సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్టింగు పెడితే దానికి మన మిత్రులు, బంధువులు, ఇతర పరిచయస్థులు లైకులు కొడుతుంటారు. సోసల్ మీడియాలో మనకు లైకులొస్తే దాని ఆధారంగా లోను గ్రాంటు చేసే సంస్థ ఒకటి ఉంది. అది టాటా క్యాపిటల్.. సలామ్ లోన్స్ పేరుతో ఇలా లైకులకు లోన్లిస్తోంది.
లోన్లు ఇవ్వడం ఎంత సులభతరం అయిపోయినా కూడా ఇప్పటికీ రకరకాల కారణాల వల్ల కొందరికి లోన్లు దొరకడం కష్టమవుతోంది. ఇలాంటి వారికి రుణాలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా టాటా క్యాపిటల్ ‘సలామ్ లోన్స్’ను ప్రవేశ పెట్టింది.
ఎవరు అర్హులు?
ఆర్థికంగా వెనుకబడిన వారు, తక్కువ ఆదాయం ఉన్నవారు, వార్షికాదాయం రూ.3లక్షలకు మించని వారు ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం కావాలనుకునే వారు తమకు రుణం ఎందుకు అవసరమో వివరిస్తూ ఒక నోట్ సమర్పించాలి. వెంటనే దీనిని www.doright.in వెబ్‌సైటులో 3-4వారాలపాటు కనిపించేలా పెడతారు. దీంతోపాటు టాటా క్యాపిటల్ ఫేస్‌బుక్ పేజీ, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తారు. వాటిలో వచ్చిన లైకులు ఆధారంగా టాటా క్యాపిటల్ రుణాన్ని మంజూరు చేస్తుంది.
అయితే, రుణం ఇచ్చే ముందు ఆ వ్యక్తుల పూర్తి సమాచారం సేకరించి, వ్యక్తిగత చర్చల అనంతరమే అప్పు మంజూరు చేస్తుంది. కనీసం రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకూ రుణం ఇస్తారు. దరఖాస్తుదారుడి కనీస వయసు 21ఏళ్లు ఉండాలి. ఉద్యోగం చేసే వారికి గరిష్ఠ వయసు 60 ఏళ్లు. స్వయంఉపాధి పొందేవారికి 65ఏళ్లు. తీసుకున్న రుణాన్ని 12 నుంచి 36నెలల్లో తిరిగి చెల్లించవచ్చు.
వడ్డీ తక్కువే..
సాధారణ వ్యక్తిగత రుణాలకంటే.. 2-3% తక్కువకే ఇస్తారు. హామీలు, సిబిల్ స్కోరులాంటివేవీ అక్కర్లేదు. వ్యక్తిగత, చిరునామా, ఆదాయ ధ్రువీకరణలు, ఆరు నెలల బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే సరిపోతుంది. లోను కావాలనుకునే వారు సొంతంగానూ లేదా.. వారి తరఫున ఇతరులెవరైనా సరే వెబ్‌సైటులో వారి అవసరాన్ని పేర్కొంటూ దరఖాస్తును దాఖలు చేయవచ్చు. సొంతంగా దాఖలు చేయలేని వారు SALAAM అని 56161561కు ఎస్సెమ్మెస్ పంపించినా చాలు. టాటా క్యాపిటల్ ప్రతినిదులే లైన్లోకి వచ్చి సహాయం చేస్తారు.