30 రోజులకు రీఛార్జ్ వాలిడిటీ ఉంచాలనే నిబంధనని టెలికాం కంపెనీలు కచ్చితంగా పాటిస్తాయా?

నెల‌కు 28 రోజుల వాలిడిటీ ప్లాన్లతో సాధార‌ణ ప్ర‌జల జేబుల‌కు చిల్లులు పెడుతున్నాయి టెలికాం సంస్థ‌లు. అంటే మొత్తం 12 నెల‌ల‌కు లెక్కేసుకుంటే.. ఒక నెల అద‌నంగా డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నాయి. ఇక నుంచి టెలికాం సంస్థ‌ల ఆట‌లు చెల్ల‌వని తేల్చేసింది భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI). టెలికాం కంపెనీలు (Jio, Airtel, Vi) 30 రోజుల వాలిడిటీ ప్లాన్లను అక్టోబర్ 22, 2026 నుంచి కచ్చితంగా అందించాల్సిందేన‌ని స్ప‌ష్టంచేసింది. అయితే ట్రాయ్ ఆదేశాన్ని టెలికాం సంస్థ‌లు పాటిస్తాయా? లేక ఇందులో మెలికపెట్టి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాయా? అనే సందేహాలు లేకపోలేదు. ఒక‌వేళ‌ ఈ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే ఏం జ‌రుగుతుంది? పాటిస్తే వినియోగ‌దారుల‌కు ఎలా ఉప‌యోగం అనే అంశాలు తెలుసుకుందాం!

ఎందుకు ఈ నిబంధన?
ప్రస్తుతం ఎలా:
టెలికం కంపెనీలు ప్ర‌స్తుతం 28 రోజుల ప్లాన్లు ఇస్తున్నాయి. దీని వ‌ల్ల ఏడాదికి (365 రోజులకు) కస్టమర్లు 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది (28 రోజులు × 13 = 364 రోజులు).
భారం ఎంతంటే: మీరు నెలకు సగటున రూ. 300 ప్లాన్ వాడుతున్నారు అనుకుందాం. ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌నల‌ ప్ర‌కారం ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయడానికి రూ. 3,900 ఖర్చు అవుతుంది.
కాంబో ప్లాన్ల‌తో చిల్లు: ప్రస్తుతం ఇంట‌ర్నెట్‌ అవసరం లేకపోయినా ఖరీదైన కాంబో ప్లాన్లను (డేటా + కాల్స్) తీసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల డేటా వాడని సాధారణ ప్రజలు, సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇబ్బంది ప‌డుతున్నారు.

ఇప్పుడు వ‌చ్చే మార్పులేంటి?
కనీసం ఒక ప్లాన్ 30 రోజులు:
మార్కెట్లో ఉన్న 28 రోజుల ప్లాన్లన్నీ రద్దయిపోవు. కానీ, ప్రతి కంపెనీ తమ టారిఫ్ లిస్ట్‌లో కనీసం ఒక ప్లాన్ వోచర్, ఒక స్పెషల్ టారిఫ్ వోచర్ మరియు ఒక కాంబో వోచర్‌ను పూర్తి 30 రోజుల వాలిడిటీతో కస్టమర్లకు అందించాలి.
ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్: కంపెనీలు ప్రతి నెలా ఒకే తేదీన రెన్యూవల్ అయ్యే ఒక ప్రత్యేక ప్లాన్‌ను తీసుకురావాలి. దీనివల్ల కస్టమర్లు ఫిక్స్‌డ్‌గా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిబ్రవరి వంటి చిన్న నెలల్లో ఆ తేదీ లేకపోతే, ఆ నెల చివరి రోజున ప్లాన్ ముగుస్తుంది.
వాయిస్ + ఎస్ఎమ్‌ఎస్ ప్లాన్లు తప్పనిసరి: ఇంటర్నెట్ (డేటా) అవసరం లేని సాధారణ వినియోగదారులు, సీనియర్ సిటిజన్ల కోసం కేవలం వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎమ్‌ఎస్ (Voice-and-SMS-only) మాత్రమే ఉండే తక్కువ ధర ప్లాన్లను 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వాలిడిటీతో కంపెనీలు కచ్చితంగా ప్రవేశపెట్టాలి.
సవరించిన ధరల ప్రయోజనం: కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు డేటా తీసేసి కేవలం కాల్స్ + ఎస్ఎమ్‌ఎస్ ఇచ్చే ప్లాన్ల ధరలను కచ్చితంగా తగ్గించాలి. ఈ ప్లాన్ ధర రూ. 99 లేదా రూ.120 కి తగ్గితే, ప్రతి నెలా సుమారు రూ. 80 నుండి రూ. 100 వరకు ఆదా అవుతుంది. అంటే ఏడాదికి రూ. 960 నుండి రూ. 1,200 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఎవ‌రికి ఉప‌యోగం
- ఇంట్లో వై-ఫై (Wi-Fi) ఉండి, మొబైల్ డేటా అస్సలు వాడని వారు.
- కీప్యాడ్ ఫోన్లు (Feature Phones) వాడే సాధారణ ప్రజలు మరియు సీనియర్ సిటిజన్లు.
- సెకండరీ సిమ్ (రెండు సిమ్‌లు ఉండి ఒకదానిని కేవలం ఇన్‌కమింగ్ కోసం ఉంచే వారు) వాడుతున్న వారు.

ఎవ‌రికి ఎంత ఆదా అవ్వొచ్చు (సుమారుగా)
యూజ‌ర్లు:
స్మార్ట్‌ఫోన్ వాడే వాళ్లు.. అంటే డేటా మ‌రియు కాల్స్ రెండింటిని వాడేవాళ్లు.
ప్ర‌స్తుతం: వీరు నెల‌కు రూ. 300 రీచార్చి చొప్పున ఏడాదికి 13 సార్లు రీచార్జికి ఖ‌ర్చు రూ. 3,900 (300* 13) చేస్తారు.
కొత్త ప్లాన్‌తో లాభం: కొత్త‌ నిబంధ‌న ప్ర‌కారం రూ. 3,600 (300 * 12) మాత్ర‌మే అవుతుంది. అంటే పొదుపు రూ. 300

యూజ‌ర్లు: మొబైల్ డేటా అవసరం లేని సాధారణ కస్టమర్లు మ‌రియు వృద్ధులు
ప్ర‌స్తుతం:  ప్రస్తుతం కేవలం కాల్స్ కోసమే కనీసం రూ. 179 లేదా రూ. 199 వంటి కాంబో ప్లాన్లను బలవంతంగా కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం వీరికి ఏడాదికి 13 సార్లు రీచార్జికి వీరికి అయ్యే ఖ‌ర్చు సుమారు రూ. 2,600.
కొత్త ప్లాన్‌తో లాభం: కొత్త రీఛార్జి విలువ సుమారు రూ.120 అనుకున్నా.. సుమారు రూ. 1,440 (120 *12) అవుతుంది. అంటే రూ. 1,160 వరకు ఆదా అవ్వొచ్చు.

యూజ‌ర్లు: సెకండరీ సిమ్ హోల్డర్స్ - అంటే సిమ్ యాక్టివ్‌గా ఉండేందుకు మాత్ర‌మే రీచార్జి చేసే వాళ్లు.
ప్ర‌స్తుతం: వీరికి క‌నీస కాంబో రీఛార్జ్‌లు అన్నీ క‌లిపి సుమారు ఏడాదికి రూ. 2,000 అవ్వొచ్చు.
కొత్త ప్లాన్‌తో లాభం: కొత్త నిబంధ‌న ప్ర‌కారం రూ. 1,000 లోపు (తక్కువ ధర వాయిస్ ప్లాన్లు) రావొచ్చు. అంటే క‌నీసం రూ. 1,000 వరకు ఆదా అవ్వొచ్చు.

కంపెనీలు ఏం చేయాలి?
గతంలో 2024లో ఇచ్చిన ఆదేశాల్లోని కొన్ని లోపాలను (Loops) వాడుకుని కంపెనీలు కొన్ని ప్లాన్లను తమ యాప్స్‌లో సరిగ్గా కనిపించకుండా దాచడం లేదా కేవలం ఖరీదైన ప్లాన్లకే పరిమితం చేయడం చేశాయి. కానీ ఈసారి 2026 నిబంధనల్లో ట్రాయ్ చాలా కఠినమైన రూల్స్ పెట్టింది.
తప్పనిసరి కేటగిరీలు: ప్రతి కంపెనీ తమ టారిఫ్ లిస్ట్‌లో కనీసం ఒక ప్లాన్ వోచర్, ఒక స్పెషల్ టారిఫ్ వోచర్ మరియు ఒక కాంబో వోచర్‌ను కచ్చితంగా పూర్తి 30 రోజుల వాలిడిటీతో ఉంచాలి.
ప్రదర్శన (Visibility): వినియోగదారులకు సులభంగా డిజిటల్ స్క్రీన్లపై (MyJio, Airtel Thanks యాప్స్ లేదా వెబ్‌సైట్లలో) కనిపించేలా వీటిని డిస్‌ప్లే చేయాలి.

పాటించకపోతే ఏమవుతుంది?
జియో, ఎయిర్‌టెల్, విఐ (Vi) వంటి ప్రైవేట్ కంపెనీలు తమ లాభాలు తగ్గుతాయనే నెపంతో ఈ నిబంధనలపై మొదట్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పుడు వాటికి వేరే దారి లేదు. ఇది ఒక ప్రభుత్వ అధికారిక గెజెట్ నోటిఫికేషన్ కాబట్టి కంపెనీలు దీనిని కచ్చితంగా అమలు చేయాల్సిందే.
భారీ జరిమానాలు: ఒకవేళ ఏ కంపెనీ అయినా ఈ 30 రోజుల ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచకపోయినా, లేదా తమ యాప్స్‌లో (MyJio, Airtel Thanks మొదలైనవి) కనిపించకుండా దాచాలని చూసినా ట్రాయ్ వారిపై భారీగా ఆర్థిక జరిమానాలు విధిస్తుంది. అవసరమైతే కోర్టుల ద్వారా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
లైసెన్స్ నిబంధనలు: పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తే కంపెనీల లైసెన్స్ నిబంధనలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం రెగ్యులేటరీ సంస్థకు ఉంటుంది.

అక్టోబర్ 22, 2026 నుండి వినియోగదారులకు రీఛార్జ్ ఎంపికల్లో పూర్తి స్వేచ్ఛ లభించడమే కాకుండా, ప్రతి నెలా రెండు రోజుల వ్యత్యాసంతో వచ్చే గందరగోళానికి తెరపడనుంది. టెలికాం కంపెనీలకు ఇష్టం ఉన్నా లేకపోయినా, చట్టప్రకారం 30 రోజుల ప్లాన్లు, తక్కువ ధర వాయిస్-ఓన్లీ ప్లాన్లను మార్కెట్లోకి కచ్చితంగా తీసుకురావాల్సిందే.

30 days recharge plan 28 days vs 30 days plan trai 30 day plan 30 days mobile plans 30 days validity prepaid plans 28 day recharge plan telecom companies trai telecom rules 2026 trai order to telecom operators telecom companies new rules trai order to telecom operators trai telecom rules