‘‘మన దేశంలో పాత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ విస్తరిస్తుండగా- సగటు అమ్మకం ధర రూ.11 వేలదాకా పెరిగింది: OLX.’’ ఈ మాట నిజం... అత్యాధునిక స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలన్న భారతీయుల తపనే ఇందుకు కారణం. తదనుగుణంగా పాత స్మార్ట్ ఫోన్ సగటు అమ్మకం ధర (ASP) ఏడాది వ్యవధిలో రూ.9 వేల నుంచి రూ.11 వేలకు పెరిగినట్లు ఈ ఆన్‌లైన్ వ్యాపార వేదిక పేర్కొంది.
ఇదివరకు కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నవారు వరుసగా మూడేళ్లపాటు దాన్ని వాడిన తర్వాత మరో కొత్త మోడల్‌వైపు చూసేవారు. ఇప్పుడీ వ్యవధి ప్రత్యేకించి రెండో, మూడో అంచె నగరాల్లో రెండేళ్లకు తగ్గిందని OLX చెబుతోంది.
గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో తమ వేదికద్వారా అమ్మకానికి వచ్చిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య 1.4 కోట్లుగా OLX ప్రకటించింది. ఆ మేరకు 2017 ఏప్రిల్-జూన్ మధ్య 25 లక్షల ఫోన్లు అమ్మకానికి రాగా, ఈ ఏడాది అదే కాలంలో (2018 ఏప్రిల్-జూన్) ఈ సంఖ్య 35 లక్షలకు పెరిగి, 40 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.
‘‘మా వేదికపై అత్యధికంగా లావాదేవీలు నడిచేది మొబైల్ ఫోన్ల విభాగంలోనే. పాత స్మార్ట్ ఫోన్ల క్రయవిక్రయాల్లో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్న మన దేశంలో వాటి అమ్మకాలు-కొనుగోళ్ల తీరును మేం సమూలంగా మార్చేశాం’’ అని OLX ఇండియా, ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్ విభాగం అధిపతి ఆకాంక్ష ధమీజా చెప్పారు. సరికొత్త స్మార్ట్ ఫోన్ల గురించి తక్షణ సమాచారం లభిస్తున్నందువల్ల వినియోగదారులు నెలల వ్యవధిలోనే కొత్త మోడళ్లకు మారిపోతున్నారని వివరించారు.
‘‘ఈ పరిణామంవల్ల అంతగా వాడని, కొత్తదనం మాయని పాత స్మార్ట్ ఫోన్లు పెద్దసంఖ్యలో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఫోన్ల వాస్తవ విడిభాగాల తయారీదారులు (OEMs), విక్రేత కంపెనీలు కూడా ఇలాంటి అమ్మకపు-కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని ధమీజా పేర్కొన్నారు.
పరిశ్రమ అంచనా ప్రకారం... మన దేశంలో పాత స్మార్ట్ ఫోన్ల అమ్మకం ఏటా 32 శాతం వంతున పెరుగుతూ 2020 నాటికి 4.6 కోట్ల స్థాయికి చేరుతుంది. డీలర్లు, చిల్లర వర్తకులు, దుకాణ యజమానుల స్థాయి (ఆఫ్‌లైన్)లో ఈ వ్యాపారం అధికంగా సాగుతున్నా ఆన్‌లైన్ వేదికలమీద కూడా క్రయవిక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి.
OLX ఆన్‌లైన్ వేదికమీద శామ్‌సంగ్, యాపిల్, షియోమీ బ్రాండ్ ఫోన్ల క్రయవిక్రయాలు అత్యధికం కాగా, శామ్‌సంగ్ 20 శాతం వాటాతో ప్రథమస్థానంలో ఉంది. అయితే, గడచిన ఏడాది వ్యవధిలో షియోమీ బ్రాండ్ వాటా 12.8 శాతం నుంచి 17.6 శాతానికి పెరగ్గా, యాపిల్ 13.2 శాతం వాటాతో మూడోస్థానంలో నిలిచింది.
Smart phone Pre-owned OLX