మొబైల్, ఇంట్లోకి ఏదైనా వస్తువు.. ఇలా ఆన్‌లైన్‌లో ఏదైనా ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. ఎంతో కొంత వడ్డీతో ప్రతి నెలా దీనిని చెల్లిస్తూ ఉంటాం. కొన్నిసార్లు జీరో పర్సంట్ ఈఎంఐతో ఆఫర్లు అనగానే ఎగిరి గంతులేస్తాం. ఎంతోమంది ఈ మాయలో పడి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఇందులో అసలు వాస్తవాలు తెలుస్తాయంటున్నారు నిపుణులు. అసలు ఈ జీరో పర్సంట్ వడ్డీ అనేదే వాస్తవం కాదని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మనం అనుకున్నదాని కంటే ఎక్కువే చెల్లిస్తామని వివరిస్తున్నారు. ఈ జీరో శాతం వడ్డీ వెనుక ఉన్న ఎన్నో ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం!
రెండేళ్ల ముందు వరకూ..
రెండేళ్ల ముందు వరకూ ఇటువంటి జీరో పర్సంట్ ఫైనాన్స్ ప్లాన్స్ చాలా అందుబాటులో ఉండేవి. వీటిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రించడంతో చాలా వరకూ ఈ సదుపాయాన్ని కల్పించడం లేదు. ప్రస్తుతం కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు మాత్రమే ఇటువంటి జీరో పర్సంట్ ఫైనాన్స్ రుణాలను అందిస్తున్నాయి. ఇందులో వ్యాపారస్తుడు ఎంత చెబితే అంత చెల్లిస్తామే తప్ప.. అంతకు మించి ఎక్కువ చెల్లించం అనే ఆలోచనలో ఉంటాం. కనుక అవసరం లేని వస్తువుల వైపు ఆకర్షితులయ్యేలా చేసి చివరకు వాటిని కొనుగోలు చేసేలా ప్రభావితం చేయడానికే ఇటువంటి రుణాలను ఇస్తుంటారట.
అసలులోనే ఎక్స్‌ట్రా అమౌంట్
ఈ జీరో పర్సంట్ ఈఎంఐలో వస్తువుకు ఎక్కువ ధర చెల్లించడం లేదనుకుని సంతోషపడనక్కర్లేదు. ఎందుకంటే మన నుంచి అదనంగా తీసుకోనట్లు కనిపించినా.. ఈఎంఐలోనే ఎక్స్‌ట్రా అమౌంట్ కలిపి ఉంటుందట. ఉదాహరణకు 48 వేలతో టీవీని జీరో ఫైనాన్స్‌లో తీసుకున్నాం. నెలకి రూ.8 వేలు చొప్పున ఆరు నెలలు ఈఎంఐ కడితే చాలదట. ఇందులో హ్యాండ్లింగ్ చార్జెస్ రూ.వెయ్యి ఉంటాయి. సాధారణంగా వ్యాపారస్తుడు చెప్పిన దాని కంటే ఎంతో కొంత తక్కువకు బేరమాడటమో లేక వ్యాపారస్తుడు ఎంతో కొంత తగ్గించడమో జరుగుతుంది. కానీ ఆన్‌లైన్‌లో అలా ఉండదు. దీనివల్ల రిబేటు అనే మాటే ఉండదు. ఈ టీవీ మీద రూ.2 వేలు రిబేటు ఉందనుకుందాం. మొత్తం మూడు వేల వరకూ తగ్గితే.. మనం కట్టాల్సింది రూ.45 వేలు మాత్రమే. కానీ 6 నెలలకు రూ.3వేలు అదనంగా చెల్లిస్తున్నాం.
పూర్తి వివరాలు తెలుసుకున్నాకే..
జీరో పర్సంట్ ఆఫర్ అని చూడగానే వెంటనే కొనేయకుండా.. ప్రాథమికంగా కొంతమందిని అడిగి, పూర్తి వివరాలు తెలుసుకున్నాక తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అమ్మకం ధర ఏమైనా తగ్గుతోందా లేక మొత్తం కట్టాల్సి ఉంటుందా, ఎక్స్ఛేంజ్ చార్జీలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని అప్పుడు మాత్రమే వీటి వైపు చూడాలని స్పష్టంచేస్తున్నారు.
ప్లాన్ల రూపం మారిందట..
ఈ జీరో పర్సంట్ ప్లాన్లు ఇప్పుడు లేవా అని అంటే.. ఉన్నాయట. అయితే ఈ ప్లాన్ రూపం మారిందని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని క్రెడిట్ కార్డులు పెడుతున్న ఆఫర్లను గుర్తుచేస్తున్నారు. రూ.5 వేల కంటే ఎక్కువ వినియోగిస్తే.. ఆ మొత్తాన్ని జీరో పర్సంట్ వడ్డీతో మూడు నెలల్లో ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చని ఆఫర్లు ఇస్తున్నాయి. దీని వల్ల అనుకున్న బడ్జెట్ కంటే ఖర్చు 3 నుంచి 5 శాతం అదనంగా పెరుగుతోంది. ఇది కూడా ఒకలాంటి జీరో పర్సంట్ మాయాజాలమేనని చెబుతున్నారు. ఈ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలంటే.. గతంలో ఇలాంటి వాటిలో ఇరుక్కుని మోసపోయిన వారి సలహాలు సూచనలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే..
ఈ జీరో పర్సంట్ ఈఎంఐలో రిటైల్ క్లయింట్లకు వచ్చే లాభం చాలా తక్కువని తేలిపోయింది. ఇందులో చిక్కుకోకుండా ఉండాలంటే.. మొత్తం బిల్లు అంతా ఒకేసారి కట్టేసేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ఆఫర్లంటే ఆసక్తి క్రమక్రమంగా తగ్గుతుంది. అంతేగాక మనకి అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనే ఉండదు. ఒకవేళ ఇలాంటి ఎక్కువ ప్లాన్‌లో మీరు భాగస్వాములు అయి ఉంటే.. మీకు ఈఎంఐ కష్టాలు మరింత పెరిగినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ జీరో పర్సంట్ స్కీమ్‌లను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇటువంటి మోసాల కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరిన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు.
0 percent interest loan facts emi offer rbi credit card à°•à±à°°à±†à°¡à°¿à°Ÿà± కారà±à°¡à±à°¸à± లోనà±