చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమీ తన సొంత MIUI సెక్యూరిటీ యాప్‌లో రెండు కొత్త ఫీచర్లు ‘‘Mi Protect, Mi Recycle’’లను జోడించినట్లు ప్రకటించింది. ఆ మేరకు అధికారిక షియోమీ పేజీలోని Mi ఫోరంలో వీటి గురించి వివరిస్తూ- ఒన్అసిస్ట్ ద్వారా Mi Protectను, క్యాషిఫై ద్వారా Mi Recycleను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండు ఫంక్షన్లు ఎలా పనిచేస్తాయో, వాటిద్వారా వినియోగదారులకు కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం:-
మొదటి ఫీచర్ Mi Protect
షియోమీ స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడే దాని భద్రత కోసం Mi Protectను కంపెనీ ఆఫర్ చేస్తుంది. అయితే, ఫోన్ రక్షణకు ప్రత్యేక స్కీమ్ పేరిట అదనపు మొత్తం వెచ్చించడానికి కొందరు ఇష్టపడరు. ఆ తర్వాత ఏదైనా అనుకోని సంఘటనలో ఫోన్ పాడైపోతే బాధపడటం తప్ప మరేమీ చేయలేం. కాబట్టి, షియోమీ తన కొత్త కొనుగోలుదారులకు అదనపు అవకాశం కల్పిస్తోంది. తదనుగుణంగా సెక్యూరిటీ యాప్‌లోనే Mi Protect కొనుగోలు ఫీచర్‌ను ఇమిడ్చింది. అయితే, ఫోన్ కొన్న 15 రోజుల్లోగా ఈ సదుపాయాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఫోన్ ప్రమాదవశాత్తూ పాడైనా లేక లిక్విడ్ డ్యామేజ్ వాటిల్లినా ఈ స్కీమ్ కింద ఉచితంగా రిపేరు చేయించుకోవచ్చు. ఇక Mi Protectను కొనుగోలు చేయాలంటే- మీ షియోమీ డివైజ్‌లోని MIUIసెక్యూరిటీ యాప్‌ను ఓపెన్‌చేసి, అందులోని ‘‘హార్డ్‌వేర్ టెస్ట్ మెనూ’’ను తెరిచి, Mi Protect మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించండి. చివరన పేమెంట్ ఆప్షన్‌ద్వారా డబ్బు చెల్లించగానే మీ ఫోన్‌కు Mi Protect రక్షణ ప్రారంభమవుతుంది.
రెండో ఫీచర్... Mi Recycle
కొత్త తరం స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పుడల్లా వాడకందారులు... ముఖ్యంగా యువతరం వాటిని సొంతం చేసుకోవాలని ఆరాటపడతారు. కానీ, చక్కగా పనిచేస్తున్న పాత ఫోన్‌ను గిట్టుబాటు ధరకు అమ్మేందుకు తంటాలు పడుతుంటారు. ఈ ఇబ్బందిని తప్పించడానికే Mi Recycleను షియోమీ రెండో కొత్త ఫీచర్‌గా సెక్యూరిటీ యాప్‌లో ప్రవేశపెట్టింది. ఫోన్‌లోని హార్డ్‌వేర్ నాణ్యత, ఫోన్ భౌతిక స్థితి, అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా పాత ఫోన్‌ను ఆన్‌లైన్‌లో ఎలాంటి జంఝాటం లేకుండా అమ్మేయడానికి ఈ కొత్త ఫీచర్ తోడ్పడుతుంది.
ఇందుకోసం చేయాల్సిందేమిటంటే...
మొదట ఫోన్‌లోని ‘‘హార్డ్‌వేర్ టెస్ట్ మెనూ’’లోకి వెళ్లి పరికరంలోని హార్డ్‌వేర్ టెస్ట్‌ను ఎంచుకోవాలి. అప్పుడు Mi Recycle పేజీ కనిపిస్తుంది. అందులో మీ నగరం పేరును ఎంపిక చేసుకుని, స్క్రీన్‌మీద కనిపించే సూచనల ప్రకారం అవసరమైన మేరకు హార్డ్‌వేర్ టెస్టులు కొనసాగించాలి. ఆ సమయంలో కొన్ని వివరాలను స్వయంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక మీ పాత ఫోన్ అంచనా ధర ప్రత్యక్షమవుతుంది. హార్డ్‌వేర్ టెస్ట్, ధర అంచనా దశల తర్వాత చెల్లింపు ప్రక్రియ మొదలవుతుంది. వినియోగదారులు ఆ మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాకు బదిలీద్వారా లేదా వోచర్ లేదా PayTMద్వారా పొందవచ్చు. ఇదంతా ముగిశాక ఫోన్‌ను తీసుకెళ్లే ప్రక్రియను కంపెనీ ప్రారంభించి, దాన్ని తీసుకెళ్లే తేదీ, సమయం నిర్ణయించి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని మీ వద్దకు పంపుతుంది. అయితే, ప్రస్తుతానికి కొన్ని నగరాల్లో మాత్రమే Mi Recycle ఫీచర్‌ను అమలు చేస్తున్నామని, త్వరలో మరిన్ని నగరాలకు విస్తరిస్తామని షియోమీ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ఫీచర్ ఇప్పుడు MIUI Beta ROM 8.9.13, ఆ తర్వాతి వెర్షన్లలో మాత్రమే పనిచేస్తుండగా త్వరలోనే MIUI Stable ROMలోనూ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
MIUI Security App MIUI Xiaomi