గైడ్ - ఫోన్లెందుకు వేడెక్కుతాయి... వాటికి ప‌రిష్కారాలేంటి?

కంప్యూట‌ర్ త‌ర‌హాలోనే మీ స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్న‌పుడు దాని ప్రాసెస‌ర్ కూడా వేడిని పుట్టిస్తుంది. ఫోన్‌తో పోలిస్తే కంప్యూట‌ర్‌ను చ‌ల్ల‌బ‌రిచేందుకు ఫ్యాన్ ఉంటుంది... ఇదే రెండింటికీ తేడా! ఫోన్‌లో ఫ్యాన్ సాధ్యం కాదుగ‌నుక ఓవ‌ర్‌హీట్ నుంచి ర‌క్ష‌ణ కోసం త‌యారీదారులు అందులో చిప్స్ ఉపయోగిస్తారు. అయితే,  ఫోన్‌తో మ‌నం కొన్ని అసాధార‌ణ ప‌నులు చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు బాగా వేడెక్కిపోతుంది. దీనివ‌ల్ల కొన్ని ప్ర‌మాదాలు కూడా ఉంటాయి. అలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డితే ఫోన్‌లో మ‌న‌కు హెచ్చ‌రిక కూడా క‌నిపిస్తుంది. ఫోన్‌లో కొన్ని ఫంక్ష‌న్ల‌ను డిజేబుల్ చేయ‌డంద్వారా ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ కొన్నిసార్లు ఈ చిట్కాతో స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌చ్చు.  అప్పుడు ఫోన్‌ను ఆఫ్ చేయ‌డ‌మే ఉత్త‌మం. అస‌లు ఈ స‌మ‌స్య‌కు దారితీసే కొన్ని కార‌ణాలు... ప‌రిష్కార‌మార్గాలేమిటో చూద్దాం:-
బ్యాట‌రీ పాడైపోవడం కావ‌చ్చు...
స్మార్ట్ ఫోన్ మ‌రీ వేడెక్కితే మొట్ట‌మొద‌ట మ‌నం చేయాల్సిన ప‌ని బ్యాట‌రీని బ‌య‌ట‌కు తీసి అది ‘ఉబ్బి’న‌ట్లు క‌నిపిస్తున్న‌దేమో చూడాలి. ఉబ్బిన‌ట్లుంటే స‌ద‌రు లిథియం బ్యాట‌రీ పాడైంద‌ని గ్ర‌హించాలి. అది మండిపోవ‌చ్చు లేదా పేలిపోయే ప్ర‌మాదం ఉంటుంది. కాబ‌ట్టి…  ‘వెంట‌నే ఫోన్ బ్యాట‌రీని మార్చుకోవాలి.’
లోప‌భూయిష్ట చార్జ‌ర్ కార‌ణ‌మేమో!
బ్యాట‌రీ గురించి సందేహం తీరిపోతే త‌ర్వాత ప‌రిశీలించాల్సింది చార్జ‌ర్‌నే! చార్జింగ్‌లో ఉన్న‌పుడు ఫోన్ వేడెక్కుతుంటే అది క‌చ్చితంగా చార్జ‌ర్‌ లోప‌మే. వెంట‌నే ఫోన్‌ను ప్ల‌గ్‌నుంచి తీసి చ‌ల్ల‌బ‌డిన త‌ర్వాత వేరొక చార్జ‌ర్‌తో చార్జ్ చేసి చూడాలి. అప్పుడూ ఫోన్ వేడెక్కితే ‘అధీకృత సేవా ప్ర‌దాత (ఆథ‌రైజ్డ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌)వ‌ద్ద‌కు వెళ్లాలి.’
ఎండలో ఉంచ‌డంవ‌ల్ల...
మీరు మీ ఫోన్‌ను ఎండ‌లో వ‌దిలేసినా వేడెక్కిపోతుంది. ఎండ తీవ్ర‌త అధికంగా ఉన్న‌పుడే ఇలా అవుతుంద‌ని భావించ‌కండి. ఫోన్ త‌యారీకి ఉప‌యోగించిన ముడిప‌దార్థాలు వేడిని త్వ‌ర‌గా పీల్చుకునే స్వ‌భావం క‌లిగి ఉంటాయి. కాబ‌ట్టి లేత ఎండ‌లో కూడా ఫోన్లు వేడెక్కిపోతాయ‌ని గ‌మ‌నించండి. ఇలాంటి ప‌రిస్థితి ఉంటే ఫోన్‌ను చ‌ల్ల‌గా ఉండేచోట‌ నీడ‌లో ఉంచి చ‌ల్ల‌బ‌ర‌చండి. మ‌రో మాట... ‘ఫోన్‌ను ఎండ‌లో ఉంచ‌డంవ‌ల్ల అది పాడ‌య్యే ప్ర‌మాదం కూడా ఉంటుంది.’
మీ టాస్క్‌ల‌కు ప్రాసెస‌ర్ స‌పోర్ట్ లేక‌పోవ‌చ్చు..
ఈ వ్యాసం మొద‌ట్లోనే చెప్పిన‌ట్లు సింపుల్ టాస్క్‌ల కోస‌మే మీ మొబైల్ తయారైంది. మీరు అందులో 3D వీడియో గేమ్స్ ఆడ‌టం లేదా ఎడిట్ చేయ‌డం వంటివి చేస్తే... ఓవ‌ర్‌హీట్ కావ‌డంతోపాటు ఫోన్ ఆగిపోవ‌డం స‌హ‌జం. ఇది ఫోన్‌కు క‌ష్ట‌మైన టాస్క్ కావ‌డం వ‌ల్ల సాధార‌ణంగానే బ్యాట‌రీ జీవిత‌కాలం త‌గ్గిపోతుంది లేదా ఫోన్ చ‌ల్ల‌బ‌డేదాకా మ‌ళ్లీ ప‌నిచేయ‌దు. ఇలాంట‌ప్పుడు ‘మ‌రింత సామ‌ర్థ్యంగ‌ల ఫోన్ కొన‌డం’ త‌ప్ప మీరు చేయ‌గ‌లిగిందేమీ ఉండ‌దు.
ఫోన్ అప్‌డేట్ అవడం కావ‌చ్చు...
మీరు ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ (OS)ను అప్‌డేట్ చేసిన‌పుడు కూడా అది వేడెక్క‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఆ స‌మ‌యంలో అది చాలా స‌మాచారాన్ని ప్రాసెస్ చేయాల్సి రావ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇలా OS అప్‌డేట్ చేసిన వారం త‌ర్వాత కూడా ఫోన్‌ వేడెక్కుతున్న‌ట్ల‌యితే ‘స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాలి.’ 
   స్మార్ట్ ఫోన్ వేడెక్కే అత్యధిక సందర్భాలివే... కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కదూ!

Overheat  Smartphone  Solutions