ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ల హిస్ట‌రీ మొత్తాన్ని ఎక్సెల్‌కి ఎక్స్‌పోర్ట్ చేయ‌డం ఎలా?

ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ హిస్ట‌రీని ఎక్సెల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందామా? ఆ మేర‌కు ‘‘కామా సెప‌రేటెడ్ వాల్యూస్’’ (CSV) ఫైల్ కింద‌కు మార్చి సేవ్ చేసుకునే వీలు క‌ల్పించే ఓ రెండు మంచి యాప్‌లేమిటో చూద్దాం. ఇవి అన్ని నోటిఫికేష‌న్ల‌ను లాగ్‌చేసి ఆ త‌ర్వాత ఎక్స్‌పోర్ట్ చేసేందుకు సాయ‌ప‌డ‌తాయి. ఇలా CSV ఫైల్‌గా మార్చుకున్న త‌ర్వాత దాన్ని MS Excelలో ఓపెన్ చేసుకోవ‌చ్చు. అందులో యాప్ పేరు, ప్యాకేజి,  టైమ్‌,  టైటిల్‌,  నోటిఫికేష‌న్ టెక్స్ట్ అన్నీ క‌నిపిస్తాయి. సాధారణంగా ప్ర‌మాద‌వ‌శాత్తూ ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్లు పోతుంటాయి. అయితే, వాటిలో ముఖ్య‌మైన‌వాటిని పోగొట్టుకోకుండా కింద పేర్కొన్న యాప్‌ల సాయంతో భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌చ్చు. అప్పుడు మీరు నోటిఫికేష‌న్ సెంట‌ర్ నుంచి దేన్నయినా డిలీట్ చేసినా యాప్‌లు అప్ప‌టికే వాటిని జాగ్ర‌త్త చేసి పెడ‌తాయ‌న్న మాట‌. స‌ద‌రు యాప్‌లేమిటంటే...
NOTIFICATION SAVER
ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ హిస్ట‌రీని ఎక్సెల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే అత్యుత్త‌మ ఉచిత ఆండ్రాయిడ్ యాప్‌ల‌లో ‘‘నోటిఫికేషన్ సేవర్’’ ఒకటి. నోటిఫికేష‌న్ బార్‌లో క‌నిపించే ప్ర‌తి నోటిఫికేష‌న్‌నూ ఇది లాగ్ చేసి, మ‌న‌కు చూపుతుంది. అలా సేవ్ చేసే నోటిఫికేష‌న్ల సంఖ్య‌కు మీరు ఒక ప‌రిమితిని కూడా ఈ యాప్‌కు నిర్దేశించ‌వ‌చ్చు. యాప్ ఇంట‌ర్ఫేస్‌లో ఏదైనా యాప్ పేరు లేదా టెక్స్ట్  టైటిల్ ఆధారంగా దానికి సంబంధించిన నోటిఫికేష‌న్ల‌ను సెర్చ్ చేసుకునే సౌక‌ర్యం కూడా ఉంది. అంతేకాకుండా నోటిఫికేష‌న్ల‌ను ఫిల్‌‌ర్ చేసుకునేందుకు ఆప్ష‌న్లూ ఉన్నాయి. నోటిఫికేష‌న్ సేవ‌ర్ ఇంట‌ర్ఫేస్ ఎంత సులువుగా ఉంటుందంటే... అన్ని నోటిఫికేష‌న్ల‌నూ విశ్లేషించుకున్న త‌ర్వాత వాటిని మీరు CSVలోకి తేలిగ్గా ఎక్స్‌పోర్ట్ చేసుకోవ‌చ్చు. సంబంధిత యాప్ స‌మాచారం, ప్యాకేజి,  టైమ్‌,  నోటిఫికేష‌న్ టైటిల్‌, నోటిఫికేష‌న్ టెక్స్ట్ ల‌ను ఈ CSV ఫైల్‌లో నిల్వ‌చేస్తుంది.
మీరేం చేయాలంటే...
గూగుల్ ప్లేస్టోర్ లేదా ఇత‌ర సోర్స్ నుంచి ‘‘నోటిఫికేష‌న్ సేవ‌ర్’’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. అటుపైన నోటిఫికేష‌న్ల‌ను యాక్సెస్ చేసేందుకు దానికి అనుమ‌తి ఇవ్వండి. ఆ త‌ర్వాత అది బ్యాక్‌గ్రౌండ్‌లో ర‌న్ అయ్యేందుకు అనుమ‌తించి, కొత్త నోటిఫికేష‌న్ల‌ను మీరు చూసుకోవ‌చ్చు. అయితే, ఇన్‌స్టాల్ చేయ‌క‌ముందు మీ ఫోన్‌లో ఉన్న నోటిఫికేష‌న్ల‌ను ఈ యాప్ చూపించ‌ద‌ని గుర్తుంచుకోండి. ఇన్‌స్టాల్ అయిన త‌ర్వాత‌నుంచి అన్ని యాప్‌ల నోటిఫికేష‌న్ల‌ను అది లాగ్ చేసుకుంటూ పోతుంది. వాటిని మీరు చూసుకోవ‌చ్చు... వీటిని  CSVకి ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అందులోని “Export to CSV”  ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే స‌రి! ఆ త‌ర్వాత మీరు ఆ CSV ఫైల్‌ను ఎవ‌రితోనైనా షేర్ చేసుకోవ‌చ్చు.
NOTIFICATION LOG
ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ల‌ను ఎక్స్‌పోర్ట్ చేయ‌గ‌ల మ‌రొక ఉచిత యాప్ ‘‘నోటిఫికేషన్ లాగ్.’’ అయితే, ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని యాప్స్ నుంచి వ‌చ్చే నోటిఫికేష‌న్ల టెస్టింగ్ నిమిత్తం డెవ‌ల‌ప‌ర్ల కోసం ఉద్దేశించిన యాప్ ఇది. కాబ‌ట్టి  నోటిఫికేష‌న్ లాగ్‌ను JSON (JavaScript Object Notation) ఫార్మాట్‌లో ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఈ JSON  ఫైల్‌ను మీరు మెయిల్‌లో పంపించ‌వ‌చ్చు. అలాగే ఎక్సెల్‌లో ఓపెన్ చేసుకోవడం కోసం JSON డేటాను CSVగా మార్చేందుకు అద‌న‌పు టూల్‌ను వాడాల్సి ఉంటుంది. అంటే... మొద‌ట మీరు అన్ని నోటిఫికేష‌న్‌లతో కూడిన లాగ్‌ను JSON  ఫైల్‌గా చేసుకుంటే, త‌ర్వాత దాన్ని సుల‌భంగా CSVలోకి మార్చుకుని చేయాల‌నుకున్న‌ది చేయొచ్చు.
మీరేం చేయాలంటే...
ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. అపైన యాక్సెస‌బిలిటీ సెక్ష‌న్‌లో ఫోన్ నోటిఫికేష‌న్ల‌ను యాక్సెస్ చేసేందుకు అనుమ‌తించండి. ఆ త‌ర్వాత మీ ఫోన్‌కు వ‌చ్చే నోటిఫికేష‌న్ల‌ను అది లాగ్ చేస్తుంది. అప్పుడు మీరు వాటిని సుల‌భంగా ఫోన్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. మీరు “Export log” ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే,  షేర్ ఆప్ష‌న్ కూడా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఫైల్‌ను మెయిల్‌ద్వారా ఎవ‌రికైనా పంప‌వ‌చ్చు. ఇక “konklone.io”  అనే ఆన్‌లైన్ టూల్ సాయంతో JSONను చిటికెలో CSV  ఫైల్‌గా మార్చుకోవ‌చ్చు. ఇందుకోసం ఈ వెబ్‌సైట్ హోమ్ పేజీలోకి వెళ్లి,  JSON  ఫైల్ కంటెంట్స్‌ను పేస్ట్ చేయాలి. అందులో ఏవైనా హ్యాష్‌ట్యాగ్ ప‌దాలు ఉన్న‌ట్ల‌యితే వాటిని తొలగించాలి. ఆ త‌ర్వాత వెబ్‌సైట్‌లో క‌న్వ‌ర్ట్ అయిన డేటాను CSVగా డౌన్‌లోడ్ చేసుకుని ఎక్సెల్‌లో చూసుకోవ‌చ్చు.

Android  Notifications  Free apps