కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చేస్తోంది కూడా.. దీన్నుంచి ప్రజలను రక్షించేందుకు మన వాక్సిన్ కంపెనీలు వ్యాక్సిన్ తయారుచేశాయి. వీటిని ప్రజలకు అందివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వాక్సిన్ కావాలనుకునేవారు రిజిస్టర్ చేసుకోవడానికి వీలుగా కొవిన్ యాప్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇదే అదునుగా కొంతమంది హ్యాకర్లు నకిలీ కొవిన్ యాప్‌లు తయారుచేసి గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ఐ స్టోర్‌ల్లో పెడుతున్నారని, వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. నకిలీ యాప్‌ల గోల కొవిన్ పేరుతోగానీ, వాటికి దగ్గరగా ఉండే పేర్లతోగానీ ఏమైనా యాప్స్ ప్లేస్టోర్‌లో కనిపిస్తే తొందరపడి అప్పుడే డౌన్‌లోడ్ చేయకండి. ఎందుకంటే ఒక్కసారి ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తే అందులో మీ పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ వంటివన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే నకిలీ యాప్స్ ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఇంకా తయారీ దశలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కొవిన్(Co-WIN App) ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాప్ ఇంకా తయారీ దశలోనే ఉంది. త్వరలోనే ఈ యాప్ విడుదల కానుంది. యాప్ రిలీజ్ కాగానే అధికారికంగా ప్రకటిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈలోగా యాప్‌లు ప్లే స్టోర్‌లో కనిపిస్తే అవి నకిలీవేనని, వాటిలో మీ పర్సనల్ డిటెయిల్స్ ఏమీ ఎంటర్ చేయవద్దని, అలా చేస్తే మీ డేటా అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సో బీకేర్‌ఫుల్.