దేశంలో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల రూపు మారిపోనుంది. ఈ మేరకు ‘‘నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్’’ (NFC) టెక్నాలజీ ఆధారంగా ఏ రాష్ట్రంలోనైనా చెల్లుబాటయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)తో కూడిన డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానం త్వరలోనే రానుంది. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి ఇదే అతి భారీ, ప్రభావవంతమైన మార్పు కానుంది. ఇది బహుశా 2019 జూలై నుంచి అమలులోకి రావచ్చు. మొత్తంమీద డ్రైవింగ్ లైసెన్స్‌లో రానున్న మార్పులేమిటో చూద్దామా:-
ఏకరూప డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ వాటికి ప్రత్యేక రూపం, విధానం, జారీ ప్రక్రియ అమలవుతున్నాయి. అయితే, బహుశా 2019 జూలై నుంచి దేశంలో ఎక్కడ జారీ అయినా ఇవి ఒకేవిధంగా ఉండబోతున్నాయి. అంటే... వాటి స్వరూపం, ప్రత్యేకతలు, సమాచారం, భద్రతాంశాలు ఒకేలా ఉంటాయన్న మాట. అంతేకాకుండా వీటికి కొత్తగా ‘క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్’ జోడించబడుతుంది. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు వాహనాల, చోదకుల వివరాలను తనిఖీ చేయాలంటే వారివద్ద QR కోడ్ స్కానర్ ఉంటుంది. ఈ కోడ్ విధానమే కాకుండా NFC మెకానిజమ్‌తో ఓ కొత్త మైక్రో చిప్ అమర్చబడుతుంది. వాహన చోదకుల వివరాల తనిఖీకి ఇది మరొక పద్ధతి. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులు తమవద్దగల పరికరాన్ని డ్రైవింగ్ లైసెన్స్ కార్డుపైకి తీసుకొస్తే అన్ని వివరాలూ అందులో సంపూర్ణంగా కనిపిస్తాయన్న మాట! దీనివల్ల అవినీతికి అడ్డుకట్ట పడటంతోపాటు వాహనదారుల సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అవయవదానం, దివ్యాంగ సన్నిహిత ప్రస్తావన
డ్రైవింగ్ లైసెన్స్‌లో ఇకపై ఒక ప్రత్యేక సెక్షన్... అందులో లైసెన్స్‌దారు అవయవ దానానికి అంగీకరించిందీ, లేనిదీ తెలిపే సమాచారం ఉంటుంది. దురదృష్టవశాత్తూ చోదకులు ప్రమాదానికి లోనై, జీవచ్ఛవ (బ్రెయిన్‌డెడ్) స్థితికి చేరినపుడు వారి అవయవాలను భద్రపరచి అత్యవసర మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రాణదానం చేసే వీలుంటుంది. అవయవదాన అంగీకార వివరాలతోపాటు దివ్యాంగుల ప్రత్యేక వాహనమైతే ఆ సమాచారం కూడా లైసెన్స్‌లో అంతర్గతంగా ఉంటుంది.
క్రమక్రమంగా అమలు
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి జారీ కొత్త విధానం అమలుకు గడువును 2019 జూలైగా నిర్దేశిస్తూ జనవరి నుంచే రాష్ట్రాల్లో క్రమక్రమంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ మేరకు మొదట పాత లైసెన్సులు, ఆర్‌సి సర్టిఫికెట్లను కొత్త రూపంలోకి మార్చడంతో కొత్త విధానానికి శ్రీకారం చుడతారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు నిత్యం 32,000 కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ లేదా నవీకరణ చేస్తున్నారు. దీంతోపాటు దాదాపు 45,000 రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్లతో DL, RC జారీకి రాష్ట్రాలు రూ.15 నుంచి 20దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని భోగట్టా!
RC  Driving licence  NFC