ఆండ్రాయిడ్‌ 11లో అంద‌రూ ఉండాల‌ని కోరుకుంటున్న కొత్త ఫీచ‌ర్లు ఏంటి?

మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో యూజ‌ర్ల‌ను అల‌రిస్తోంది.  ఫ‌స్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ క‌ప్ కేక్ నుంచి ఇటీవ‌లే వ‌చ్చిన ఆండ్రాయిడ్ ఓ వ‌ర‌కు ప‌ది జ‌న‌రేష‌న్లు ఆండ్రాయిడ్ మ‌న‌ల్ని ప‌ల‌క‌రించింది. త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 11 రాబోతోంది. దీనిలో ఇంకా ఏమేం ఫీచ‌ర్లు ఉండాల‌ని యూజ‌ర్లు కోరుకుంటున్నారో ఓ లుక్కేద్దాం రండి..
 

మ‌రిన్ని బ్యాట‌రీ మోడ్స్‌
గూగుల్ ఇప్ప‌టికే డోజ్ మోడ్‌తోపాటు బ్యాట‌రీ సేవ‌ర్ మోడ్స్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. ఇవి స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ప్ర‌ధానంగా ఎదుర్కొనే బ్యాట‌రీ డ్రెయిన్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తున్నాయి. అయితే పిక్సెల్ 4 లాంటి  హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో బ్యాట‌రీ త్వ‌ర‌గా ఖ‌ర్చ‌యిపోయే ప‌రిస్థితి ఇంకా ఉంది. రాబోయే ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌లో బ్యాట‌రీ డ్రెయిన్ స‌మ‌స్య‌ను అరిక‌ట్టే మ‌రిన్ని బ్యాట‌రీ మోడ్స్ ఉండాల‌ని వినియోగదారులు కోరుకుంటున్నారు.  శాంసంగ్‌లో ఉండే మాదిరిగా అల్ట్రా ప‌వ‌ర్ సేవ‌ర్ మోడ్ ఉంటే బాగుంటుంది.  

స్క్రోలింగ్ అండ్ పార్షియ‌ల్‌ స్క్రీన్‌షాట్ మోడ్స్‌
ఆండ్రాయిడ్ స్టాక్ వెర్ష‌న్‌లో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్ స‌పోర్ట్ లేదు. దీంతో వెబ్‌పేజీల‌ను లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే కుదర‌డం లేదు. స్క్రీన్ మీద క‌నిపించినంత వ‌ర‌కే స్క్రీన్‌షాట్ తీసుకోగ‌లుగుతున్నాం. లేటెస్ట్ మోడ‌ల్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్ ఉంది. దీన్ని ఆండ్రాయిడ్ 11లో తీసుకొస్తే బేస్ మోడ‌ల్ ఫోన్ల‌లో కూడా ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తుంది. అలాగే రియ‌ల్‌మీ యూఐలో పార్షియ‌ల్ స్క్రీన్‌షాట్ స‌పోర్ట్ ఉంది. అంటే కావ‌ల్సిన‌చోట మూడు వేళ్ల‌తో టాప్ చేసి సెలెక్ట్ చేసి అంత‌వ‌ర‌కే స్క్రీన్‌షాట్ తీసుకోవ‌చ్చు. ఈ పార్షియ‌ల్ స్క్రీన్‌షాట్ మోడ్ కూడా కొత్ అప్‌డేట్‌లో ఉండాల‌ని కోరుతున్నారు.

స్పెష‌ల్ గేమ్ మోడ్స్ 
శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల‌లో ప్ర‌త్యేక‌మైన గేమింగ్ మోడ్స్‌, దానికి అనుబంధంగా కొన్ని టూల్స్ కూడా ఉంటాయి.  ఆండ్రాయిడ్ 11లో కూడా ఇలాంటి గేమింగ్ స్పెష‌ల్ మోడ్స్‌, స్పెష‌ల్ టూల్స్ ఇచ్చి గేమింగ్‌కు ప్ర‌త్యేకంగా కొంత స్పేస్ కేటాయించాల‌ని యూజ‌ర్ల కోరిక‌. 

మ‌రిన్ని ప్రైవ‌సీ ఫీచ‌ర్లు
ఒప్పో, రియ‌ల్‌మీ త‌మ టాప్ మోడ‌ల్ ఫోన్ల‌లో ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ ప్రొటెక్ష‌న్ ఫీచ‌ర్ తీసుకొచ్చాయి. ఆండ్రాయిడ్ 11లో కూడా ఇలాంటివి కావాలి. అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ల‌న్నింటిలో మ‌రిన్ని ప్రైవ‌సీ ఫీచ‌ర్లు యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌స్తాయి. అలాగే ఐఫోన్‌లో ఉన్న‌ట్లు ఎయిర్‌డ్రాప్ వంటి ఫీచర్లు కూడా కోరుతున్నారు.  
ఇంకా డెస్క్‌టాప్ మోడ్‌, ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ మోడ్‌లాంటివి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 వెర్ష‌న్‌లో ఉండాల‌న్న‌ది యూజ‌ర్ల కోరిక‌.
 

Android 11 wishlist New features we want to see in Android 11 ఆండ్రాయిడ్ 11 ఆండ్రాయిడ్ 11లో కొత్త ఫీచ‌ర్లు