• తాజా వార్తలు

ఆన్‌లైన్‌ వీసా పేరిట నైజీరియన్ల కొత్త దందా

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఆన్ లైన్లో వీసా తెప్పిస్తామని చెబుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారు. వీసా ప్రాసెసింగ్‌ రుసుం.. ఉద్యోగం ఇస్తున్న కాంట్రాక్టును మెయిల్‌ ద్వారా పంపుతున్నారు.. మరింత నమ్మకం కలిగించేందుకు విమాన టిక్కెట్లను కూడా ఇస్తున్నారు.. ఆ తరువాత రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వివిధ దశల్లో వసూలు చేశాక అందుబాటులో లేకుండా మాయమైపోతున్నారు. హైదరాబాద్ పరిధిలో గత పదిరోజుల వ్యవధిలో 12 మంది వీరి బారిన పడి మోసపోయారు. బాధితుల నుంచి నైజీరియన్లు రూ.57 లక్షలు స్వాహా చేశారు. దిల్లీ కేంద్రంగా వీరంతా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.
నౌకరీ డాట్‌ కాం... షైన్‌.. మాన్‌స్టర్‌ డాట్‌కాం వంటి అంతర్జాల ఉద్యోగ సైట్లలో ఉండే వ్యక్తిగత, సంస్థల వివరాలను నైజీరియన్లు సేకరిస్తున్నారు. అనంతరం అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ తదితర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్కడి నుంచే మాట్లాడుతున్నట్లు అభ్యర్థులను నమ్మిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు..ఉద్యోగాలిస్తామని, తక్కువ రుసుంతో వీసా సైతం పంపిస్తామని వల వేస్తున్నారు. వీరి మాటలు నమ్మి హిమాయత్‌నగర్‌లోని ఓ కన్సల్టెంట్‌ తమ వద్ద 12 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లున్నారని, వారికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలిప్పించాలంటూ అభ్యర్థించారు. దీంతో ఒక్కో అభ్యర్థికి రూ.4.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ఇవ్వాలని నైజీరియన్లు పేర్కొనడంతో కన్సల్టెన్సీ నిర్వాహకుడు రూ.10 లక్షలు ముందస్తు సొమ్ము పంపించాడు. తర్వాత 12 మంది అభ్యర్థుల పేరిట వీసాలు, విమానం టిక్కెట్లు రావడంతో మిగతా రూ.40 లక్షలూ నైజీరియన్లు చెప్పిన ఖాతాలో జమ చేశారు. తర్వాత వీసాలను పరిశీలించగా నకిలీవని తేలింది. దీంతో తమకు ఫోన్‌ చేసినవారిని సంప్రందించేందుకు యత్నించగా ఫోన్‌ పనిచేయలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించారు.
సికింద్రాబాద్‌కు చెందిన ప్రకాశ్‌ అనే వ్యక్తి సైతం ఇలాగే నైజీరియన్‌ గాలానికి చిక్కుకుని చేస్తున్న ఉద్యోగం మానేసి రూ.4 లక్షలు చెల్లించాడు. విమానం టిక్కెట్‌ తీసుకుని శంషాబాద్‌కు వెళితే నకిలీ టిక్కెట్‌ అని, ఇమిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రకాశ్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కెనడాలోని ఓ బంగారు గనిలో అనలిస్టుగా ఉద్యోగం ఇచ్చినట్లు నైజీరియన్‌ ఉద్యోగ నియామక పత్రం పంపించాడు. దీంతో ప్రకాశ్‌ అప్పటికే గూగుల్‌ మ్యాప్స్‌లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తొలుత రూ.1.50 లక్షలు చెల్లించి, మరో రూ.2.50 లక్షలు అప్పు చేసి నైజీరియన్‌ ఖాతాలో వేయగానే మోసగాడు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. ఇలా చాలామందిని మోసగించారు. ఎవరైనా విదేశీ ఉద్యోగాల పేరిట సొమ్ము అడిగితే నమ్మరాదు. వారు చెప్పే దేశాల రాయబార కార్యాలయాల్లో సంప్రదించి వివరాలు చెక్ చేసుకోవలి. లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది.

జన రంజకమైన వార్తలు