• తాజా వార్తలు

వాట్సాప్ లో మీకు ఈ మెసేజ్ వస్తే అస్సలు ఫార్వార్డ్ చేయొద్దు.. అదంతా ఫేక్

  సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తప్పుడు ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడో ఎవరో ఒక మెసేజ్ మొదలు పెడితే చాలు, అందులోని మంచిచెడులు చూసుకోకుండా ఫార్వర్డ్ చేస్తుంటారు. ఇవి అనవసరపు ప్రచారాలకు ఒక్కోసారి ఘర్షణలు, అల్లర్లకు కూడా దారితీస్తుంటాయి.  సుమారు 100 రోజులుగా ఇలాంటి ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో, వాట్సాప్ లో జరుగుతోంది.  దేశంలో అత్యంత సున్నితమైన అంశమైన బాబ్రీమసీదు-రామజన్మభూమి ఇష్యూ నేపథ్యంలో ఇది జరుగుతోంది.
    యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మార్చి 26న ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడికి నాలుగు రోజుల ముందు సుప్రీం కోర్టు రామమందిరం విషయంలో కోర్టు బయట పరిష్కారం కనుగొనాలని సూచించింది. కోర్టు సూచనలు వచ్చిన రెండు రోజుల్లోనే ఒక తప్పుడు ప్రచారం మొదలైంది. అప్పటికి యోగి పేరు సీఎంగా ఖరారైంది. ఈ నేపథ్యంలో కొందరు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బాబ్రీమసీదు ప్లేసులో రామమందిరం కట్టాలా వద్దా అని ఆన్ లైన్లో అభిప్రాయాలు తెలుసుకుంటోందంటూ.. ఓ వెబ్ లింక్ ఇచ్చి ప్రచారం మొదలైంది. 

‘‘ Do you want Ram Mandir or Babri Masjid on the Ayodhya disputed land? I have participated in Online Poll on Ayodhya Issue. Request you to vote on http://ayodhya-issue.gov-up.in/
It is important to share our views with Govt.’’  అంటూ ఈ సందేశం వస్తోంది.


కానీ, ఇదంతా నకిలీ వెబ్ సైట్ తో జరుపుతున్న దుష్ప్రచారం.     www.ayodhya-issue.gov-up.in అంటూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్ డొమైన్ లా కనిపించే నకిలీ వెబ్ అడ్రస్ తో ఈ ప్రచారం మొదలైంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్ కు సంబంధించింది అయితే http://up.gov.in/ అనే డొమైన్ ఉంటుంది.. కానీ, ఇందులో gov-up.in అని ఉంది. కానీ... ఇవన్నీ అందరికీ అవగాహన ఉండనివారు చాలామంది.. వారంతా కరడుగట్టిన హిందూత్వ వాది అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిజంగానే ఇలాంటి ఒపీనియన్ పోల్ నిర్వహిస్తున్నారని భావించే ఆస్కారమూ ఉంది. అంతేకాదు, ఈ సైట్లో యోగి చిత్రాలు కూడా వాడుకోవడంతో అలాంటి అవకాశం మరింత ఉంది.
    అయితే... ఈ ప్రచారం మొదలైన మార్చి చివరివారంలోనే మీడియాలో ఇదంతా ఫేక్ అంటూ కథనాలు వచ్చాయి. అదేసమయంలో ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక హిందూస్థాన్ టైమ్స్ దీనిపై పరిశోధన చేయగా.. ఈ వెబ్ అడ్రస్ తరుణ్ చౌదరి అనే వ్యక్తి పేరు మీద ఉందని, ఢిల్లీ చిరునామాతో రిజిష్టర్ చేశారని తేలింది. కానీ.. అది తప్పుడు చిరునామాగా తేలింది. మరింత పరిశోధన చేసేసరికి ఈ డొమైన్ రిజిష్ర్టేషన్లో వాడిన మొబైల్ అక్తర్ అలీ అనే వ్యక్తికి చెందినదిగా తేలింది. అలీ, కర్ణాటకలో ఒక ఐటీ కంపెనీ నడుపుతున్నాడు. కానీ.. అతడు, తనకు దీనితో ఏమీ సంబంధం లేదని, తన మొబైల్ నంబరును ఎవరో వాడుకుని దీన్ని రన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆ తరువాత ఈ వెబ్ సైట్ ను నిలిపివేశారు.
     సుమారు మూడు నెలలుగా సర్క్యులేట్ అవుతున్న ఈ మెసేజ్ మళ్లీ తాజాగా దక్షిణాదిలో సర్య్యులేట్ అవుతోంది. కాబట్టి ఇలాంటి వెబ్ లింక్ తో వచ్చే సందేశాలను నమ్మడం.. వాటిని ఫార్వర్డ్ చేయడం మాత్రం చేయొద్దు.
 

జన రంజకమైన వార్తలు