వాట్సాప్ వీడియో, ఆడియో స్టేట‌స్‌ల‌ను ఉచితంగా క్రియేట్ చేసే యాప్‌- వాట్స్‌క‌ట్ ప్రో

మీరు సామాజిక మాధ్య‌మాల‌తో అధిక స‌మ‌యం గ‌డిపేవారైతే, త‌ర‌చూ ఫీడ్స్ కోసం అన్వేషించేవారైతే మీకు ‘స్టోరీస్’ లేదా ‘స్టేటస్’ గురించి తెలిసే ఉంటుంది. కొన్ని సామాజిక మాధ్య‌మ వేదిక‌లు వీటిని “Story” అంటే- మ‌రికొన్ని “Status”గా పిలుస్తాయి. అయితే, ఈ కాలంలో ఇవి ప్రాథ‌మికంగా ఒక్క‌టైపోయాయి. తొలుత stories అనే ప‌దాన్ని ‘Snapchat’ ప్ర‌వేశ‌పెడితే ఆ త‌ర్వాత కొన్ని మాధ్య‌మాలు... ప్ర‌త్యేకించి Facebook  దాని అనుబంధ సంస్థ‌లు దీన్ని అందిపుచ్చుకున్నాయి. ఇక Whatsapp కూడా టెక్స్ట్‌కు ప‌రిమిత‌మైన స్టేట‌స్ నుంచి విభిన్న‌మైన పేరుతో మ‌ల్టీమీడియా స్టేట‌స్‌వైపు మ‌ళ్లింది. ఈ నేప‌థ్యంలో సామాజిక మాధ్య‌మ వేదిక‌ల‌పై ఆడియో/వీడియో స్టేట‌స్‌ను రూపొందించుకునే ఉచిత ఆండ్రాయిడ్ యాప్ ‘‘Whatscut Pro’’ గురించి తెలుసుకుందాం:
  ఇదొక సింపుల్ యాప్‌... దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌నుంచి డౌన్‌లోడ్‌చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. దీని సాయంతో అనేక సామాజిక మాధ్య‌మాల్లో, ఇన్‌స్టాంట్ మెసేజింగ్ (IM) వేదిక‌ల‌లో ఆడియో/వీడియో స్టేట‌స్‌ను క్రియేట్ చేసి, షేర్ చేసుకోవ‌చ్చు. మీ ఫోన్ నుంచి మీడియాను ఈ యాప్‌లో యాడ్ చేసుకుని, ట్రిమ్ చేసి, ఆడియో లేదా వీడియోల‌ను త‌యారుచేయొచ్చు. వీటిని త‌క్ష‌ణం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకోనూవ‌చ్చు. ఇలాంటి స్టేట‌స్/స్టోరీస్‌కు చాలా మాధ్య‌మాల్లో కాల‌ప‌రిమితి ఉంటుంది. కాబ‌ట్టి ఈ యాప్ సాయంతో వీడియోను చిన్న ముక్క‌లుగా విడ‌దీసి పెట్టుకోవ‌చ్చు. మీ ఫోన్‌లోని ఆడియో లేదా వీడియోల‌ను Whatscut Pro లోడ్ చేసుకుని వాటి ప్ర‌త్యేక గ్యాల‌రీ సెక్ష‌న్ల‌లో చూపుతుంది. ఇందులోగ‌ల‌ వాయిస్ రికార్డ్ ఫీచ‌ర్‌తో మీరు ఆడియో స్టేట‌స్ రూపొందించి పోస్ట్ చేసుకోవ‌చ్చు.  
వీడియో స్టేట‌స్ త‌యారీ ఇలా!
వీడియో స్టేట‌స్ త‌యారీ కోసం స్టేట‌స్‌లో మీరు వాడ‌ద‌ల‌చిన వీడియోను ఎంపిక చేసుకోండి. అప్పుడు ఈ యాప్ ఎడిట్ స్క్రీన్‌ను ఓపెన్ చేస్తుంది. అక్క‌డ మీ వీడియోను మీరు స్టేట‌స్‌కు అనుగుణంగా ట్రిమ్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం స్క్రీన్ మీద క‌నిపించే Start, End యాంక‌ర్‌ను వీడియో టైమ్‌లైన్ మీద మీకు కావాల్సిన పొజిష‌న్‌లోకి లాగండి. అటుపైన స్క్రీన్ దిగువ‌న కుడిపైపు మూల‌లో క‌నిపించే ‘చెక్’ బటన్‌ను ట్యాప్ చేయండి. ఈ ప‌ని పూర్తికాగానే ఇన్‌స్టాంట్ షేర్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్క‌డినుంచి మీ వీడియో స్టేట‌స్‌ను Whatsapp, IMO, Instagram లేదా Messenger వంటి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసుకోగ‌లుగుతారు. అలాగే యూట్యూబ్‌స‌హా ఆయా వేదిక‌ల‌లో షేర్ చేసుకునే వీలుంది. Whatscut Pro యాప్‌తో త‌యారు చేసుకున్న మొత్తం వీడియోను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవ‌చ్చు లేదా 15, 30 సెక‌న్లు, 1 నిమిషం భాగాలుగా విడ‌గొట్ట‌నూ వ‌చ్చు. మీకు ఇంకా ఆప్షన్లు కావాలంటే స్లైడ‌ర్‌ను ఉప‌యోగిస్తూ ఒక‌టిన్న‌ర నిమిషం నుంచి 5 నిమిషాల క‌స్ట‌మ్ స్లైస్ లెంగ్త్‌ను సెట్ చేసుకోవ‌చ్చు.
ఆడియో స్టేట‌స్ త‌యారీ ఇలా!
ఈ యాప్ ఆడియో స్టేట‌స్‌ను వీడియోగా మార్చ‌గ‌ల‌దు. ఆ మేర‌కు దాన్ని సామాజిక మాధ్య‌మాల్లో సుల‌భంగా పోస్ట్ చేసుకోవ‌చ్చు. ఆడియో స్టేట‌స్ త‌యారీ కోసం మీ ఫోన్ నుంచి ఏదైనా ఆడియో ఫైల్‌ను తీసుకోవ‌చ్చు లేదా కొత్త ఆడియోను యాప్ సాయంతో రికార్డు చేయొచ్చు. మీరు ఎంచుకున్న ఆడియోను ట్యాప్ చేసి, స్టేట‌స్‌కు అనువుగా ఎడిట్ చేసుకోండి. ఆ మేర‌కు ఎడిట‌ర్‌లో ఆడియో టైమ్‌లైన్‌మీద స్లైడ‌ర్‌ను ఉప‌యోగించి ఆ ఫైల్‌ను ట్రిమ్ చేసుకోవచ్చు. ట్రిమ్ చేసే స‌మ‌యంలో దాన్ని ప్లే చేస్తూ ప‌ర్‌ఫెక్ష‌న్ సాధించుకోవ‌చ్చు. ఈ యాప్ ఆడియోను నిశ్చ‌ల బ్యాక్‌గ్రౌండ్‌గ‌ల వీడియోగా మార్చిన త‌ర్వాత మీ ఫోన్‌లోని ఫొటోల‌ను అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు. సంక్షిప్త వివ‌ర‌ణ‌తో ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై ఒక టైటిల్‌ను కూడా మీరు జోడించ‌వ‌చ్చు. ఇదంతా పూర్త‌య్యాక ఆడియో స్టేట‌స్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ బ‌ట‌న్‌ను ట్యాప్‌చేసి, సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసుకోవ‌చ్చు.

Whatscut Pro Android  Audio/Video