దేశీయ మొబైల్ కంపెనీలు ఎక్కడ, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ?

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ దే రాజ్యం నడుస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడగల ఒక్క దేశీయ కంపెనీ మచ్చుకైనా కానరావడం లేదు. ఓ సారి ఐదేళ్లు వెనక్కు వెళితే అప్పుడు కార్బన్ మొబైల్స్, మైక్రోమాక్స్, ఇంటెక్స్, లావా వంటి దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు దేశీయ మార్కెట్‌లో తన సత్తాను చాటాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడటం లేదు. విదేశీ కంపెనీలు పక్కనే ఉన్న చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు మన మార్కెట్‌లోకి దూసుకొచ్చి వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఎంతలా అంటే మన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం వీటి ఆధిపత్యమే నడుస్తోంది. మరి మన కంపెనీలు ఏం చేస్తున్నాయంటే సమాధానం రావడం కొంచెం కష్టంగానే ఉంది. 

2015లో స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లో దేశీ సంస్థల వాటా 43 శాతంగా ఉండేది. 2018 నాటికి ఈ వాటా ఒక అంకె స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి 10 స్మార్ట్‌ఫోన్స్‌లో 6 చైనా బ్రాండ్స్‌వే ఉన్నాయి. దీనిబట్టి పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. కాగా పక్కా వ్యూహంతో చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. ముందుగా ఆన్‌లైన్‌ మార్గాన్ని ఎంచుకుని కంపెనీ వ్యయాలను భారీగా తగ్గించుకుంటూ వచ్చాయి. 

మరోవైపు తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు అందించడం కూడా చైనా బ్రాండ్లకు కలిసొచ్చింది. అలాగే చైనా కంపెనీల మార్కెటింగ్ వ్యూహాలు కూడా వాటి అమ్మకాలను మరింతగా ముందుకు తీసుకువెళుతున్నాయి. ఫ్లాష్ సేల్స్ నిర్వహించడం అలాగే ఏదైనా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చి, దాన్ని మార్కెటింగ్ కోసం వినియోగించుకోవడం లాంటి కొత్త టెక్నాలజీ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. 

చైనా బ్రాండ్లు ఆన్‌లైన్ మార్గంలో దేశీ మార్కెట్‌లో నిలదొక్కుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్‌లైన్‌ స్టోర్లను ఏర్పాటు చేస్తూ దేశీయ మార్కెట్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. షియోమి, వివో, ఒప్పొ, వన్‌ ప్లస్‌, హానర్ వంటి చైనా సంస్థలు అందుబాటు ధరల్లో అద్భుతమైన ఫీచర్లతో కొత్త కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూ దూకుడుగా దూసుకెళ్లిపోతున్నాయి. ఈ కంపెనీల దెబ్బకు చివరకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ను కూడా మన మార్కెట్‌లో అగ్రస్థానం నుంచి పడింది. ఆపిల్ సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు.. 

న్యూస్ టెక్నాలజీ ఇండియా చైనా మొబైల్స్ కార్బన్ మైక్రోమాక్స్ ఇంటెక్స్ లావా