రైళ్లలో వైఫై మన ప్రయాణాన్ని ఎలా మార్చనుంది?

రైలు ప్ర‌యాణంలో మ‌రింత ఉల్లాసం, ఉత్సాహం, వినోదం నింప‌డానికి భార‌త రైల్వేలు సిద్ధ‌మ‌య్యాయి. దేశంలో దాదాపు అన్ని స్టేష‌న్ల‌కూ వైఫై స‌దుపాయం క‌ల్పించిన రైల్వేశాఖ ఇప్పుడు దాన్ని రైళ్ల‌కు విస్త‌రింప‌జేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో విసుగెత్తించే సుదీర్ఘ ప్ర‌యాణం ఇక‌పై  వినోద‌, ఉల్లాస‌భ‌రితం కానుంది.
రైళ్ల‌లో వైఫై అందుబాటు ఎలా?
‘‘ఆప‌రేష‌న్ స్వ‌ర్ణ్’’ పేరిట ప్రీమియం రైళ్లు ‘రాజ‌ధాని, శ‌తాబ్ది, దురంతో’ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్త సొబ‌గులు అద్దాల‌ని రైల్వే శాఖ నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ఢిల్లీ-కాఠ్‌గోడామ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో దీన్ని మ‌రిన్ని రైళ్ల‌కు విస్త‌రింప‌జేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. రైళ్ల‌లో వైఫై స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తే ప్రీ-లోడెడ్ కంటెంట్‌ను ప్ర‌యాణికులు త‌మ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్‌, లాప్‌టాప్‌ల‌ద్వారా ఆస్వాదిస్తూ ఉల్లాస‌భ‌రితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చు.
త్వ‌ర‌లోనే టెండ‌ర్ల‌కు ఆహ్వానం
ప్రీమియం రైళ్ల‌లో వైఫై హాట్‌స్పాట్ల ఏర్పాటుకు సాంకేతిక నైపుణ్యంగ‌ల కంపెనీల నుంచి రైల్వేశాఖ త్వ‌ర‌లోనే టెండ‌ర్ల‌ను ఆహ్వానించ‌నుంది. ఈ దిశ‌గా అన్ని జోన‌ల్ రైల్వేలు స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నాయ‌ని, ప్ర‌యాణికుల‌కుఈ ఏడాదిలోనే వైఫై స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తుంద‌ని సీనియ‌ర్ రైల్వే అధికారి ఒక‌రు చెప్పారు. వైఫై హాట్‌స్పాట్ల ద్వారా ప్ర‌యాణికులు మ్యూజిక్‌, సినిమాలు, గేమ్స్‌, వీడియోలు, సీరియ‌ళ్లతోపాటు వార్తా చాన‌ళ్ల‌ను కూడా అందుకునే వీలుంటుంద‌ని పేర్కొన్నారు. కానీ, ఇవి ఎలా ఉంటాయో/ఉండాలో ఇంకా నిర్ణ‌యించాల్సి ఉంద‌ని ఆయ‌న అంటున్నా... ప్రస్తుత వార్త‌ల ప్ర‌కారం.. దీనిపై జోన‌ల్ రైల్వేలే నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని భోగ‌ట్టా. 
ఈ సేవ‌లు ఉచిత‌మేనా?
వైఫై హాట్‌స్పాట్ సేవ‌లు ఉచిత‌మేనా అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అయితే, ‘‘ప్రయాణికుల నుంచి కొంత‌, కంటెంట్‌లో ప్ర‌క‌ట‌న‌ల‌ద్వారా కొంత’’ అనే హైబ్రిడ్ ప‌ద్ధ‌తిలో ఆదాయాన్ని ఆర్జించాల‌ని రైల్వే వాణిజ్య విభాగం యోచిస్తోంది. మొత్తంమీద అటు రైల్వేల‌కు, ఇటు ప్ర‌యాణికుల‌కు ఇది ఉభ‌య‌తార‌కంగా ఉండాల‌ని అధికారులు ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం.
హెడ్‌ఫోన్లు, LCD స్క్రీన్లు ఉండ‌వు!
రైళ్ల‌లో వైఫై స‌దుపాయం వ‌చ్చినా హెడ్‌ఫోన్లు, ఎల్‌సీడీ స్క్రీన్లు ఉండ‌వ‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. నిరుడు అత్యంత విలాస‌వంత‌మైన ‘‘తేజ‌స్ ఎక్స్‌ప్రెస్‌’’ను ప్రారంభించిన సంద‌ర్భంగా అందులో LCD స్క్రీన్లు, హెడ్‌ఫోన్ల స‌దుపాయం క‌ల్పించారు. కానీ, కొన్ని వారాల్లోనే వాటిని కొంద‌రు ప్ర‌యాణికులు మాయం చేయ‌డంతో అధికారులు కంగుతిన్నారు. అందువ‌ల్ల‌... ఈసారి వైఫై హ‌బ్‌స్పాట్ల‌తో మాత్ర‌మే అందుకోగ‌ల‌  ప్రీ-లోడెడ్ కంటెంట్‌ను మాత్ర‌మే పోర్ట‌ల్‌ద్వారా అందించాల‌ని నిర్ణ‌యించారు.

Wifi Train Railways