బ్యాన్ చైనా అని చైనా ఫోన్లను కొనవద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ అమెరికా కంపెనీ ఐఫోన్ కూడా చైనాలోనే అసెంబుల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాపిల్ తమ ఐఫోన్ ప్రేమికుల కోసం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై చైనాలో కాకుండా చెన్నైలోనే ఐఫోన్లు తయారుచేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ట్విటర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో మేకిన్ ఇండియాలో ఇదో కీలకమైన పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
ఐఫోన్ 11తో
ప్రస్తుతం యాపిల్ తాజా మోడల్ ఐఫోన్ 11 తయారీని ఇండియాలో ప్రారంభించింది. ఇప్పటికే ఐఫోన్ ఎక్స్ ఆర్ మోడల్ ఐఫోన్‌ను చైన్నైలోని ఫాక్సుకాన్ యూనిట్‌లో తయారుచేస్తున్నారు. అది ప్రారంభించిన 9 నెలల తర్వాత ఇప్పుడు ఐఫోన్ 11 తయారీని కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు.
ధరలు తగ్గొచ్చు
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్లలపై 20 శాతం ట్యాక్స్ చెల్లించాలి. ఇండియాలో తయారయ్యే ఫోన్లకైతే ఆ ట్యాక్సు కట్టక్కర్లేదు. దీంతో చెన్నైలో తయారయ్యే ఐఫోన్ల ధరలు తగ్గుతాయి. అంటే ఐఫోన్11, ఎక్స్ ఆర్ ఫోన్ల ధరలు త్వరలో తగ్గుతాయి. ఐఫోన్ ఎస్‌ఈ 2020ని బెంగళూరు సమీపంలోని విస్ట్రాన్ ప్లాంట్‌లో తయారు చేయాలని కూడా యాపిల్ ఆలోచిస్తోంది. అంటే వాటి ధరలు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది.