• తాజా వార్తలు

గూగుల్‌‌కి ఎదురుదెబ్బ, సొంత ఆపరేటింగ్ సిస్టం HarmonyOSతో వస్తున్న హువాయి

అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలకు దీటుగా బదులిచ్చేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ హువాయి సొంతంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారుచేసుకుంది. హార్మనిఓఎస్‌(HarmonyOS) పేరుతో హువాయి డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. అంతే కాకుండా ప్రపంచంలోనే మరింత సామరస్యాన్ని తీసుకురండి’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా దీనికి తగిలించింది. సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా గూగుల్‌కు మాత్రమే కాకుండా అగ్రరాజ్యం అమెరికాకు సైతం హువాయి అదిరే పంచ్ ఇచ్చింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలోచైనా కంపెనీ హువాయిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో హువాయి ఫోన్లకు తమ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇచ్చేది లేదని గూగుల్‌ ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు తర్వాత హువాయి ఫోన్లలో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ సేవలు లభించవు. దీంతో గూగుల్‌ ఆండ్రాయిడ్‌కు పోటీగా హువాయి సొంతంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారుచేసేందుకు పూనుకుంది. హాంగ్‌మెంగ్ పేరుతో హువాయి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తీసుకురానున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘హార్మనిఓఎస్‌’ పేరుతో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హువాయి కన్స్యూమర్‌ బిజినెస్‌ హెడ్‌ రిచర్డ్‌ యు మాట్లాడుతూ.. ‘ఇది భవిష్యత్‌ ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తొలి వెర్షన్‌ను ఈ ఏడాది చివరి నాటికి స్మార్ట్‌స్క్రీన్‌ ఉత్పత్తుల్లో అందుబాటులోకి తీసుకురానున్నాం. రానున్న మూడేళ్లలో మా అన్ని ఉత్పత్తుల్లో ఈ ఓఎస్‌ను తీసుకొస్తాం’ అని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ అధిక భాగం గూగుల్ తయారు చేసింది. దాదాపు 99 శాతం ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది. ఆపిల్ ఫోన్లలో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది.ఇక చైనాకు చెందిన కొన్ని మొబైల్‌ సంస్థలకు సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్నా, ఆండ్రాయిడ్‌ వెర్షన్స్‌తో కలిపి వాటిని మొబైల్‌ ఫోన్లలో తీసుకొస్తున్నాయి. వీటినే కస్టమైజ్డ్‌ ఓఎస్‌లు అంటారు. కాగా ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ కంపెనీలన్నీ Huawei OS ఉపయోగిస్తే అప్పుడు గూగుల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తప్పదు. దీంతో పాటుగా చైనా వెలుపల చైనా ఫోన్లకు కూడా డిమాండ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

జన రంజకమైన వార్తలు