• తాజా వార్తలు

ఏషియ‌న్ గేమ్స్‌లో.. వీడియో గేమ్స్‌

గేమ్స్ ఇంట్రెస్ట్ అని రెజ్యూమ్‌లో రాశావు.. ఏ గేమ్స్ ఆడ‌తావు అని ఇంట‌ర్వ్యూకు వ‌చ్చిన కుర్రాణ్ని అడిగాడు ఆఫీస‌ర్‌.. వీడియో గేమ్స్ జ‌వాబిచ్చాడా అబ్బాయి.. సినిమాల్లోనూ ఈ జోక్ వ‌చ్చింది. కానీ ఆ జోక్ ఇప్పుడు నిజ‌మ‌వ‌బోతోంది. స‌ర‌దాగా టైంపాస్ కోసం ఆడే వీడియో గేమ్స్‌ను ఏషియ‌న్ గేమ్స్‌లో పెట్ట‌డానికి రంగం సిద్ధ‌మైపోయింది!
2022 నుంచి ప్రారంభం
వీడియో గేమ్స్ ను ఈ-గేమ్స్ విభాగంలోకి తీసుకుని 2022లో చైనాలోని హాంగ్జోయ్‌లో జ‌రిగే 19వ ఆసియా క్రీడ‌ల్లో చేర్చాల‌ని ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా నిర్ణ‌యించింది. వచ్చే సంవ‌త్స‌రం ఇండోనేషియాలోని పాలెంబాంగ్‌లో జ‌రిగే 18వ ఏషియ‌న్ గేమ్స్‌లో డిమాన్‌స్ట్రేష‌న్ స్పోర్ట్‌గా ఇంట్ర‌డ్యూస్ చేయ‌బోతున్నారు. ఎల‌క్ట్రానిక్ గేమ్స్ ను(ఈ-గేమ్స్‌)ను ఏషియ‌న్ గేమ్స్‌లోకి తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నానికి ఇది ఫ‌స్ట్ స్టెప్ అని కౌన్సిల్ చెబుతోంది. వీడియో గేమ్స్‌ను ఏషియ‌న్ గేమ్స్‌లో చేర్చుతామ‌ని చెబుతున్నా ఏ గేమ్స్‌కు స్థానం కల్పిస్తారో ఇంకా నిర్ధ‌ర‌ణ కాలేదు. అయితే చైనీస్ వ్యాపార దిగ్గ‌జం అలీబాబా గ్రూప్‌కు చెందిన అలీస్పోర్ట్స్‌తో క‌లిసి 2018 గేమ్స్‌లో ఈ-గేమ్స్‌ను డిమాన్‌స్ట్రేష‌న్ స్పోర్ట్ గా ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కౌన్సిల్ ప్ర‌క‌టించింది.
గేమ‌ర్ల‌కు పండ‌గే..
వీడియో గేమ్స్‌ను ఏషియ‌న్ గేమ్స్‌లో చేర్చాల‌న్న నిర్ణ‌యం గేమింగ్ రంగాన్ని అసాధార‌ణ రీతిలో ప్ర‌భావం చూప‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు టైంపాస్ గేమ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ వేలాది కోట్ల రూపాయ‌ల గేమింగ్ మార్కెట్ ఇప్పుడ‌ది ఇంట‌ర్నేష‌న‌ల్ గేమ్‌గా మారితే మ‌రింత దూసుకెళుతుంది. గేమింగ్ డిజైన్ మాత్ర‌మే కాదు ఇక‌పై వాటిని నేర్పే ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లు, కోర్సులు, కోచ్‌లు కూడా పుట్టుకొస్తాయి. పూర్తి స్థాయి గేమ్‌గా మారుతున్నందున దీనిమీద జాబ్ అవ‌కాశాలు వ‌స్తాయి. ఈ రంగంలో ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న క్యాండెట్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. అంతెందుకు అస్త‌మానూ వీడియో గేమ్ లేనా అని తిట్టే అమ్మానాన్న కూడా వీడియో గేమ్స్ బాగా ఆడ‌డానికి ద‌గ్గ‌రుండి కోచింగ్ ఇప్పిస్తారేమో. ఇంకాసేపు ఆడుకుని వ‌చ్చే ఏషియ‌న్ గేమ్స్‌కు సెలెక్ట్ కావాల‌ని బ‌తిమాల‌తారేమో..!

జన రంజకమైన వార్తలు