గూగుల్ అసిస్టెంట్, సిరి, బిక్స్‌బీ- ఇవి చేయ‌గ‌లిగేది కొండంత‌... మ‌నం వాడుతున్న‌ది గోరంత!

మ‌న జీవితంలో... ప‌నిపాట‌ల్లో మ‌రింత స‌హాయ‌కారులు కాగ‌ల మ‌న “ఇంటెలిజెంట్ అసిస్టెంట్ల” (IA)కు మ‌నం నేర్పాల్సింది ఇంకా చాలానే ఉంది. ఆధునిక జీవ‌న‌శైలి- అబ్బ‌బ్బో... ఈమెయిళ్లు, నోటిఫికేష‌న్లు, మెసేజ్‌లు, అల‌ర్ట్‌లు, గ‌ణాంకాలు వ‌గైరాల నిత్య స‌మాచార ప్ర‌వాహంతో పోటెత్తిపోతోంది. ప‌ర్య‌వసానంగా ఒత్తిడి కూడా పెరిగిపోతోంది. అనేకానేక యాప్స్‌లో, వివిధ ప‌రిక‌రాల పేజీల‌లో ఎన్నెన్నో నోటిఫికేష‌న్లు... ఎక్క‌డినుంచి మొద‌లుపెట్టాలి? మ‌న‌కు సాయం చేసేవారెవ‌రు? అదృష్ట‌వ‌శాత్తూ మ‌నంద‌రికీ ఇప్పుడు “వ్య‌క్తిగ‌త స‌హాయ‌కు” (PA)లు అందుబాటులో ఉన్నారు! కాక‌పోతే మ‌న డివైజ్‌లోని సాఫ్ట్‌వేర్‌ను బ‌ట్టి త‌లోర‌కం IA సేవ‌లందిస్తార‌న్న మాట‌. కంప్యూట‌ర్ లేదా ల్యాప్‌టాప్‌ల‌లో (మైక్రోసాఫ్ట్ Cortana), స్మార్ట్ ఫోన్ల‌లో (గూగుల్ Assistant లేదా యాపిల్ Siri లేదా శామ్‌సంగ్ Bixby), స్మార్ట్ స్పీక‌ర్ల‌లో (అమెజాన్ Alexa, బైడూ Little Fish) మ‌నకు సేవ‌లందించ‌గ‌ల అసిస్టెంట్ల‌ను మోసుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. ఇవాళ ప్ర‌పంచంలోగ‌ల దాదాపు 100 కోట్ల ప‌రిక‌రాల్లో ఒక‌టిక‌న్నా ఎక్కువ‌గానే IAలు మీ చేతికి అందుబాటులోనే ఉండి ఉండొచ్చు. కానీ, మ‌నం వాటి సేవ‌ల‌ను చాలా ప‌రిమితంగా మాత్ర‌మే వాడుకుంటున్నాం. వీటి వినియోగం అంచ‌నాల‌కు త‌గిన స్థాయిలో ఇంకా పుంజుకోలేదు. మ‌న IAల‌తో మ‌నం ఇప్‌ టికీ  కొద్ది నిమిషాలే గ‌డుపుతున్నాం. ఈ సాఫ్ట్‌వేర్ సృష్టి వెనుక ఉద్దేశం మ‌న స‌మ‌యాన్ని ఆదాచేసి, మ‌న ఉత్పాద‌క‌త‌ను పెంపొందించ‌డ‌మే... కానీ, ఈ దైనందిన వ్య‌వ‌హారాల్లో వీటి వాడ‌కం గురించి మ‌నం సీరియ‌స్‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో మ‌న IAలు మ‌న‌కోసం మ‌రింత‌గా ఎలా ప‌నిచేస్తాయో తెలిపే కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను ఇప్పుడు చూద్దాం:
మ‌న ఇంటెలిజెంట్ అసిస్టెంట్ల‌తో ఇంకా ఏమేం చేయొచ్చు?
మ‌న IAల సామ‌ర్థ్యంలో చాలా కొద్దిశాతాన్ని మాత్ర‌మే మ‌నం వాడుకుంటున్నాం. అయితే, అవి ఇంకా చాలా ప‌నులు చేయ‌గ‌ల‌వు... కాక‌పోతే వాటిగురించి తెలుసుకుని ప‌ని చేయించుకోవ‌డం మ‌న చేతిలోనే ఉంటుంది. అవేమిటంటే...
■  సెట్టింగ్స్ మార్చ‌డం: “Turn on airplane mode” లేదా “Find my phone” అని చెప్పొచ్చు.
■  రోజువారీ ప‌నుల ప్ర‌ణాళిక‌: “Remind me to send that invoice” లేదా “Set up a meeting at 9am” అని ఆజ్ఞాపించ‌వ‌చ్చు.
■  స‌మాచార అన్వేష‌ణ‌: “Who won the Word Cup?” లేదా “Translate me gustaría entender” అని సాయం కోర‌వ‌చ్చు.
■ ప‌నులు చేయించుకోవ‌చ్చు: “Make a dinner reservation at Woods Hill Table” లేదా “Reorder tortilla chips” అని ఆదేశించ‌వ‌చ్చు.
■ వినోదం కోర‌వ‌చ్చు: “Play OK Computer by Radiohead” లేదా “Show photos from yesterday” అని అడ‌గ‌వ‌చ్చు.
■ వ‌ర్త‌మానం పంప‌వ‌చ్చు: “Call Andrew” లేదా “Tell Susan I’ll be right there” అని సూచించ‌వ‌చ్చు...
ఇలా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి.. యాప్‌లు విప‌రీతంగా (62 ల‌క్ష‌ల యాప్స్‌) విస్త‌రిస్తున్న నేటి ప్ర‌పంచంలో అవి చేయ‌గ‌ల ప‌నుల‌న్నిటినీ IAలు చేయించ‌గ‌ల‌వు. మ‌న రిక్వెస్ట్‌ను స్వీక‌రించి, అది ఏ యాప్‌తో, ఎలా చేయించాలో కూడా IA నిర్ణ‌యించుకోగ‌ల‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఐఫోన్లో “Siri, launch Photos” అని మ‌నం వాయిస్ క‌మాండ్ ఇవ్వ‌గానే అది వెంట‌నే ఫోటోస్ యాప్‌ను త‌ట్టి లేపుతుంది. దీన్ని మ‌రింత క‌చ్చితంగా, లోతుగా తీసుకెళ్లాలంటే “Show photos from last May” అన‌గానే “ఫొటో” యాప్‌లో మ‌నం కోరిన కాలానికి సంబంధించిన‌వి వెతికి పెడుతుంది. అలాగే “Text Susan I’m running late” అని క‌మాండ్‌ ఇస్తే “మెసేజ్‌” యాప్‌ను తెరిచి, టెక్స్ట్ మెసేజ్ పంపుతుంది.
వినియోగం చాలా త‌క్కువ‌
ఇంటెలిజెంట్ అసిస్టెంట్‌ను మ‌నం చాలా త‌క్కువ‌గా వాడుకుంటున్నాం. దీనికి ఎన్ని ఉప‌యోగ‌క‌ర నైపుణ్యాలున్నాయో వాటిలో ఎన్నిటిని మ‌నం వాడుకోగ‌ల‌మ‌న్న‌దే దాని శ‌క్తిసామ‌ర్థ్యాల‌కు కొల‌బ‌ద్ద‌. ఈ దిశ‌గా మ‌న డివైజ్‌తోపాటు వ‌చ్చిన యాప్స్‌లోని పూర్తి ఫీచ‌ర్ల గురించి మ‌నం పూర్తిగా తెలుసుకోవాలి. అటుపైన IAతో ప‌నిచేయించ‌గ‌ల అద‌న‌పు యాప్స్‌ను చురుగ్గా, వ్యూహాత్మ‌కంగా ఎంపిక చేసుకోవాలి. త‌మ వ్య‌క్తిగ‌త గోప్య‌త‌, స‌మాచార భ‌ద్ర‌త‌పై కొంద‌రి ఆందోళ‌న IAని వాడుకోవ‌డంలో వారు వెనుకాడేలా చేస్తున్న‌ది. సౌక‌ర్యం, వ్య‌క్తిగ‌త గోప్య‌తల మ‌ధ్య ఆందోళ‌న‌ మ‌నంద‌రిలోనూ బాహాటంగానో, అంత‌ర్గ‌తంగానో ఉండ‌టం స‌హ‌జ‌మే. కానీ, IAలు మ‌న‌కోసం ఏమేం చేయ‌గ‌ల‌వో ముందుగా మ‌నం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. మ‌నకిష్ట‌మైన హార్డ్‌వేర్ (స్మార్ట్ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్ స్పీక‌ర్స్‌)ను యాప్‌ల సాయంతో మ‌రింత స‌మ‌ర్థంగా, మ‌న‌కు కావాల్సిన‌ప్పుడు... కావాల్సిన విధంగా ప‌నిచేయించడానికి IA తోడ్ప‌డుతుంది.  కాబ‌ట్టి IAల వాడ‌కంపై మ‌న దృక్ప‌థం యాప్‌ల స‌మ‌ర్థ వాడ‌కానికి సంబంధించిన‌దై ఉండాలి.
అసిస్టెంట్లు చాలా చేయ‌గ‌ల‌వు
నేటి ప్ర‌తిస్పంద‌నాత్మ‌క IAలు మ‌రింత చురుగ్గా ప‌నిచేయ‌గ‌ల‌వు. మీ డేటాను జోడించ‌డంద్వారా వివిధ వేదిక‌ల‌పై సూచ‌న‌లు ఇవ్వ‌గ‌ల‌వు. ఉదాహ‌ర‌ణ‌కు... మీ జీవిత భాగ‌స్వామి జ‌న్మ‌దినాన్ని (మీ కేలండ‌ర్ యాప్ నుంచి స్వీక‌రించి) క‌నుగొని, మీరు మ‌రో ప్ర‌దేశంలో ఉన్న‌ట్ల‌యితే వారికి కాల్‌చేసి శుభాకాంక్ష‌లు తెల‌పాల్సిందిగా సూచిస్తుంది. లేదంటే స‌మీపంలోని మంచి రెస్టారెంట్‌ను సూచించి, ఎలా వెళ్లాలో కూడా చెప్ప‌గ‌ల‌వు. అలాగే మీరు “Heading home” అని Siriకి చెబితే, మీ రాకను కుటుంబానికి తెల‌ప‌డంతోపాటు మీరు వెళ్లాల్సిన మార్గాన్ని కూడా సూచించ‌గ‌ల‌దు. ఈ వ్య‌వ‌హారాన్నంతా అది  Encrypted Traffic Analytics (ETA) ద్వారా సంక్షిప్తీక‌రిస్తుంది.
భౌతిక‌, మాన‌సిక‌, భావోద్వేగ శ్రేయ‌స్సుకూ దోహ‌దం
మ‌న శారీర‌క‌, మాన‌సిక‌, భావోద్వేగ శ్రేయ‌స్సుకూ IAలు దోహ‌దం చేయ‌గ‌ల‌వు. మ‌న గుండె స్పంద‌న వేగం, ఖ‌ర్చు చేసే ప‌ద్ధ‌తులు, సామాజిక మాధ్య‌మాలతోపాటు స్మార్ట్‌ఫోన్ల‌ వినియోగం, వాటిద్వారా మ‌నం చెప్పేదీ/రాసేదీ త‌దిత‌రాల స‌మ‌న్వ‌యం, స‌మ్మేళ‌నంతో మ‌న‌కు ప్ర‌యోజ‌న‌క‌ర స‌ల‌హాల‌ను సున్నితంగా సూచించ‌గ‌ల‌వు. మ‌నం ఎక్క‌డుంటే అక్క‌డ, మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు అభ్యాసం, స‌మాచారం, విజ్ఞానాల‌ దిశ‌గా స‌ముచిత సిఫార‌సుల‌తో వ్య‌క్తిగ‌త‌, సామూహిక మాన‌వ సామ‌ర్థ్యాల‌ను ఉన్న‌త‌స్థాయికి చేర్చ‌డంలో తోడ్ప‌డ‌గ‌ల‌వు.
“గూగుల్ డూప్లెక్స్”తో మ‌రింత ముంద‌డుగు
గూగుల్ అసిస్టెంట్ అత్యంత స‌హాయ‌కారిగా మారిన నేప‌థ్యంలో Google Duplex మ‌రింత ముంద‌డుగేసింది. దీనిపై గూగుల్ సీఈవో, ‘మ‌నవాడు’ సుంద‌ర్ పిచ‌య్ ఇచ్చిన డిమాన్‌స్ట్రేష‌న్‌ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. మ‌న‌కు త‌గిన రెస్టారెంట్‌తో కాల్ క‌ల‌ప‌డానికి IA స‌హాయ‌ప‌డితే “డూప్లెక్స్” ఏకంగా రెస్టారెంట్ సిబ్బందితో మాట్లాడి మ‌న‌కోసం టేబుల్ రిజ‌ర్వేష‌న్ కూడా చేసి పెట్టేస్తుంది. ఈ సంద‌ర్భంగా మ‌న‌మైతే సిబ్బందితో ఎలా మాట్లాడుతామో అలా సంభాషించి ప‌ని చ‌క్క‌బెడుతుందన్న మాట‌! అయితే, ఇక్క‌డే కొంద‌రికి అసౌక‌ర్యం అనిపిస్తోంది. ఇలాంట‌ప్పుడు సామ‌ర్థ్యం, నియంత్ర‌ణ‌ల మ‌ధ్య స‌మ‌తూకం ఎలా సాధ్య‌మ‌వుతుంద‌న్న‌ది వారి ప్ర‌శ్న‌. కానీ, కృత్రిమ మేధ‌స్సును సృష్టిస్తున్న క్ర‌మంలోనే దానికి పునఃస్వరూపం ఇవ్వ‌డం త‌ప్ప మ‌నం ప్ర‌త్యేకంగా చేయ‌గ‌లిగిందేమీ లేదు. మొత్తంమీద రాబోయే రోజుల్లో IAలు మాన‌వాళి వ్యావ‌హారిక శైలిని గ‌ణనీయంగా మార్చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు. కాబ‌ట్టి కాలంతో పోటీప‌డే ప్రొఫెష‌న‌ల్‌గా మీరు దీనిగురించి చ‌క్క‌గా తెలుసుకోండి... అర్థం చేసుకోండి... సృజ‌న‌కు ప‌దును పెట్టండి... IAతో మ‌మేకం కండి... దానితో ప్ర‌యోగాలు చేయండి. ఈ సంద‌ర్భంగా మీరు “చేసేది త‌క్కువ‌... పొందేది ఎక్కువ” అన్న విష‌యాన్ని మాత్రం మ‌రువ‌కండేం!

IAs  Cortana  Siri  Alexa  Bixby