• తాజా వార్తలు
  •  

గూగుల్ ప్రైవ‌సీ సెట్టింగ్స్‌కు మోస్ట్ ఎలాబొరేటివ్‌ గైడ్‌

ప్రైవ‌సీ పాల‌సీ అంటే ఏదైనా కంపెనీకి మ‌న‌కు మ‌ధ్య  ఒక ఒప్పందం.  ముఖ్యంగ పెద్ద టెక్నాల‌జీ కంపెనీలు త‌మ యూజర్ల‌తో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందుగానే నియ‌మ నిబంధ‌న‌లు మాట్లాడుకుంటాయి. దీనిలో భాగంగానే ప్రైవ‌సీ పాల‌సీని త‌ప్ప‌ని స‌రి చేస్తాయి. అంటే త‌మ కంపెనీల్లో ఉంచిన మ‌న డేటా సేఫ్ అని చెప్ప‌డం ఈ ఒప్పందంలో భాగం. ముఖ్యంగా గూగుల్ ఈ విష‌యంలో ముందుంటుంది. ఈ సంస్థ ఎప్ప‌టిక‌ప్పుడు ప్రైవ‌సీ పాల‌సీని మారుస్తుంది కూడా.  1999 నుంచి ఇప్ప‌టిదాకా గూగుల్ 28 సార్లు ప్రైవ‌సీ పాల‌సీని అప్‌డేట్ చేసింది. ఒక్క 2017లోనే గూగుల్ మూడుసార్లు ప్రైవ‌సీ పాల‌సీని అప్‌డేట్ చేసింది.    మ‌రి గూగుల్ ప్రైవ‌సీ పాల‌సీ సెట్టింగ్స్‌ను మేనేజ్ చేయ‌డం ఎలా?

జీడీపీఎర్ ప్ర‌కారం..
సాధార‌ణంగా గూగుల్ యూరోపియ‌న్ లాస్ ప్ర‌కార‌మే ఈ ప్రైవ‌సీ పాల‌సీని రూపొందిస్తుంది. జ‌న‌ర‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ రెగ్యుల‌రేష‌న్ (జీడీపీఆర్‌)ను అనుస‌రించి నియ‌మ నిబంధ‌న‌లు పెడుతుంది. మీ డేటాను సేవ్ చేయడం కోసం ఫ‌లానా నిబంధ‌న‌లు ఉన్న‌ట్లుగా గూగుల్ చెబుతుంది. మ‌రి గూగుల్ ఎంతైనా విదేశీ కంపెనీ. మ‌న సున్నిత‌మైన డేటా ఎంత వ‌ర‌కు సేఫ్‌! వీటిలో ఎక్కువ నిబంధ‌న‌లు యూరోపియ‌న్ సిటిజ‌న్ల‌కు త‌గ్గ‌ట్టుగా ఉంటాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే గూగుల్ మిమ్మ‌ల్ని కంట్రోల్ చేయ‌కుండా చేయ‌డానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

గూగుల్ ప్రైవ‌సీని కంట్రోల్ చేయ‌డం
2015లో మై అకౌంట్ పేజ్‌ని స‌మూలంగా మార్చింది. ప్రైవ‌సీ, సెక్యూరిటీ ఈ రెండింటిని ఒకే తాటి మీద‌కు తీసుకు రావ‌డానికి గూగుల్ చేసిన ప్ర‌య‌త్న‌మది. అంటే గూగుల్‌కు సంబంధించిన  జీమెయిల్‌, గూగుల్ డ్రైవ్‌, యూట్యూబ్ లాంటి వాటిని ఒకే పాస్‌వ‌ర్డ్‌, ఒకే సెక్యూరిటీ సిస్ట‌మ్ ద్వారా నియంత్రించ‌డం గూగుల్ కొత్త ప్రైవ‌సీ విధానంలో భాగం. గూగుల్ సెట్టింగ్స్ ద్వారా త‌న‌కు సంబంధించిన అన్ని టూల్స్‌ను నియంత్రించాల‌ని నిర్ణ‌యించింది. దీని కోసం ముందుగా ప్రైవ‌సీ.గూగుల్‌.కామ్ అనే సైట్ ఓపెన్ చేయాలి. దీనిలో గూగుల్ అడ్వ‌ర్టేజ్‌మెంట్ పాల‌సీ ఇత‌ర నిబంధ‌న‌లు ఉంటాయి. మీకు సంబంధించి డేటా ఎలా కలెక్ట్ చేసి దాస్తుందో  కూడా ఇందులో ఉంటుంది. అయితే ఆ డేటాకు తాము పూర్తి సెక్యూరిటీ ఇస్తామ‌ని గూగుల్ ప్ర‌క‌టించింది.

సెక్యూరిటీ చెక‌ప్‌
మీకు ఒక‌టికి మించి గూగుల్ అకౌంట్స్ ఉంటే ఒక‌టి ఆఫీసు కోసం ఒక‌టి వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం అయితే మీరు ముందుగా వాటిని సెక్యూరిటీ చెక్ చేయించాలి. సెక్యూరిటీ చెక‌ప్ మీద క్లిక్ చేస్తే యువ‌ర్ డివైజ‌స్‌, థ‌ర్డ్ పార్టీ యాక్సెస్‌, రీసెంట్ సెక్యూరిటీ యాక్టివిటీ, 2 స్టెప్ వెరిఫికేష‌న్ అనే ఆప్షన్లు వ‌స్తాయి. చాలాకాలం వాడ‌ని డివైజ్‌ల‌ను ఎల్లో మార్క్ ఎక్స్‌క్ల‌మేష‌న్‌తో చూపిస్తుంది ఇందులో. థ‌ర్డ్ పార్టీ యాక్సెస్ ఉన్న యాప్‌లు కూడా ఇందులో ఉంటాయి. 2 స్టెప్ వెరిఫికేష‌న్‌ను అనేబుల్ చేయ‌డం చాలా ఉత్త‌మం. అంటే మీ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే రెండు సెక్యూరిటీ స్టెప్స్ దాటి ముందుకెళ్లాలి. మొద‌ట మీ పాస్‌వ‌ర్డ్ ద్వారా జీమెయిల్ ఓపెన్ చేశాం అనుకోండి... ఆ త‌ర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంటర్ చేస్తేనే మీ మెయిల్ ఓపెన్ అవుతుంది. అంటే ఎవ‌రికైనా పాస్‌వ‌ర్డ్ తెలిసినా ఉప‌యోగం ఉండ‌దు.  పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకోడం కూడా మంచిది. దీని కోసం ప్రైవ‌సీ సెట్టింగ్స్‌లో మీకు చేంజ్ పాస్‌వ‌ర్డ్ ఆప్ష‌న్ ఉంటుంది. 

ప్రైవ‌సీ చెక‌ప్‌
మై అకౌంట్ పేజీలో మీకు ప్రైవ‌సీ చెక‌ప్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఈ మ‌ల్టీ స్టెప్ ప్రాసెస్ ద్వారా గూగుల్ మీ డేటాను ఎలా ఉప‌యోగించుకుంటుంద‌నే విష‌యం మ‌న‌కు అర్ధం అవుతుంది. స్టెప్ వ‌న్‌లో మీకు యూట్యూబ్‌లో మీరు షేర్ చేసిన కంటెంట్ వివ‌రాలు క‌న‌బ‌డ‌తాయి. మీ ఛాన‌ల్స్‌, మీకున్న స‌బ్‌స్క్రిప్ష‌న్లు చూడొచ్చు. దీనిలో అవ‌స‌రం అయిన వీడియోల‌ను ప‌బ్లిక్‌లో పెట్టి మిగిలిన వీడియోలు ప్రైవేట్ ఆప్ష‌న్‌గా సెట్ చేసుకోవ‌చ్చు. గూగుల్ ఫొటోస్ మ‌రో ఆప్ష‌న్‌. దీనిలో మీరు జియో లొకేష‌న్‌ను రిమూవ్ చేయ‌డం మంచిది.  హెల్ప్ పీపుల్ క‌నెక్ట్ విత్ యూ అనే ఆప్ష‌న్‌లో మీరు కావాల‌నుకుంటే మీ ఫోన్ నంబ‌ర్ ఇవ్వొచ్చు. ఇదొక ఇబ్బంది అనుకుంటే తీసేయ‌చ్చు. గూగుల్ ప్ల‌స్‌, మై యాక్టివిటీ, చెక్ ఔట్ మై డేటా లాంటి ఆప్ష‌న్ల‌లో కూడా మీరు ప్రైవ‌సీ చెక్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు