• తాజా వార్తలు

ఐఫోన్ 12‌.. మేడిన్ ఇండియా.. వ‌చ్చే ఏడాదే

ఐఫోన్ అంటే టెక్ ల‌వ‌ర్స్‌కు ఎక్క‌డ‌లేని మోజు. కానీ ధ‌ర చూస్తేనే చాలామంది వెన‌క్కిత‌గ్గుతారు. అదే మ‌న దేశంలోనే ఐఫోన్ త‌యారుచేస్తే ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవీ ఉండ‌వు కాబ‌ట్టి ఫోన్ ధ‌ర త‌గ్గుతుంది. ప్రొడ‌క్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ ప‌థ‌కం కింద కేంద్ర ప్ర‌భుత్వం మొబైల్ ఫోన్  కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు పెట్టి ఇక్క‌డే ఫోన్లు త‌యారుచేస్తే వారికి ట్యాక్స్‌ల్లో చాలా మిన‌హాయింపులిస్తోంది. దీంతో ఒప్పో, వివో,  రెడ్‌మీ లాంటి కంపెనీలు ఇక్క‌డ ప్లాంట్లు పెడుతున్నాయి. మ‌రో వైపు యాపిల్ రెండేళ్ల‌నుంచే త‌మ ఐఫోన్లు ఇండియాలో త‌యారుచేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. 

బెంగ‌ళూరులో ప్లాంట్‌
ఇందుకోసం ఇప్ప‌టికే బెంగ‌ళూరు స‌మీపంలోని న‌ర‌సాపుర‌లో ప్లాంట్‌ను పెట్టింది. 2,900 కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డితో దాదాపు 10వేల మంది ఉద్యోగుల‌ను నియ‌మించుకుని ఈ ఏడాది అక్టోబ‌ర్ నుంచి ఇక్క‌డే ఐఫోన్లు త‌యారుచేయాల‌ని ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టికే 1000 మందికి పైగా ఉద్యోగులు ఈ ప్రాజెక్టులో ప‌ని ప్రారంభించారు. 

ఇప్ప‌టికే అసెంబ్లింగ్ 
 ఐఫోన్ 11, ఐఫోన్ టెన్ ఆర్‌ల‌ను ఇప్ప‌టికే చైన్నై స‌మీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తోంది. అయితే వీటిని  మొత్తం బెంగ‌ళూరు ప్లాంట్‌లో త‌యారుచేయ‌నున్నారు. త్వ‌ర‌లో రాబోయే ఐఫోన్ 12 కూడా ఇక్క‌డే త‌యారుచేస్తారు. ఇది 2021 మ‌ధ్య‌లో అందుబాటులోకి రానుంద‌ని స‌మాచారం.