• తాజా వార్తలు

స్పామ్ కాల్స్ నుండి శాశ్వత విముక్తికై వేంచేసిన దూస్రా ఫోన్ నెంబర్

డిజిట‌ల్ యుగంలో ఉన్నాం కాబ‌ట్టి అన్నింటికీ మీ ఫోన్ నంబ‌రే కీల‌కం. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్ వ‌ర‌కు, పాన్ కార్డ్ నుంచి ఆధార్ కార్డ్ వ‌రకు అన్నింటికీ అదే నంబ‌ర్‌. ఆ నంబ‌ర్‌ను మీరు ఎక్క‌డైనా చెప్పాల్సిన సంద‌ర్భంలో దాన్ని ఎవ‌రైనా దుర్వినియోగం చేస్తారేమోన‌ని అనుమానం ఉంటుంది. ముఖ్యంగా సూప‌ర్‌మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లో మీ నంబ‌ర్‌ను అడిగిన‌ప్పుడు మీ మొబైల్ నంబ‌ర్ ఇస్తే త‌ర్వాత స్పామ్ కాల్స్ మీకు పోటెత్తుతాయి. బిజినెస్ ప్ర‌మోష‌న్ మెసేజ్‌ల‌తో మీ ఇన్‌బాక్స్ నిండిపోతుంది. ఈ స‌మ‌స్య‌కు పరిష్కారం తీసుకొచ్చింది హైద‌రాబాదీ స్టార్ట‌ప్ టెన్20 ఇన్ఫోమీడియా . దీనికోసం దూస్రా యాప్‌ను తీసుకొచ్చింది.

ఏమిటీ దూస్రా యాప్‌
దూస్రా అంటే హిందీలో రెండోది అని. అంటే మీ మొబైల్ నంబ‌ర్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఇంకో నంబ‌ర్ అన్న‌మాట‌. దీన్ని మీరు ఎక్క‌డైనా ఇచ్చుకోవ‌చ్చు.  దీని ద్వారా మీకు స్పామ్ కాల్స్‌, మెసేజ్‌లు వ‌చ్చినా ఇబ్బంది ఉండ‌దు. ఎందుకంటే ఇది మీ అస‌లు ఫోన్ నంబ‌ర్ కాదు కాబట్టి. అంతేకాదు ఈ మెసేజ్‌లు, కాల్స్ మీ ఫోన్‌కు రావు. దీనికోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన యాప్‌కి వ‌స్తాయి. వాటిని కావాలంటే మీరు చూడొచ్చు. లేదా వ‌దిలేయ‌చ్చు. 

ఎలా ప‌ని చేస్తుంది?
* దూస్రా యాప్‌ను ప్లే స్టోర్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

* ఈ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తే 10 అంకెల మొబైల్ నెంబర్ ఇస్తారు. 

* దీనికి ఎలాంటి సిమ్ ఉండ‌దు. కేవ‌లం డిజిట‌ల్ నంబ‌ర్ మాత్ర‌మే

* ఈ నంబ‌ర్‌కు వ‌చ్చే కాల్స్‌, మెసేజ్‌ల‌న్నీ దూస్రా యాప్‌లోనే ఉంటాయి. 

*  ఎక్కడైనా షాపింగ్‌కు వెళ్లిన‌ప్పుడు లేదా ఇంకేదైనా అన‌వ‌స‌ర సంద‌ర్బాల్లో ప‌ర్స‌న‌ల్‌ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దూస్రా నెంబర్ ఇస్తే సరిపోతుంది.

* దూస్రా యాప్‌లో సెట్టింగ్స్ ద్వారా నెంబర్‌కు వచ్చే కాల్స్ బ్లాక్ చేసుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మ‌నుకుంటే వాయిస్ మెయిల్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. 
 
ఏడాదికి 700 రూపాయ‌లు 
ఈ దూస్రా నంబ‌ర్‌ను వాడుకోవ‌డానికి ఫీజు చెల్లించాలి. ఇది ఎంతో కాదు జ‌స్ట్ ఏడాదికి 700 రూపాయ‌లు మాత్ర‌మే. అంటే ర‌ఫ్‌గా రోజుకు 2 రూపాయ‌లు. అయితేనే స్పామ్ కాల్స్‌, మెసేజ్‌ల‌ను మీకు ర‌క్ష‌ణ‌. మ‌న‌సుకు ప్ర‌శాంత‌త‌కూడా అంటున్నారు సంస్థ సీఈవో  సీఈవో ఆదిత్య.  దూస్రా నెంబర్‌కు వచ్చే అన్ని కాల్స్, మెసేజ్‌లను తీరికవేళలో యాప్‌లో చూసుకోవచ్చునని చెప్పారు. ఈ యాప్‌ను రీసెంట్‌గా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంచ్ చేశారు .  

జన రంజకమైన వార్తలు