• తాజా వార్తలు

2020 నాటికి ఆన్ లైన్ షాపింగ్ ఎలా ఉండబోతోంది..?

దేశంలో డిజిటల్ విప్లవం మొదలైంది. అన్నిటికీ మించి ఆన్ లైన్ కొనుగోళ్ల సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ షాపర్లు డెస్కుటాప్ లు, ల్యాపీల నుంచి క్రమంగా స్మార్టు ఫోన్లకు మళ్లిపోతూ ఫోన్లోనే అన్ని రకాల కొనుగోళ్లు జరుపుతున్నారు. ఏదో ఒక షాపింగ్ యాప్ లేని స్మార్టు ఫోనే కనిపించదు ఇప్పుడు. ఆన్ లైన్ షాపింగ్ చేసేవారిలో 85 శాతం మంది మొబైల్ ఫోన్లోనే కొనుగోళ్లు జరిపేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఆన్ లైన్ కొనుగోళ్ల ధోరణులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఆఫ్ లైన్లో ఎన్ని వైఖరులు ఉంటున్నాయో ఆన్ లైన్లోనూ అన్నీ సాధ్యమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ మార్కెట్ పై డిజిటల్ ప్రభావం తారాస్థాయిలో ఉంది. ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది బాగుందని ఫీలయితే మిత్రులు, బంధువలకు రికమెండ్ చేయడం.. కొనుగోలు చేయాలనుకున్న వస్తువును ఇతరులకు కూడా ముందే చూపించి అభిప్రాయాలు తెలుసుకోగలగడం.. ఇంతవరకూ ఎన్నడూ చూడని కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి రావడం.. కొనుగోళ్ల సమయంలో ఆఫర్లు, బేరమాడే అవకాశం కూడా ఉండడం వంటివన్నీ ఆన్ లైన్ కొనుగోళ్లపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాషన్ షాపింగ్ లో డిజిటల్ ట్రెండ్సు మార్కెట్ కు కొత్త ఊపు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఫేస్ బుక్ లు కలిసి సమగ్రంగా అధ్యయనం చేశాయి.. డిజిటల్ షాపింగ్ భవితను అంచనా వేసి తాజాగా ఓ నివేదికను విడుదల చేశాయి. 2020 నాటికి ఇది ఎలా ఉంటుందో అంచనా వేశాయి.
అధ్యయనంలో కీలకాంశాలివీ..
* 2020 నాటికి ఫ్యాషన్ షాపర్ల సంఖ్య 13.5 కోట్లకు చేరుతుంది.
* ఆన్ లైన్ లో తొలిసారి కొనుగోలు చేసే ప్రతి ముగ్గురిలో ఒకరు దుస్తులు, షూస్, ఇతర ఫ్యాషన్ వస్తువులే కొనుగోలు చేస్తారు.
* అంటే ఆన్ లైన్ షాపింగ్ కు ఫ్యాషన్ వస్తువులే ప్రధాన ద్వారమవుతాయని చెప్పుకోవాలి.
* 2020 తరువాత ఆన్ లైన్ కొనుగోలుదార్లలో 90 శాతానికిపైగా మొబైల్ ఫోన్లపైనే ఆధారపడతారు.
* 2020 నాటికి ఆన్ లైన్లో ఫ్యాషన్ గూడ్స్ కొనుగోళ్లు 3 వేల కోట్ల డాలర్లకు చేరుతాయి.
* భారత దేశంలో ప్రస్తుతం ఫ్యాషన్ ఇండస్ర్టీ విలువ 7 వేల కోట్ల డాలర్లు ఉంటుంది. అందులో సుమారు 900 కోట్ల డాలర్ల మేర వ్యాపారంపై ఆన్ లైన్ ప్రభావం ఉంది. 2020 నాటికి ఈ ప్రభావం నాలుగు రెట్లు పెరగనుందని అంచనా.
* బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలో 70 శాతం వాటా ఆన్ లైన్ కొనుగోళ్లదే ఉండనుంది.
* 2020 నాటికి ఈ-కామర్స్ మార్కెట్ 1400 కోట్ల డాలర్లకు చేరనుంది.
మగవాళ్లకు డిస్కౌంట్లు.. ఆడవాళ్లకు వెరైటీలు..
* మెట్రో సిటీల్లో ఆన్ లైన్ షాపింగ్ చేసేవాళ్లలో పురుషులు ఎక్కువగా డిస్కౌంట్లపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఈ ట్రెండు మరింత పెరగనుంది.
* అదేసమయంలో ఆడవాళ్లు మాత్రం డిస్కౌంట్ల కంటే వెరైటీ ఆఫ్ గూడ్స్ పైనే దృష్టి పెడుతున్నారు.

జన రంజకమైన వార్తలు