• తాజా వార్తలు

ఇప్పుడు జ్యోతిష్కుల‌కు పెద్ద గిరాకీ టెకీల నుంచే.. ఎందుకంటే!

జ్యోతిష్యం.. ఒక‌ప్పుడు దీనికి మ‌హా ఆద‌రణ ఉండేది. కాలంతో పాటు దీని ప్రాభ‌వం కూడా త‌గ్గిపోతూ వ‌చ్చింది. ఇప్పుడు చిల‌క జ్యోతిష్యాలు చెప్పించుకునే వాళ్లు అరుదుగానే క‌నిపిస్తున్నారు. అయితే ఈ జ్యోతిష్యుల‌కు చాన్నాళ్ల‌కు మంచి గిరాకీ త‌గిలింది. అదీ టెకీల వ‌ల్ల‌! కంప్యూట‌రే ప్ర‌పంచంగా బ‌తికే టెకీల వ‌ల్ల జ్యోతిష్యుల‌కు బేరాలు త‌గ‌ల‌డం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ప‌రిస్థితి అదే మ‌రి!

భ‌విష్య‌త్ కోసం
ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ల‌కు త‌మ భవిష్య‌త్‌పై బెంగ ప‌ట్టుకుంద‌ట‌. త‌మ ఉద్యోగం స్థిరంగా ఉంటుందా? భ‌విష్య‌త్‌లో ఏమైనా ఇబ్బంది క‌లుగుతుందా? స‌్థాన చ‌ల‌నం ఉందా? ఇలాంటి విష‌యాల గురించి టెకీల తెగ మద‌న ప‌డిపోతున్నార‌ట‌. అందుకే త‌మ భ‌విష్య‌త్ గురించి తెలుసుకోవ‌డానికి జ్యోతిష్కుల ద‌గ్గ‌ర‌కు, సంఖ్య శాస్త్ర నిపుణుల ద‌గ్గ‌ర‌కు ప‌రుగుల తీస్తున్నార‌ట‌. వారి మాట‌ల ప్ర‌కారం పేరులో ఏ అక్ష‌రాలు తీసేస్తే మంచి జ‌రుగుతుంది.. లేక‌పోతే ఏ నంబ‌ర్ల వ‌ల్ల లాభం ఉంది లాంటి విష‌యాలపై బాగా దృష్టి పెడ‌తున్నార‌ట‌. న్యూమ‌రాల‌జిస్ట్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే క్లైయింట్‌ల‌లో 95 శాతం మంది సాఫ్ట్‌వేర్ నిపుణులే ఉన్నారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. వీరి వ‌య‌సు 35 నుంచి 45 మ‌ధ్యే ఉంది.

జాబ్ సెక్యూరిటీయే ప్ర‌యారిటీ
ఒక‌ప్పుడు మ‌మ్మ‌లి రీలొకేట్ చేయండి అని టెకీలు తెగ అడిగేవాళ్ల‌ట‌. మేం అమెరికా, లండ‌న్ వెళతాం అని ఉబ‌లాట‌ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. రీలొకేట్ చేయ‌డం సంగ‌తి అటుంచి క‌నీసం ఉద్యోగం ఉంటే చాల‌ని వాళ్లు భావిస్తున్నార‌ట‌. ఉద్యోగాన్ని నిల‌బెట్టుకునేందుకు జ్యోతిష్యులు, సంఖ్య శాస్త్ర నిపుణుల్ని ఆశ్ర‌యిస్తున్నారు. త‌మ‌కు ఏమైనా దోషం ఉందేమోన‌ని యాగాలు కూడా జ‌రిపిస్తున్నార‌ట కొంద‌రు!! ఆఫీసులో గుర్తింపు సంపాదించడం ఎలా? ప‌దోన్న‌తి పొంద‌డం ఎలా లాంటి విష‌యాలే జ్యోతిష్యుల‌ను వారు అడుగుతున్నార‌ట‌. పింక్ స్లిప్‌ల బారీ ప‌డ‌కుండా ఉండాలంటే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే విష‌యాల‌పైనే ఐటీ నిపుణులు కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేశార‌ట‌. కొంత‌మందికి నిద్ర స‌రిగా రాక‌పోవ‌డం, తిండి స‌రిగా తిన‌క‌పోవ‌డం లాంటి స‌మస్య‌లు కూడా ఉన్నాయ‌ట‌. వీటి ప‌రిష్కారం కోసం కూడా జ్యోతిష్యులు, బాబాల బాట ప‌డుతున్నార‌ట టెకీలు.

జన రంజకమైన వార్తలు