వేల కోట్ల పెట్టుబడితో ఫేస్‌బుక్ లిబ్రా క్రిప్టోకరెన్సీ, ఎలా పనిచేస్తుంది ?

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానం బిట్ కాయిన్ కరెన్సీ లిబ్రాను ప్రభుత్వాలు, ఆర్ధిక దిగ్గజాల ఆమోదంతో మార్కెట్లోకి తీసుకొస్తోంది.ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని 2020లో అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ప్రపంచ అతిపెద్ద కార్పొరేట్ సంస్థలైన వీసా ఇంక్, మాస్టర్ కార్డ్ ఇంక్, పేపాల్ హోల్డింగ్స్ ఇంక్, ఉబర్ టెక్నాలజీస్ భాగస్వామలుగా ఉండనున్నాయి.

ఫేస్ బుక్ బిట్ కాయిన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో ఒక్కో సంస్థ 10 మిలియన్ల డాలర్లు (రూ.70 కోట్లు వరకు) పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నుంచి మొత్తంగా 1 బిలియన్ విలువైన నిధులు అందుతాయని ఫేస్ బుక్ విశ్వసిస్తోంది. కొత్త క్రిప్టోకరెన్సీ రూపకల్పన కోసం లిబ్రా పేరిట ప్రత్యేక కన్సార్షియాన్ని ఏర్పాటు చేసింది.

చైనాలో వుయ్‌చాట్ మాదిరిగా ఫేస్‌బుక్ తన క్రిప్టోకరెన్సీని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు చాటింగ్‌తో పాటు షాపింగ్ చేసేందుకు, గేమ్స్ ఆడుకునేందుకు వియ్‌చాట్ అవకాశం కల్పిస్తోంది. ఒకే పోర్టల్లో ఈ తరహా సేవలన్నీ అందించడం, వినియోగదారులు దీన్ని వదలకుండా చూసుకుంటుండడంతో వియ్‌చాట్‌కు మరింత ఆదాయం లభిస్తోంది. దీంతో చైనాలో నిషేధం ఎదుర్కొంటున్న అమెరికా కంపెనీ ఫేస్‌బుక్ సైతం ఇదే తరహా సేవలతో ఆదాయం ఆర్జించేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

ఫేస్ బుక్ కంపెనీకి గ్లోబల్ గా 2.5 బిలియన్లు (250 కోట్లు) యూజర్లు ఉన్నారు. రెగ్యులేటరీ ఇష్యులను నేవిగేట్ చేయడంలో గొప్ప అనుభవంతో పాటు వార్షిక ఆదాయంలో 40 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువగానే వస్తోంది. అందుకే స్థిరమైన కాయిన్ కరెన్సీని స్థిరంగా ఉంచేందుకు ఇదొక సువర్ణావకాశంగా కంపెనీ భావిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టును లాంచ్ చేయబోతున్న మొదటి అతిపెద్ద టెక్నాలజీ కంపెనీగా ఫేస్ బుక్ నిలవనుంది.

లిబ్రా క్రిప్టోకరెన్సీ ఎలా పనిచేస్తుంది?
లిబ్రా బ్లాక్ చెయిన్' ఆధారంగా లిబ్రా పని చేస్తుంది. ఇందులో కరెన్సీ యూనిట్ ని 'లిబ్రా' అని పిలుస్తారు. ఈ క్రిప్టోకరెన్సీ 'ఆస్తుల నిల్వకు అంతర్గత విలువ ఇచ్చే విధంగా' పని చేస్తుంది. ఈ కరెన్సీ లిబ్రా అసోసియేషన్ నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అనేక ఇతర క్రిప్టోకరెన్సీల మాదిరిగా కాకుండా లిబ్రా నిజమైన ఆస్తుల నిల్వ ఆధారంగా ఉంటుందని ఫేస్ బుక్ తెలిపింది. ఈ లిబ్రా విలువ ఇతర కరెన్సీలు, క్రిప్టోకరెన్సీల మాదిరిగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోను కాకుండా అన్నివేళలా ఇంచుమించు అంతే విలువతో ఉండనుంది.

తమ కొత్త డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా యూజర్ల డబ్బు, సమాచారం భద్రంగా ఉండే విధంగా బలమైన రక్షణతో వస్తున్నట్టు ఫేస్ బుక్ హామీ ఇచ్చింది. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఉపయోగించే యూజర్ వెరిఫికేషన్, ఇతర చర్యలను ఈ వ్యాలెట్ వినియోగించనుంది. యూజర్లు పాస్ వర్డ్ లు తిరిగి పొందేందుకు, ఫోన్ పోగొట్టుకున్న సందర్భాలలో సహాయపడేందుకు ప్రత్యేకమైన సపోర్ట్ ఉండనుంది. యూజర్ల ఖాతాల్లోకి ఎవరైనా తప్పుదోవలో ప్రవేశిస్తే వారికి కలిగిన నష్టం మొత్తాన్ని తిరిగి ఇస్తామని ఫేస్ బుక్ వాగ్దానం చేస్తోంది. యూజర్ల అనుమతి లేకుండా ఖాతా సమాచారం, ఆర్థిక వివరాలను థర్డ్ పార్టీ సహా ఎవరికీ ఇవ్వబోమని ఫేస్ బుక్ స్పష్టం చేసింది.

సంక్లిష్టమైన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత వర్చువల్ కరెన్సీలతో (బిట్‌కాయిన్ మొదలైనవి) సామాన్య ప్రజానీకం భారీగా నష్టపోయే ప్రమాదముందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు దీన్ని నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఫేస్‌బుక్ లిబ్రా క్రిప్టోకరెన్సీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో ముందు ముందు చూడాలి. 

న్యూస్ టెక్నాలజీ సోషల్ మీడియా ఉబర్ పేపాల్ వీసా బిట్ కాయిన్ కరెన్సీ ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా