ఏటీఎంలు రోజు రొజుకు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక విశ్లేషణ

రెండేళ్ల నుంచి దేశంలో ఏటీఎంల కొరత తీవ్రమవుతోంది. ఇదే సమయంలో ఏటీఎం లావాదేవీలు మాత్రం పెరిగిపోయాయి. మరోపక్క నిబంధనలు కఠినతరం కావడంతో ఏటీఎంల నిర్వహణ కూడా భారంగా మారుతోంది. ఈ విషయం ఇటీవల విడుదల చేసిన ఆర్‌బీఐ గణాంకాల్లో స్పష్టంగా తెలుస్తోంది. బ్రిక్స్‌ దేశాల్లో ప్రతి లక్షమందికి అతి తక్కువ ఏటీఎంలు అందుబాటులో ఉన్న దేశాల్లో మనదే కావడం ఆశ్చర్యపరిచే అంశం. 
 
గత ఏడాది రిజర్వు బ్యాంక్‌ ఏటీఎంల నిర్వహణ, భద్రతకు సంబంధించిన నిబంధనలను మార్చింది. దీంతో కొత్త సాఫ్ట్‌వేర్‌, పరికరాల కొనుగోళ్లు ఏటీఎంల నిర్వాహకులకు, బ్యాంకులకు భారంగా మారింది. దీంతో ఏటీఎంల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. మరో పక్క పెద్ద నోట్లు రద్దైనా ప్రజలు పూర్తిగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌కు, కార్డులకు అలవాటుపడలేదు. దీంతో నగదు లావాదేవీల సంఖ్యలో గణనీయమైన మార్పులు రాలేదు. 

ఏటీఎంల వద్ద లావాదేవీలు భద్రతా నిబంధనల కఠనతరంగా ఉండటంతో నిర్వాహకుల లాభాల్లో భారీగా కోతపడుతోంది. వారికి వచ్చే మొత్తాలకు బ్యాంకింగ్‌ రంగంలోని కీలక కమిటీ ఆమోదముద్ర ఉండాలి. ప్రస్తుతం బ్యాంకులు ఇంటర్‌ఛార్జీల రూపంలో రూ.15 వరకు వసూలు చేస్తున్నాయి. బ్యాంక్‌ల ఏటీఎంల నిర్వహణలో ఇది అత్యంత కీలకమైంది. బ్యాంకులు సొంత ఏటీఎంల నిర్వహణ కంటే లావాదేవీల సమయంలో ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన ఇంటర్‌ ఛార్జీలను తగ్గించుకోవడానికి చూస్తోన్నాయి.

దేశంలోనే అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ,  తన ఏటీఎంల సంఖ్యను తగ్గించింది.  ఇటీవల ఎస్‌బీఐ బ్యాంకు ఆరు బ్యాంకులను వీలీనం చేసుకుంది. వాటికి సంబంధించిన ఏటీఎంలను కూడా  మూసివేస్తోంది. ఈ ఏడాది జూన్ లో 59,291 ఏటీఏంలను కల్గి ఉన్న ఎస్‌బీఐ,  ఆ సంఖ్క్ష్య‌ను 59,200లకు తగ్గించింది.  పంజాబ్ నేషనల్ బ్యాంకు 10,502 ఏటీఎంల నుంచి 10,083 తగ్గించింది.  హెచ్‌డిఎఫ్‌సి కూడా తన ఏటీఎంల సంఖ్యను తగ్గించింది. 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని రకాల పథకాల కారణంగా 2014 తర్వాత నుంచి అదనంగా 355 మిలియన్ల మంది బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దనోట్లు రద్దు కావడంతో ఏటీఎంలపై ఒత్తిడి పెరిగిపోయింది. దీనికి తోడు చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్రాంచులను తగ్గించుకోవడం ఏటీఎంల సంఖ్య పడిపోవడానికి కారణమైంది. ఇప్పటికే ప్రతి రెండు ఏటీఎంల్లో ఒకటి బ్యాంక్‌ బ్రాంచ్‌ల వద్ద ఉంటోంది.  ఏటీఎంల సంఖ్య తగ్గడం మొబైల్‌ బ్యాంకింగ్‌కు ఊతమిస్తోంది. దేశంలో గత ఐదేళ్లలో మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు 65 రెట్లు పెరిగాయి.

న్యూస్ ఏటీఎం బ్యాంకింగ్ ఏటీఎం లావాదేవీలు ఏటీఎంల నిర్వహణ రిజర్వు బ్యాంక్‌