ఏసీలు డిఫాల్ట్‌గా 24 డిగ్రీలు ఉంచాల‌ని ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోందా?

ఏసీ వినియోగ‌దారుల‌కు షాకిచ్చే దిశ‌గా కేంద్ర‌ ఇంధ‌న శాఖ‌ నిర్ణ‌యం తీసుకోబోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వేస‌విలో ఎయిర్ కండీష‌న్స్ వ‌ల్ల విద్యుత్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోతున్న నేప‌థ్యంలో.. వీటి క‌ట్ట‌డికి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్రస్తుతం ఏసీల్లో క‌నీస ఉష్ణోగ్ర‌తను 24 డిగ్రీలు చేసే యోచ‌న‌లో ఉంది. దీని విద్యుత్ వినియోగం చాలా వ‌ర‌కూ త‌గ్గుతుంద‌ని కేంద్ర ఇంధ‌న శాఖ భావిస్తోంది. 

విద్యుత్ వినియోగంలో ఏసీలే టాప్‌
ఏటా వేస‌విలో ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. వీటిని త‌ట్టుకునేందుకు ఏసీల‌ను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య కూడా అధిక‌మ‌వుతోంది. వీటి వ‌ల్ల విద్యుత్ డిమాండ్ ఎక్కువ‌వుతోంది. ఇప్పుడు దేశం మొత్తంమీద ఉత్ప‌త్తి అయ్యే విద్యుత్‌లో ఈ ఏసీలే ఎక్కువ మొత్తాన్ని వినియోగించుకుంటున్నాయని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఏడాదికి ఏసీల‌కు 5.5 ల‌క్ష‌ల యూనిట్ల విద్యుత్‌ అవ‌స‌ర‌మ‌వ‌గా.. 2030 నాటికి ఇది 28.5ల‌క్ష‌ల యూనిట్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తం 1156 బిలియ‌న్ యూనిట్ల‌లో గృహస‌ముదాయాలు, క‌మ‌ర్షియ‌ల్ బిల్డింగులు 33.2 శాతం విద్యుత్‌ను వినియోగించుంటున్నాయి. ఇక కూల‌ర్లు, ఇత‌ర కూలింగ్ యంత్రాలకు ఏటా 80 గిగావాట్ల క‌నెక్ట‌డ్ లోడ్ ఏటా అవస‌ర‌మ‌వ‌గా.. ఇది 2030 నాటికి ఇది 140 గిగావాట్ల‌కు చేర‌నుంది. 

జ‌పాన్‌లో డిఫాల్ట్‌గా 28 డిగ్రీలు
ఈ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగాన్ని త‌గ్గించేందుకు ఏసీల‌ను డిఫాల్ట్‌గా 24 డిగ్రీల‌కు ప‌రిమితం చేయాల‌ని కేంద్ర ఇంధ‌న శాఖ యోచిస్తోంది. సుమారు 50 శాతం వినియోగ‌దారులు ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార‌తార‌ని అంచ‌నా వేస్తోంది. దీనివ‌ల్ల‌ 24 శాతం విద్యుత్ వినియోగం త‌గ్గుతుంద‌ని.. ఫ‌లితంగా 10 బిలియన్ యూనిట్లను ఆదా చేయ‌వ‌చ్చ‌ని భావిస్తోంది. ఇలా దేశం మొత్తం క‌లిపితే భారీగా విద్యుత్ ఆదా అవ‌డంతో పాటు గృహ, క‌మ‌ర్షియ‌ల్ వినియోగ‌దారులు, ప్ర‌భుత్వంపై ఆర్థిక భారాన్ని కూడా త‌గ్గిస్తుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఇది కేవ‌లం విద్యుత్ వినియోగాన్నేగాక ఏసీల నుంచి విడుద‌ల‌య్యే ప్ర‌మాద‌క‌ర‌ కర్భ‌న ఉద్ఘారాల‌ను కూడా గ‌ణ‌నీయంగా తగ్గిస్తుంది. ఫ‌లితంగా వాతావ‌ర‌ణంలోకి హానిక‌ర ర‌సాయ‌నాలు విడుద‌ల‌వ్వ‌వు. బ‌య‌టి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా, ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల బాధ్య‌త‌గా మెలిగేందుకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అధికారులు వివ‌రిస్తున్నారు. ఇంకో ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే.. జ‌పాన్‌లో ఏసీల డిఫాల్ట్ ఉష్ణోగ్ర‌త 28 డిగ్రీలు!! 

air conditioner restrict 24 degrees electricity consumption విద్యుత్ వినియోగం తగ్గించడం ఇంధన శాఖ ఉష్ణోగ్రత