బారసాల, పుట్టినరోజు, నిశ్చితార్థం, పెళ్లి... సందర్భం ఏదైనా ఆహ్వాన పత్రిక తప్పనిసరి. ప్రపంచంలో ఇప్పటికీ ఇలా ఆహ్వాన పత్రికలు పంచడం ఆనవాయితీ అయినా, చాలామంది ఇప్పుడు డిజిటల్ ఆహ్వానాలు పంపడం ప్రారంభించారు. వీటిని తయారు చేయడం, పంచడం సులభమేగాక ఈ ప్రక్రియ పర్యావరణ హితమైనది కూడా కావడం గమనార్హం. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇలాంటి ఆహ్వాన పత్రికలను సృష్టించగలదు. కాబట్టి మీరు కంప్యూటర్‌ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇందుకోసం చాలా ఉచిత యాప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అటువంటివాటిలో ఓ ఐదు ముఖ్యమైనవాటి గురించి తెలుసుకుందామా!
1. CANVA: POSTER, BANNER, CARD MAKER & GRAPHIC DESIGN
సామాజిక మాధ్యమ గ్రాఫిక్స్ తయారీలో పేరున్న ఈ యాప్‌ను పెళ్లిపత్రికల సృష్టికీ వాడుకోవచ్చు. దీంతోపాటు వివిధ ఇతర సందర్భాలకు అనువైన ఆహ్వానాల రూపకల్పనకూ ఇది సూచనలివ్వగలదు. పైగా అన్ని అంశాలనూ ఇందులో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఒక నిర్దిష్ట డిజైన్‌ను ఎంచుకున్నాక దాన్ని సందర్భానికి తగినట్లు అన్నివిధాలుగా మార్చుకోవచ్చు. అంతేకాదు.. కొత్త అంశాలను కూడా జోడించుకోవచ్చు. అదే సమయంలో దీనికి అదనపు పేజీలను జోడిస్తూ ఒకేసారి బహుళ ఇమేజ్‌లను సృష్టించుకోవచ్చు. ఇందులో మీ ఖాతా ప్రారంభించాల్సి ఉంటుందిగనుక మీరు సృష్టించుకున్నవన్నీ ఇందులో భద్రంగా ఉండటమేగాక ఇతర వేదికలపైనా వీటిని యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్ సైజ్: 30MB; అనుకూలతలు: యూజర్ ఫ్రెండ్లీ, సేవ్ చేసుకున్న కార్డులనూ ఎడిట్ చేసుకునే వీలు; ప్రతికూలతలు: పెళ్లి పత్రికలకు ప్రత్యేక సెక్షన్ లేదు. ఇందులో లాగిన్ కావడం తప్పనిసరి.
2. INVITATION MAKER BY GREETINGS ISLAND
ఇన్విటేషన్ మేకర్ ఒక చక్కని యూజర్ ఇంటర్ఫేస్‌గల సరళమైన యాప్. వివాహ ఆహ్వానాలు మాత్రమే కాకుండా ఇతరత్రా సందర్భాలకూ తగిన కార్డ్స్ కూడా సృష్టించుకోవచ్చు. ఇందులో సిద్ధంగా ఉన్న టెక్స్ట్‌ను మీకు కావాల్సినట్లు మార్చుకోవచ్చు. అలాగే కొత్త టెక్స్ట్, కార్డుకు అలంకరణ స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది అనేక థీమ్‌లను అందిస్తుంది గనుక ఇందులో సెర్చ్ ఫీచర్‌ను కూడా వాడుకోవచ్చు. అయితే, మీ సొంత ఇమేజ్‌లను వాడుకునే వీల్లేకపోవడం దీనిలో ఒక చిన్న లోపం. ఈ యాప్ సైజ్: 19MB; అనుకూలతలు: యూజర్ ఫ్రెండ్లీ, ఎన్నెన్నో థీమ్‌ల అందుబాటు; ప్రతికూలతలు: కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా పనిచేయడం.
3. WEDDING & BIRTHDAY INVITATIONS BY DESYGNER
కణ్వ యాప్‌కు డిజైనర్ ఒక గట్టి పోటీదారు... ఈ యాప్ పరిధిలో ఇంకా కొన్ని చక్కని యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎడిట్‌చేసుకోగల టెక్స్ట్ సహా ముందుగానే డిజైన్ చేసిన టెంప్లేట్స్ ఉంటాయి. నేపథ్య మార్పిడి వెసులుబాటుతోపాటు డూప్లికేట్, లేయర్స్, ఒపేసిటీ వంటి చిన్నచిన్న అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ఒక ప్రాజక్టు సృష్టించుకుంటే అది “My Projects”లో సేవ్ అయి ఉంటుంది. మీరు ఏ సమయంలోనైనా దాన్ని ఎడిట్ చేసి వాడుకోవచ్చు. ఈ యాప్ సైజ్: 25MB; అనుకూలతలు: ప్రీ డిజైన్డ్ టెంప్లేట్స్, లేయర్స్, పేజెస్; ప్రతికూలతలు: అకౌంట్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి.
4. INVITATIONS CARD MAKER (GIF/VIDEO)
ఈ యాప్‌లో సాధారణ ఇన్విటేషన్ ఇమేజ్‌ల సృష్టితోపాటు వాటిని GIF లేదా Video ఆహ్వానాలుగా మార్చుకోగల వెసులుబాటు ఉంది. ఒక థీమ్‌ను ఎంచుకున్న తర్వాత మీరు కోరుకున్న టెక్స్ట్‌ను జోడించి తగువిధంగా మార్పుచేర్పులు కూడా చేసుకోవచ్చు. కానీ, ఇందులో థీమ్‌ల సంఖ్య పరిమితం. అలాగే GIF/Videoలు సృష్టించుకున్నా ఉచిత యాప్ కాబట్టి నాణ్యత తగ్గుతుంది. మీకు HD Video కావాలంటే ప్రీమియం ప్యాకేజ్ కింద కొనుగోలు చేయాల్సిందే! ఈ యాప్ సైజ్: 24MB; అనుకూలతలు: యూజర్ ఫ్రెండ్లీ, వీడియో, జిఫ్ ఆహ్వానాల తయారీ వీలు; ప్రతికూలతలు: పరిమిత థీమ్‌లు.
5. WEDDING CARD MAKER
యూజర్ ఇంటర్ఫేస్ గొప్పగా ఏమీ ఉండదు... దీనిగురించి మీరు పట్టించుకోనట్లయితే వెడ్డింగ్ కార్డ్ మేకర్ యాప్ చక్కని అనుభవాన్ని మీకు అందుబాటులోకి తెస్తుంది. తొలి స్క్రీన్‌లోనే మీకు బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లను స్క్వేర్, వర్టికల్, హారిజాంటల్ రూపాల్లో చూపి, ఎంపికను సులభం చేస్తుంది. థీమ్‌లలో ఎలాంటి టెక్స్ట్ ఉండదు... మీరు అందులో చేర్చాల్సిన వివరాల కోసం ప్రత్యేక ట్యాబ్ ఉంటుంది. అందులో మీరు వధూవరుల పేర్లు, వేదిక, సమయం వంటివాటిని రాసుకోవచ్చు. ఇదంతా మీరు మాన్యువల్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. అటుపైన స్టిక్కర్లు, ఇమేజ్‌లను కూడా జోడించవచ్చు. ఇది భారతీయుల కోసం స్వదేశంలోనే రూపొందిన యాప్ కావడం విశేషం. మీ ఇంట్లో త్వరలోనే వివాహం జరిగే అవకాశాలుంటే ఈ యాప్‌ను మీరు భేషుగ్గా ప్రయత్నించవచ్చు. ఈ యాప్ సైజ్: 11MB; అనుకూలతలు: థీమ్స్ వర్గీకరణ; ప్రతికూలతలు: యాడ్స్
CREATE FROM YOUR OWN CARD
మీ దగ్గర ఇంతకుముందే ఒకటికన్నా ఎక్కువ పేజీలతో ముద్రించిన కార్డు ఉన్నట్లయితే అందులోని ప్రతి పేజీనీ ఫొటోతీసి, వాటన్నిటినీ గూగుల్ ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే ఏదైనా Image to PDF యాప్ సాయంతో PDFలోకి మార్చండి. ఇది సిద్ధమయ్యాక మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోవచ్చు.
CREATE AND SHARE
ఆహ్వానాలు అందుకోవాల్సిన వారు విదేశాల్లో ఉంటే వాటిని నేరుగా పంపడం కొన్నిసార్లు కష్టం కావచ్చు. అయితే, నేటి డిజిటల్ ప్రపంచంలో ఆ బాధ లేదు. కేవలం ఓ ఆహ్వానాన్ని మీ ఫోన్‌మీదనే... అదీ ఉచితంగా సృష్టించి వారికి నిక్షేపంగా పంపేయొచ్చు. మీరు తుది డిజైన్‌ను ఖరారు చేసుకునేదాకా డిజిటల్ వెర్షన్లను ఓ కాన్సెప్ట్ ఐడియాగా వాడుకోవచ్చు. మొత్తంమీద పైన పేర్కొన్న యాప్‌లు, ఇతర పద్ధతుల్లో తయారుచేసుకున్న ఆహ్వానాలను ఈ-మెయిల్ లేదా సామాజిక మాధ్యమ యాప్‌లు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర వేదికలపై పంచుకోవచ్చు.
Invitation  Apps  Create  Share