవిష్కరించింది. తన నెట్‌వర్క్‌ను నెక్స్ట్ జనరేషన్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసుకుంది. కాబట్టి 1జీబీపీఎస్ టాప్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు సాధ్యమే అంటోంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ టాప్ డౌన్‌లోడ్ స్పీడ్ సెకన్‌కు 100 ఎంబీగా ఉంది. నెక్స్ట్ జనరేషన్ ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ (NG-OTH) ప్రాజెక్టును బీఎస్‌ఎన్‌ఎల్ 44 పట్టణాల్లో సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ (2017–18)లో అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్ తోపాటు 100 ప్రధాన పట్ట్టణాలకు ఈ సేవలను విస్తరించబోతోంది. ఇందుకోసం రూ.330 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. మూడు స్టేజీల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. దీంతో 1000 ఎంబీపీఎస్ స్పీడ్‌ను అందుకోగలగుతుందని అంచనా.