ఫేస్‌యాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ చదివారా, చదవకుంటే చాలా రిస్క్‌లో పడ్డట్లే 

ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేస్ యాప్ గురించే చర్చ. ఈ యాప్ సాయంతో వృద్ధాప్యంలో తమ ముఖం ఎలా ఉంటుందో చూసుకునే సౌకర్యం ఉండడంతో యువత ఈ యాప్ ని విపరీతంగా డౌన్లోడ్ చేసుకుంటోంది. ఏజ్ ఫిల్టర్‌ అంటూ ఓవర్ నైట్‌లో వైరల్‌ అయిపోయిన రష్యన్‌ ఫొటో ఎడిటింగ్ యాపే ఈ ఫేస్ యాప్.సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ యాప్‌ను వాడేస్తూ.. ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్‌ యాప్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్ ఏ వ్యక్తి ఫొటోనైనా సరే కృత్రిమ పద్ధతిలో వృద్ధుల ముఖంలా మారుస్తుంది. అయితే దీనితో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. 

ఫేస్‌యాప్ వాడే ప్రతి ఒక్కరూ ఆ యాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కు ఒప్పుకుని యాప్‌ను వాడాల్సి ఉంటుంది. అయితే ఆ నియమ నిబంధనల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేమిటంటే.. యూజర్లు ఈ యాప్‌లో స్టోర్ చేసే తమ సమాచారంతోపాటు ప్రాసెసింగ్ కోసం ఈ యాప్ సర్వర్లలోకి అప్‌లోడ్ చేసే ఫోటోలు, ఇతర డేటాను ఫేస్‌యాప్ కంపెనీ ఎలా కావాలంటే అలా వాడుకుంటుంది.

 అంటే.. మీరు ఉదాహరణకు ఇండియాలో ఈ యాప్‌ను వాడితే మీకు చెందిన ఫొటోలు, సమాచారాన్ని ఈ యాప్ వేరే ఇతర ఏ దేశంలోనైనా.. తమకు కావల్సినట్లు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. తమ యాప్ లేదా తమ కంపెనీకి చెందిన ఇతర ప్రొడక్ట్స్‌ను యూజర్ల డేటాతో పబ్లిసిటీ చేసుకోవచ్చు. లేదా ఆ డేటాను ఇతరులకు అమ్ముకోవచ్చు. అందుకు గాను మనం అనుమతిని తెలుపుతూ యాప్‌ను వాడేందుకు ముందుగానే టర్మ్స్ అండ్ కండిషన్స్‌కు అనుమతి తెలుపుతాం. టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు ఓకే చెప్పకుండా యాప్‌ను వాడుకోవడం కుదరదు.

తద్వారా మన ఫొటోలు, డేటాను మొత్తం పుణ్యానికి వాళ్లకు ఎలాగైనా వాడుకోవచ్చని చెప్పి మనమే అనుమతినిస్తున్నామన్నమాట. ఇది తెలియని చాలా మంది యాప్‌ను వాడుతూ తమ డేటా, ఫొటోలను ఈ యాప్ సర్వర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. అయితే యూజర్లు ఈ యాప్‌ను వాడేముందు ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించాలని పలువురు ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు..!అయితే యూజర్ల పర్సనల్ డేటాను దొంగిలించట్లేదని ఆ కంపెనీ చెబుతోంది.

ఇదిలా ఉంటే 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ యాప్ ఉపయోగించొద్దని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ తమ అభ్యర్థులకు హెచ్చరికలు జారీ చేసిందని చెబుతున్న సమయంలో షుమర్ దానిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ప్రైవసీ ఎంత ప్రమాదంలో పడింది అనేదానిపై అంత స్పష్టత లేదు, కానీ దీనిని ఉపయోగించకపోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని భద్రతాధికారి బాబ్ లార్డ్ అన్నారు. 

స్మార్ట్‌ఫోన్ ఫేస్‌యాప్ సోషల్ మీడియా యాప్స్ టర్మ్స్ అండ్ కండీషన్స్ ఫేస్ యాప్