పీడీఎఫ్‌ను వ‌ర్డ్ ఫైల్‌గా క‌న్వ‌ర్ట్ చేయ‌డం ఎలా?

ఏదైనా ఫారం, రెజ్యూమె లేదా సీవీ పంపాలంటే PDF (Portable Document Format) ఫైల్స్ అనువుగా ఉంటాయి. అయితే, కొన్ని సంద‌ర్భాల్లో ముద్రిత డాక్యుమెంట్ నుంచి టెక్స్ట్‌ను వేరుచేసి తీసుకోవ‌డం దాదాపు అసాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. లేదా అందులో కొన్ని మార్పుచేర్పులు చేయాల‌న్నా క‌ష్ట‌మ‌వుతుంది. అటువంట‌ప్పుడు PDF ఫైల్ క‌న్వ‌ర్ట‌ర్ అందుబాటులో ఉంటే దాన్ని వ‌ర్డ్ ఫైల్‌గా మార్చుకుని మ‌న ప‌ని సుల‌భంగా పూర్తిచేసుకోవ‌చ్చు. ఆ విధంగా మీ PDF ఫైళ్ల‌ను వ‌ర్డ్ ఫైల్ రూపంలోకి మార్చుకునే ప్ర‌య‌త్నంలో మీరుంటే ఇదిగో ఈ కింది మార్గాలు మీకోస‌మే:-
అడోబ్ అక్రోబాట్‌తో మార్చుకోవ‌డం
పీడీఎఫ్ ఫైళ్ల‌ను వ‌ర్డ్ డాక్యుమెంట్‌గా మార్చుకోడానికి సుల‌భ‌మైన‌, అందుబాటు మార్గాల్లో ఒక‌టి Adobe Acrobat. అయితే, దీన్ని వాడుకోవాలంటే మీరు మీ అడోబ్ అకౌంట్‌లోకి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. కానీ, అడోబ్ అక్రోబాట్ క్లౌడ్ కింద ఒక వారంపాటు ‘ఉచిత ప్ర‌యోగాత్మ‌క’ వాడ‌కానికి మాత్ర‌మే కంపెనీ అనుమ‌తిస్తుంది. ఆ త‌ర్వాత కూడా దాన్ని వినియోగించుకోవాల‌ని మీరు భావిస్తే నెల‌కు రూ.1,014 వంతున రుసుముతో ఏడాదికి త‌గ్గ‌కుండా చందా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అడోబ్ అక్రోబాట్‌తో పీడీఎఫ్ ఫైల్‌ను వర్డ్ డాక్యుమెంట్‌గా మార్చుకోవ‌డం ఎలాగో చూద్దాం:
1. అడోబ్ అక్రోబాట్‌ద్వారా మీరు క‌న్వ‌ర్ట్ చేయాల‌నుకున్న PDF ఫైల్‌ను ఓపెన్ చేయండి.
2. అందులో కుడివైపు చ‌ట్రంలో మీకు “Export PDF” అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.
3. అలా పీడీఎఫ్ ఫైల్‌ను అప్‌లోడ్ చేశాక “Convert To” అనే ఆప్ష‌న్ దిగువ‌న క‌నిపిస్తుంది.
4. అప్పుడు మీరు Microsoft Wordను ఎంపిక చేస్తే దానికి ఫైల్ రూపం (*.docx), Microsoft Word (*doc)... ఇలా క‌నిపిస్తుంది.
5. అందులో మీకు కావాల్సిన వ‌ర్డ్ ఫార్మాట్‌ను సెలెక్ట్ చేశాక, ‘Convert’ బ‌టన్‌పై ప్రెస్ చేయాలి.
6. స్కాన్ చేసిన ఏ డాక్యుమెంట్‌లోనైనా టెక్స్ట్ రిక‌గ్నిష‌న్‌ను అడోబ్ ఆటోమేటిక్‌గా ర‌న్ చేస్తుంది.
7. ఆ మేర‌కు క‌న్వ‌ర్ట్ అయిన వ‌ర్డ్ ఫైల్‌కు మీరు పేరు ఇచ్చి, మీకు కావాల్సిన ఫోల్డ‌ర్ లేదా డెస్క్‌టాప్‌పై సేవ్ చేసుకోండి. 
మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్‌తో పీడీఎఫ్‌ను క‌న్వ‌ర్ట్ చేసుకోవడం
PDF ఫైల్‌ను వ‌ర్డ్ డాక్యుమెంట్‌గా మార్చుకునేందుకు మ‌రో సుల‌భ సాధ‌నం Microsoft Word. ఇందులో సులువుగానే కాకుండా వేగంగా క‌న్వ‌ర్ష‌న్ సాధ్య‌మ‌వుతుంది. మీరు చేయాల్సింద‌ల్లా....
1. ముందుగా మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్‌ను ఓపెన్ చేయండి. దానికి ఎడ‌మ‌వైపు ఎగువ‌న క‌నిపించే File ఆప్ష‌న్‌పై క్లిక్ చేయండి.
2. అప్పుడు క‌నిపించే మెనూలో Open ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
3. ఆ ట్యాబ్ ఓపెన్ అయ్యాక మీరు క‌న్వ‌ర్ట్ చేయాల‌నుకున్న‌ PDF ఫైల్‌ను లొకేట్ చేయండి.  అలా ఎంచుకున్న త‌ర్వాత సెలెక్ట్ చేసుకుని “Open”పై క్లిక్ చేయండి.
4. ఇది పూర్తికాగానే మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్ దాన్ని ఆటోమేటిక్‌గా కొత్త వ‌ర్డ్ డాక్యుమెంట్‌గా మార్చేస్తుంది.
అడోబ్‌, అక్రోబాట్‌, మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్ మాత్ర‌మే కాకుండా వెబ్ ఆధారిత క‌న్వ‌ర్ట‌ర్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ‘ఫ్రీమియమ్’ సేవ‌లందిస్తాయి. అంటే... వీటిని కొన్నాళ్లు ఉచితంగా వాడుకున్నాక శాశ్వ‌త వాడ‌కం కోసం మీరు చందా క‌ట్టాల్సి ఉంటుంద‌న్న మాట‌. ఒక‌వేళ మీకు పీడీఎఫ్ ఫైల్ క‌న్వ‌ర్ష‌న్ యాప్‌లు కావాలంటే... PDF Pro, Smallpdf, Foxit వంటివి ప‌రిమిత ఆప్ష‌న్ల‌తో మీకు ట్ర‌య‌ల్ వెర్ష‌న్లు ల‌భిస్తాయి.

Conversion  Pdf  Adobe  Microsoft